ప్రతి ఒక్కరి జీవిత కథ ఒక్కోలా ఉండదు, అలాగే వారి విజయం కూడా. శ్రమ, పట్టుదల, అంకిత భావం, ప్రణాలికలు ఇవ్వే విజేతలకున్న ఆయుధాలు.
హైదరాబాద్ కు చెందిన విజయ్ తన చిన్నతనంలో అమ్మానాన్నలతో కలిసి ఎగ్జిబిషన్ కు వచ్చాడు. కొత్త బట్టలు, రుచికరమైన ఆహార పదార్ధాలు, రంగు రంగుల బొమ్మలు, వీటన్నీటితో ఉన్న ఆ ఎగ్జిబిషన్ లో కేవలం ఒకే ఒక్క వస్తువు విజయ్ ను విపరీతంగా ఆకర్షించింది. అదే గాలిలో ఎగిరే బొమ్మ.
పిల్లల కలలకు పేదరికం అడ్డుగా ఉండడం ఎంతో బాధాకరం. అమ్మ ఆ బొమ్మను కొనివ్వలేకపోయింది. అమ్మ కొననివ్వనందుకే కాబోలు విజయ్ కు ఆ బొమ్మ మీద ప్రేమ పెరిగింది. దానిని ఎవరు ఎలా తయారుచేసి ఉంటారు.? అది ఎలా గాలిలో ఎగరగలుగుతుంది.? నేనే ఆ బొమ్మను తయారుచేసుకుంటే గనుక అమ్మను డబ్బులు అడిగే అవకాశం ఉండదు కదా.. అంటూ రకరకాల ఆలోచనలో మునిగిపోయాడు.
స్కూల్ టీచర్ సహాయంతో గాలిలో ఎగిరే బొమ్మను ఐతే తయారుచేయగలిగాడు కాని వయసు పెరుగుతున్న కొద్ది లక్ష్యం కూడా ఎదుగుతూ వచ్చింది. లక్ష్యానికి తగ్గట్టుగా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసి కల నెరవవేర్చుకోవాలని భావించాడు కాని పరిస్థితులు సహాయం చెయ్యలేదు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవ్వడంతో B.Com డిగ్రీ చేయవలసి వచ్చింది.
చిన్నతనం నుండి ఉన్న ఆలోచనలు కదా ఓ పట్టానా ఎలా పోతుంది. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్, టెక్నాలజీ అందరికి అందుబాటులోకి రావడంతో ఏ కోచింగ్ లేకుండానే యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ రోబోటిక్ బర్డ్స్ ను రూపొందించాడు విజయ్.
ఒక్కసారి గాలిలోకి ఎగిరాక అచ్చం నిజమైన జీవం ఉన్న పక్షిలా కనిపించే ఈ రోబో బర్డ్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. దేశ రక్షణ కోసం మరిన్ని రోబోటిక్ బర్డ్స్ ను తయారుచెయ్యాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న విజయ్ ఇప్పటి వరకు తిరుచ్చి ఎన్.ఐ.టి , బెంగళూర్ జైన్ యూనివర్సిటీ , డెహ్రాడున్ పెట్రోలియమ్ యూనివర్సిటీ లతో పాటు 30 కాలేజీలలో 7000 విద్యార్థులను కలిసి ఎయిర్ క్రాఫ్ట్ వర్క్ షాప్ ల ద్వారా వీటి మీద అవగాహన తరగతులను అందించాడు. అందిస్తున్నాడు