జరిగిన కథ: Part - 1 Part - 2
ఏడుస్తూ కూర్చున్న రుద్ర ముందు ఓ జీపువచ్చి ఆగుతుంది, వర్షం కూడా. జీపులో నుండి ఓ నలుగురు వస్తాదులు దిగుతారు. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ సరిగ్గా కనిపించని సాయంత్రపు సమయంలో, విపరీతంగా వర్షం పడి ఉన్నపళంగా ఆగిపోయిన క్షణాన, జీపుకు వెలుగుతున్న ఇండికేటర్ ఎరుపు రంగు వలన, వర్షంలో తడిసిన రుద్ర మొహం అంతా ఎర్రగా కనిపిస్తుంది. రుద్ర ఎవ్వరిని పట్టించుకోలేదు. వేళ్ళతో రెండు చేతులని జతచేసి, మొహంలో ఎటువంటి భావనా లేకుండా, శూన్యంలోకి చూస్తూ అక్కడే కూర్చున్నాడు రుద్ర. “వీడేంట్రా ముండమోపిలా వెధవముండ ఇంటి ముందు కూర్చున్నాడు ? మొగుడిలా చూసుకుందాం అనుకున్నాడేమో ? ఏరా! మొన్న దీని గురించి మాట్లాడితేనే కదా మా వాళ్ళని కొట్టావ్. ఉందా అది లోపల ? ఏయ్! రావే బయటకి. నేను లేనప్పుడు కొట్టాడు వీడు మావాళ్ళని, ఇప్పుడు వీడితో నీకు తాళికట్టించి, కాపురం నేను చేస్తా. రేయ్! అది వస్తుందా ? నువ్ తీసుకోస్తావా ? నన్ను లాక్కురమ్మంటావా ?” అంటూ జీపులో నుండి రుద్రకి ఎదురుగా కొంచెం దూరంలో ఉన్న బురదనీళ్ళలోకి దూకాడు ఒకడు. అంత భారీ దేహం ఒకేసారి దూకేప్పటికి, బురద నీళ్ళు మొత్తం రుద్ర మీద పడ్డాయి, ఐనా కనురెప్ప కూడా వేయలేదు రుద్ర. ఆ వస్తాదులు గేటుని తంతున్నారు, గొడవ గొడవగా అరుస్తున్నారు, రుద్రని మాటలతో రెచ్చగొడుతున్నారు, కాని రుద్ర మీద చేయ్యేసే సాహసం చేయటం లేదు.
తన ముందు ఇంత జరుగుతున్నా, చలించకుండా కూర్చున్న రుద్ర మనసులో...
ఎందుకు వెళ్ళిపోయింది ? నేనంటే ఇష్టం లేకపోతె ఇంతకాలం వెంట రానిచ్చి ఉండేది కాదు. నేనంటే ఇష్టం ఉందా ? మరి ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయింది ? వెళ్లిపోయిందా – వెళ్ళగొట్టారా ? నేనేం చేస్తానో అని భయపడి వెళ్ళిందా – నేనేలా తీసుకుంటానో అని భయపడి వెళ్ళిందా ? సొంత ఇల్లు, తిండిపెట్టె ఉద్యోగం, పెరిగిన ఊరు అన్నిటిని నా వల్ల వదిలేసి వెళ్లిపోయిందా ? ఎక్కడికి వెళ్ళింది ? ఎలా పట్టుకోవటం ? ఎవరు సాయం చేసారు ? భయపెట్టారా – భయపడిందా ? నాతో ఉండలేకా – నేనున్న చోట ఉండలేకా ? ఎందుకు... ఎందుకు... ఎందుకు వెళ్ళిపోయింది? ఉత్తినే వెళ్ళలేదు...నన్ను కాదని వెళ్లిపోయింది. నన్ను కాదని వెళ్లిపోతుందా, రుద్రగాడ్ని కాదని వెళ్ళిపోతుందా... రుద్రని కాదని, నన్ను... రుద్రని... కాదని... వద్దని... రుద్రని... నన్ను... వెళ్ళిపోయింది... నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుందా?... ఇలా ప్రశ్నల సునామిలో రుద్ర ఆలోచనలు కొట్టుకుపోతుంటే, ఆవేదన, ఉక్రోశం, శోకం, కోపం, ద్వేషం ఒకేసారి లోపల రగులుతుంటే, ఆ సమయంలో రుద్ర మీద చెయ్యేసాడు ఒకడు. “ఎరా! ఎంతసేపు ఆగాలి దానికోసం. కురిసిన వానకి ఒళ్ళంతా చల్లారిపోయింది, ఒక్కసారి దాన్ని తీసుకోచ్చావంటే, కాసింత ఒళ్ళు వేడిచేసుకొని పంపించేస్తా. లే...” అంటూ కాలర్ పట్టుకొని లేపుతున్నాడు వాడు రుద్రని.
