రోహిత్ (9441100075) 2017లోనే Council For Transforming India మొదలు పెట్టి రోడ్ సేఫ్టీ గురించిన సెమినార్లు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఒకరోజు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆఫీసర్ తో మాటలు కలిశాయి. "డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వెహికిల్ తో రోడ్డు ఎక్కడానికి వీలు లేదు" అన్న మాటలకు కొనసాగింపుగానే ఆ ఆఫీసర్ భారతదేశంలోనే మన రెండు తెలుగు రాష్టాలలో అత్యధికంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి.. ప్రతి డ్రైవింగ్ లైసెన్స్ వెనుక "వారి బ్లడ్ గ్రూప్ కూడా మెన్షన్ చేస్తే కనుక సగం ప్రాణాలు కాపాడొచ్చు" అనే వాస్తవం ఆ డిస్కషన్ లో తేలింది!!

తప్పనిసరి చేసుకోవచ్చు:
తమ బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగితే ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి ఏ గ్రూప్ అని తెలుసుకునే సమయం వృధా కాదు. ఇండియన్ మోటర్ వెహికల్ ఆక్ట్ లో "పేరు, తల్లిదండ్రుల పేర్లు" తప్పనిసరి చేశారు కానీ బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేయాలన్న విషయాన్ని ఆప్షనల్ చేశారు. అసలైతే రాష్ట్రాలకు బ్లడ్ గ్రూప్ మెన్షన్ చెయ్యడం తప్పనిసరి చేసే సౌలభ్యం కూడా ఉంది. దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో బ్లడ్ గ్రూప్ ఆప్షనల్ గానే ఉంచారు కానీ మన పక్కనే ఉన్న తమిళనాడులో దీన్ని తప్పనిసరి చెయ్యడం వల్ల ట్రీట్మెంట్ కు ఆలస్యం అవ్వకుండా చాలా ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారు.

రెండు సంవత్సరాలుగా పోరాటం:
రోహిత్ ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లి రోడ్ సేఫ్టీకి సంబంధించిన జాగ్రత్తలు వివరిస్తుంటారు. ఇప్పటికి రెండు సంవత్సరాలలో 12,000 మందిని కలుసుకున్నారు. ఆ మధ్య ఉప్పల్ లోని ఓ స్కూల్ విద్యార్థులు స్కూల్ కు బైక్ లు వేసుకువస్తున్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ ఇంకా అతని టీం స్కూల్ కు వెళ్లి సెమినార్ కండెక్ట్ చేశారు.. ఆ తర్వాతి నుండి బలవంతంగా కాకుండా తమకు తామే మారి బైక్ వాడడం మానేశారు. ఇలాంటి ఉదాహరణలు వీరి ప్రయాణంలో ఎన్నో..

CTI ద్వారా రోహిత్ ఇంకా అతని టీం రెండు సంవత్సరాలుగా అధికారులు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఎన్ని రకాలుగా "డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ మ్యాండేటరీ" చెయ్యాలనే విషయాన్ని చేరవేసినా గాని, పై నుండి ఏ విధమైన పాజిటివ్ రెస్పెన్స్ లేకపోవడం బాధాకరం. ఇది ఒక వ్యక్తికి, మరొకరి స్వార్ధం కోసం చేస్తున్న పోరాటం కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి విలువైన ప్రాణం దృష్టిలో పెట్టుకునే జరుగుతుంది. ఎదో జరగకూడని పెద్ద ప్రమాదం జరిగితే తప్పా అప్పటివరకు కదలిక జరగదా.?

