Idea by Gouse Pasha
మంచి కన్నా చెడుకు వేగం ఎక్కువ అదే త్వరగా విస్తరిస్తుందనంటారు కాని శక్తివంతమైన మంచి కూడా అంతే స్థాయిలో విస్తరిస్తుంది.. అత్యున్నత ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో దాదాపు 5,500 ఐ.ఏ.ఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీరిలో చాలామందికి రాని గుర్తింపు కొంతమందికి మాత్రమే వస్తుంది కారణం వారి నిజాయితీ వల్లనే కదా.. ఒక్కసారి మీరు ఐ.ఏ.ఎస్ "రోహిణి సింధూరి" అని గూగుల్ లో సెర్చ్ చేస్తే రోహిణి సింధూరి ఫలానా ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ ఐయ్యింది అనే న్యూస్ ఇబ్బడి ముబ్బడిగా వచ్చేంటాయి.. ఏ బాధ్యతలు నిర్వహించినా గాని అందులో కఠినంగా ఉండడంతో ఎమ్.ఎల్.ఏలు, మంత్రులు సైతం ఆమెను విభేందించేవారు.. ఒకవేళ తను ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ ఐయ్యింది డబ్బు సంపాదించుకోవడానికైతే దేశంలో రోహిణి గారి పేరు ఇలా మారుమ్రోగిపోయుండేదా.?
మన ఖమ్మం జిల్లానే..
అమ్మ శ్రీలక్ష్మీ, నాన్న జైపాల్ గారిది ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలోని రుద్రాక్షపల్లి గ్రామం. నిత్యం ఇంట్లో గడిపే తల్లిదండ్రుల వ్యక్తిత్వం వారి పిల్లలపై తీవ్రప్రభావం చూపెడుతుంది. రోహిణి గారిలో నిజాయితీతో కూడిన క్రమశిక్షణ అలవడడానికి గల ప్రధాన కారణం అమ్మ శ్రీలక్ష్మీ గారు. దాదాపు 30 సంవత్సరాలుగా అమ్మ సేవారంగంలో ఉంటూ సమాజానికి ఆత్మీయతంగా ఎంతో సేవ చేసేవారు. ఇంట్లో ఈ వ్యక్తిత్వం నిండిన వ్యక్తి ఉండగా విదేశాలకనో, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకనో సమాజానికి ఉపయోగపడని రొటీన్ జీవితాన్ని ఎందుకు కోరుకుంటారు.?
అమెరికా వద్దు:
రోహిణి గారిని అమ్మ నాన్నలు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగం, ఉన్నత జీవితం కోసం అమెరికా పంపాలని ఆశించారు. ఎంతైనా రోహిణి సింధూరి గారు శ్రీలక్ష్మీ గారి కూతురు కనుక ససేమిరా ఒప్పుకోలేదు. "కలెక్టర్ అవుతానమ్మా" అని ఎంతో ఆశగా కోరిన కోరికను తల్లిదండ్రులు కూడా అంతే ఆనందంతో ఒప్పుకున్నారు.. గొప్ప కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించారు. అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి.. ఇక మంచి ప్రణాళికలతో ఐ.ఏ.ఎస్ కావడమే ముందున్న లక్ష్యం అనుకుంటున్న తరుణంలో రోహిణి గారికి యాక్సిడెంట్ జరిగింది.
ఢిల్లీ లో ఓరోజు రోడ్ క్రాస్ చేస్తుండగా అటుగా వస్తున్న కారు రోహిణీ గారిని ఢీ కొట్టింది. ఈ విషయం తెలుసుకుని హుటాహుటిగా ఢిల్లీ వెళ్ళి చూశాక పేరెంట్స్ మరింత బాధ పడ్డారు ఎందుకంటే తగిలిన గాయాలు అతి తీవ్రమైనవి. ఆ తర్వాతనే వారికి రోహిణి మరింత కొత్తగా కనిపించింది. కలెక్టర్ అవ్వాలనే తపన ఏ స్థాయిలో ఉందోనని తెలిసింది కూడా ఆ సందర్భంలోనే.. గాయలవ్వడంతో బెడ్ మీద పడుకుని చదువుకోవడం నుండి, వీల్ ఛైయిర్ పై కూర్చిని చదువుకోవడం ఆఖరికి వాష్ రూం గోడలపై రాస్తూ కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యారు.
కలెక్టర్ అవ్వగలను అనే నమ్మకం రోహిణి గారికి, పేరెంట్స్ కు ఉన్నా గాని ఇతర బంధువులు మాత్రం హేళనగా మాట్లాడేవారు. స్వతహాగా అందంగా ఉండడం వల్ల బంధువులు నుండి పెళ్ళి సంబంధాలు అడిగేవారు కాని రోహిణి గారు ఇవ్వేమి ఆలోచించకుండా అనుకున్నట్టుగానే ఐ.ఏ.ఎస్ కలను నిజం చేసుకున్నారు.
ప్రభుత్వం ఏ బాధ్యతలు అందించినా గాని తనలో, సాటి అధికారులలో ఏ తప్పు, నిర్లక్ష్యం దొర్లకుండా పనిచేసేవారు. ఈ కోవలోనే సామన్య ప్రజానీకం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు ఎంతోమంది మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక హసన్ జిల్లా డీసీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా కొన్ని సమస్యలపై మంత్రుల నుండి విభేదాలు వచ్చాయి.. "రోహిణి ఇక్కడ ఉంటే మేము ఆశించిన పనులు జరగవని భావించి" మంత్రులు రోహిణి గారిని ట్రాన్స్ ఫర్ చేయాలని భావించారు.. పై నుండి లిఖితపూర్వక ఆదేశాలు కూడా అందాయి. ఐతే హసన్ జిల్లా నుండి రోహిణి గారు వెళ్ళితే మళ్ళి పాత పరిస్థితులే వస్తాయని భావించిన అక్కడి ప్రజలు రోడ్డు మీదకు వచ్చి రోహిణి గారిని ట్రాన్స్ ఫర్ చేయడానికి వీలులేదు అని తమ సొంత సమస్యలా ఉద్యమం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజలు తిట్టుకునే అధికారులు ఎంతోమంది ఉంటారు కాని అధికారుల కోసమే ఇలా ప్రేమతో ఉద్యమాలు చేయించుకునే వారు కొందరే ఉంటారు..