రుద్ర అసలు ఈ లోకంలో లేడు. నన్ను కాదని వెళ్ళిపోతుందా అనే ఆలోచన అహాన్ని కవ్విస్తూ రుద్రలో మృగాన్ని రెచ్చగొడుతుంది. ఆ కోపంలో తనేం చేస్తున్నాడో తనకే తెలీని స్థితికి వెళ్ళే సమయంలో, వాణి ఫోటో రుద్రకి కనిపించేలా చూపిస్తూ... “ఇదేనా నీ ప్రేయసి... రేయ్ ఇదేగా... పిలుస్తుంటే రాదెంట్రా? హా...హా.. ఎలా వస్తుంది... ఎక్కడ ఉందొ చెప్పనా... ఆ... ఓ గంట ముందే దాన్ని రంగమ్మ అంగట్లో తాకట్టు పెట్టి, ఓ గంటసేపు అలసిపోయి వచ్చా. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాల్రా, నీకు మా...న్చి టేస్ట్ ఉంది. నాకే పావుగంట పట్టింది దాని మదం అణచటానికి. థాంక్స్ రా అబ్బాయ్... నువ్ లేకపోతే దీన్ని మేము చూసే వాళ్ళమే కాదు, ఇందా ఈ 100 ఉంచుకో.” అంటూ రుద్ర మొహం మీద 100 నోటు విసిరేసి, “చాలా కాలం తర్వాత మాంచి విషయం ఉన్న కేసు దొరికిందిరా... ఓ రెండు వారాలు వాడుకొని ఆ తర్వాత తెచ్చిస్తాంలే” అంటూ ముగ్గురు జీపు ఎక్కుతుంటే, “అదేంటన్న, వీడి మక్కేలిరగ్గోట్టకుండా మాటలు చెప్పి వెళ్తున్నారు” అని ఒకడు రుద్ర ఎదురుగా నిలబడి అంటుంటే “రేయ్! ఇప్పటికి వాడికి ఈ డోస్ చాలులే. రా... తర్వాత చూద్దాం వాడి సంగతి” అంటూ మిగిలిన వాళ్ళు పిలుస్తున్నారు. వీడికి రుద్రని కొట్టకుండా వెళ్ళటం ఇష్టం లేదు, ఒక్కడే కొట్టేంత దమ్ములేదు, ధైర్యం చేసి కొడదామా అంటే సపోర్ట్ లేదు, కాని అక్కడి నుండి కదలాలని లేదు. వాడ్ని వాడే తిట్టుకుంటూ, వాడు భయపడుతూ, రుద్రని మాటలతో భయపెట్టాలని పైకి బిగ్గరగా అరుస్తూ వెళ్లి జీపు ఎక్కుతాడు.
