Contributed by : Madhu Thatikonda
అది 2001. నేను మా ఊరు వదిలి పక్కనే ఉన్న టౌన్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోడానికి వచ్చా. అప్పుడు నాకు ఆరు ఏళ్ళు. మా నాన్న కి ఒక ఇరవై ఎకరాలు ఉన్నాయి అంటే కొంచెం బానే వూర్లో పెద్ద రైతు. సెలవులు వచ్చినపుడు మా వూరికి వెళ్ళే వాణ్ణి. అప్పట్లో ఏ పండగ వచ్చిన చాలా బాగా జరుపుకునే వాళ్ళు. ఊరి నిండా జనాలు ఇంటి నిండా పాడి పశువులు, చుట్టూ పొలాలు. పండగ వస్తే ఇంట్లో చుట్టాలతోటి కళకళ లాడేవి. ఏ కష్టం వచ్చిన పొలం పక్కనే ధైర్యం చెప్పే ఒక మనిషి ఇంటి పక్కనే కళ్ళు తుడిచే ఒక చెయ్యి ఉండేవి. ఊర్లోకి వెళ్ళగానే కనపడిన వాళ్ళంతా నవ్వుతూ పలకరించేవాళ్ళు. పైకి కనపడే నవ్వులు చూసి అందరు సంతోషంగానే ఉన్నారు అనుకునేవాడిని. కానీ ఆ నవ్వుల వెనకాల ఎవరితో చెప్పలేని బాధలు ఎవరూ పడనంత కష్టం ఉన్నాయని అప్పుడు అర్ధం అయ్యేది కాదు. మా నాన్న చెప్తుండేవాడు వ్యవసాయం చాలా కష్టం బాగా చదువుకో, నువ్వు ఈ కష్టాలు పడాల్సిన పని ఉండదు అని. అప్పుడు ఆ కష్టాలు తెలిసే అంత అనుభవం లేదు, మా నాన్న చెప్పింది అర్ధం చేసుకునే వయసు కాదు.
అయిదు ఏళ్ళు గడిచిపోయాయి నేను ఏడో తరగతికి వచ్చా. ఊర్లో జనాలు తగ్గిపోయారు. పండడానికి భూమి ఉన్న పండించే డబ్బులు లేవు, అప్పు తీసుకొని పండించే ధైర్యం లేదు, తీసుకున్నా తిరుస్తామన్న నమ్మకం లేదు. అందుకే సొంత భూమి ఉన్నవాళ్ళు కూడా ఎవరి దగ్గరో పనిచేయడానికి కొంతమంది వలసపోయారు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని అప్పు తీసుకొని వ్యవసాయం చేసి అది తీర్చలేక మళ్ళి ధైర్యం తెచ్చుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది. అప్పుడప్పుడు నన్ను చూడడానికి మా నాన్న వచ్చేవాడు ఈ అయిదు ఏళ్ళలో మా నాన్న కళ్ళలో నమ్మకం ధైర్యం రెండు తగ్గుకుంటూ వచ్చాయి. మా నాన్న కళ్ళలో నే కాదు ఊర్లో అందరి రైతుల్లో నిరాశ మొదలయింది. వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారిందని పెట్టుబడికి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా సమయానికి కూలీలు దొరక్క కష్టాలు పడుతున్నారని చెప్పెవాడు. పెద్ద రైతులే ఇన్ని కష్టాలు పడుతుంటే సన్నకారు రైతుల గురుంచి తలుచుకుంటేనే భయ౦ వేసింది నాకు. ఈ అయిదు ఏళ్ళలో ఏం జరిగిందో అర్ధం కాలేదు కానీ మంచి అయితే జరగట్లేదు అని అర్ధం అయింది. భవిష్యత్తు ఇంకా దారుణంగా మారుతది అని అర్ధం అయింది.
ఇంకో పది ఏళ్ళు గడిచాయి నా ఇంజనీరింగ్ అయిపోడానికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. మా ఊరు అప్పటికి ఇప్పటికి చాలా మారింది మట్టి రోడ్ లు సిమెంట్ రోడ్ లు అయ్యాయి. పెంకుటిల్లులు డాబా లు అయ్యాయి కానీ పూరి గుడిసలు మాత్రం అలానే ఉన్నాయి. బయటికి వెళ్లి బాగా చదువుకొని డబ్బులు సంపాదించిన వాళ్ళు డాబాలు కట్టుకున్నారు ఊర్లో వ్యవసాయం చేసుకుంటునవాళ్ళు అలానే ఉన్నారు. ఒకప్పుడు ఊర్లో బస్సు దిగగానే డబ్బా కొట్టు లోంచి నవ్వుతూ పలకరించే మనిషి ఉండే వాడు ఇప్పుడు ఆ కొట్టు లేదు ఆ మనిషి లేడు. ఇన్నిరోజులు కష్టపడి వ్యవసాయం చేసి ఇక చేసే బలం ఓపిక రెండు లేక బలహీనులు అయిపోయారు. ఆ బలహీనతను చాలా మంది వ్యాపారంగా మార్చుకున్నారు రోడ్ పక్కన ఉన్న భూమిని రైతులనుంచి కొని దాన్ని ముక్కలు చేసి ప్లాట్ ల కింద అమ్మేస్తున్నారు. పచ్చని భూమిని ముక్కలు చేసి అమ్మడం అంటే తల్లి గర్భాన్ని ముక్కలు చేసినంత పాపమే.
ఈ పదిహేను ఏళ్ళలో మన దేశం ఆధునికత వైపే పరుగులు తిసిందో లేక రైతుని పూర్తిగా అంధకారం లోకే తోసేసిందో మనమే తేల్చుకోవాలి. 2001 నుంచి సుమారుగా 237,673 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లే అని బాపు గారు అన్నారు కానీ ఇప్పుడు పల్లెలు చుస్తే ఆకలిచావులు,అప్పులబాధలే కనిపిస్తున్నాయి. రైతు దేశానికీ వెన్నుముక్క అంటారు ఇప్పుడు ఆ వేనుముక్క విరిగిపోతుంది. ప్రతిరోజు ప్రతిక్షణం రైతు తన పరిస్థితులతో పోరాడుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకో పదేళ్ళ తర్వాత ఒకప్పుడు రైతు ఉండేవాడు అని చెప్పుకునే పరిస్థితి వస్తది. ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. ప్రతిరోజు మనకి అవసరమైన అన్నదాత కి ఎంతో కొంత మనం తిరిగి ఇచ్చే సమయం వచ్చింది...!!!!
చివరిగా....... ఇన్ని రోజులు మన అవసరాలు తీర్చిన రైతుకి ఈరోజు మన అవసరం వచ్చింది ఇన్ని రోజులు మన ఆకలి తీర్చిన రైతుకి ఈరోజు ఆకలేస్తుంది. కానీ ఆ ఆకలి తీర్చే వాడు ఏడి ఆ అవసరo లో ఆదుకునేవాడేడి. తన కష్టంతో ఇన్ని రోజులు అన్న దానం చేసి ఇప్పుడు దాత కోసం ఎదురుచూస్తున్న ఆ అన్నదాతకి దాత ఏడి???
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.