జీపు స్టార్ట్ ఐన శబ్దం... “రేయ్! అది కావాలంటే పొద్దున్నే ఐదింటికి రంగమ్మ అంగడికి వెళ్ళు. నీ అదృష్టం బావుంటే ఆ టైం కి అది ఖాళీగానే ఉండొచ్చు. హ హ హ... మర్చిపోకు... రంగమ్మ అంగడి...”. రంగమ్మ అంగడి అని రెండో సారి అన్నప్పుడు రుద్రకి చలనం వస్తుంది. వెంటనే వెళ్తున్న జీపు వెనక వేగంగా పరిగెత్తి, ఆ జీపు ముందు నిలబడతాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందర్నీ చితకోట్టేసి, పక్కనున్న బురదగుంటలో పడేసి, జీపు తీసుకొని రంగమ్మ అంగడికి వెళ్తాడు. అక్కడ అంగుళం, అంగుళం వెతుకుతాడు. ఎక్కడా కనపడదు వాణి. రంగమ్మని, ఆమె మనుషులని అందరిని అడుగుతాడు. మొదట రుద్రని భయపెట్టో, బెదిరించో డబ్బులు లాగుదాం అనుకున్న వాళ్ళు, రుద్ర కోపాన్ని, ఆవేశాన్ని తట్టుకోలేక వాళ్ళ దగ్గర లేదని నిజం చెప్తారు. రుద్ర డబ్బులు ఇవ్వటానికి కూడా సిద్ధపడతాడు, కాని వాళ్ళదగ్గర లేని వాణిని ఎక్కడ నుండి తేగలరు. వాణి అక్కడ లేదని నిర్ధారించుకొని, బురదలో వదిలేసిన వస్తాదుల దగ్గరికి వచ్చి బతిమాలుతాడు. ఎక్కడ ఉందొ చెప్పండి బాబాయ్, మీకేం కావాలన్నా చేస్తాను, నన్ను కొట్టండి కావాలంటే, ప్లీజ్ బాబాయ్, మీకు తెలిస్తే చెప్పండి, ప్లీజ్. తను కావాలి బాబాయ్ నాకు, క్షమించండి మిమ్మల్ని కొట్టాను. నాకేం చెయ్యాలో అర్ధం అవ్వటం లేదు బాబాయ్. నన్ను కొట్టండి బాబాయ్, కొట్టండి. తను ఎక్కడుందో తెలిస్తే చెప్పండి బాబాయ్... ప్లీజ్... దండం పెడతాను... కాళ్ళు పట్టుకుంటాను. అంటూ గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూ, ఆ వస్తాదులని వాటేసుకొని ఏడుస్తున్నాడు రుద్ర. రుద్ర ప్రవర్తన అర్ధం కాక తికమక పడుతూ, భయంగా “మాకు నిజంగా తెలీదు రుద్ర...” అని చెప్పి ఆ నలుగురు వెళ్ళిపోతారు.
కొన్నేళ్ళ తర్వాత...
మార్కెట్ యార్డులో, పల్లీల షెడ్ కింద, శివ ఆటోలో కూర్చొని చూస్తుంటే, ఓ పక్కగా మణి పల్లీలు శ్రద్ధగా తింటూ ఉంటె, వీళ్లిద్దరికి కొంచెం దూరంలో చెక్క కుర్చీలో రుద్ర కూర్చొని... తప్పు చేసింది రాంజీ సేట్, తన్నులు తింటుంది ఖాదర్ భాయ్. తప్పు కదూ. తప్పా కదా? అని ఎదురుగా రెప్ప వేయకుండా, ఉచ్వాస నిశ్వాసాలను తొక్కిపట్టి, కనురెప్పలు బార్లా తెరిచి చూస్తున్న చలనం లేని జనాన్ని అడిగాడు రుద్ర. మొదటి సారి అడిగినప్పుడు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. తప్పా కాదా ? అని మరోసారి అడగ్గానే, వాళ్ళూ మనుషులే అనే నిజం గుర్తొచ్చి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కాని నోరు తెరవలేదు. తప్పా కాదా ? “తప్పే...” ముక్తకంఠంతో, దిక్కులు పెక్కటిల్లేలా, ప్రభంజనం అనే పదానికి రుజువులా, జనగళం దద్దరిల్లింది ఒక్కసారిగా. తప్పేనా ? “తప్పే” ఎవరిది ? “రాంజీ సేట్ ది” అని టక్కున చెప్పారు అందరూ. ఎవరిదీ ? “రాంజీ సేట్ ది” కొద్దిగా సంకోచిస్తూ చెప్పారు అందరు. ఎవరిదీ ? ఎవ్వడూ మాట్లాడలేదు, వాళ్ళకి అర్ధం అయ్యింది రాంజీ సేట్ చేసింది తప్పే, కాని దాన్ని ఆపకుండా చూస్తున్న వాళ్ళది కూడా తప్పేనని. అందరూ మౌనంగా, తలదించుకొని, దీనంగా చూస్తున్నారు. ఖాదర్ భాయ్ ని కొడుతుంటే ఎందుకు ఆపలేదు ?...ఎవ్వరూ సమాధానం ఇవ్వరని నాకు తెలుసు, సమాధానం కూడా తెలుసు. ఖాదర్ భాయ్ ముసల్మాన్, మనోడు కాదు. మీరేం మాట్లాడరని తెలుసు, కాని...పిడికిలి బిగించిన చేతితో ఎప్పటికీ రవ్వంత కూడా సాయం చేయలేం. పరిస్తితులను బట్టే మనిషి ప్రవర్తన. నలుగురి మంచి కోరేవాడేవడైన వాడు మన వాడే. అని రుద్ర చెప్తుంటే రాంజీ సేట్ ని తీసుకొని వస్తాడు గణ.
ఆ... రాంజీ సాబ్ రండి, రండి. “అదీ, తప్పైపోయింది రుద్ర. తొందరపాటులో జరిగింది, ఇంకోసారి జరక్కుండా చూసుకుంటాను.” నాకు కాదు సాబ్, భాయ్ కి చెప్పండి. “తప్పైపోయింది రా ఖాదర్, క్షమించు” అని అసంతృప్తిగా, అసంపూర్ణంగా, మాట సరిగ్గా వినపడకుండా చెప్తాడు సేట్. “చెప్పేసాను రుద్రా.” ఆ...విన్నాంగా...కాని అలా చెప్తే సరిపోయేలా లేదు సాబ్. భాయ్ కాళ్ళు పట్టుకొని, కళ్ళ వైపు చూస్తూ, అందరికీ వినపడేలా ఇందాకా కొట్టేప్పుడు అరిచిన అరుపుని మరిపించేలా చెప్పండి. “ఏం మాట్లాడుతున్నావ్, వీడి కాళ్ళు నేను పట్టుకోవాలా ?” కాలర్ పట్టుకున్నప్పుడు, కాళ్ళతో తంతునప్పుడు గుర్తురాలేదా సాబ్ ఇలాంటి పరిస్తితి వస్తుందని. కాలం భలే విడ్డురం చేస్తుంది సేట్, తిరిగి తిరిగి ఎక్కడ ఆగాలో అక్కడే ఆగుతుంది. కానీవ్వండి... “నా గురించి నీకు పూర్తిగా తెలీదు రుద్ర” కానివ్వు... “నేనెవరో, నా వెనుక ఎవరున్నారో నీకు తెలీదు, ఒక్క మాట చెప్పానంటే ఒక్క ముక్క కూడా దొరకదు నీ బాడీలో” కానీయ్... అంటూ రాంజీ సేట్ ని లాగి భాయ్ కాళ్ళ దగ్గర పడేస్తాడు రుద్ర. చెప్పు, క్షమాపణ చెప్పు. ఇంకోసారి, ఏ నా కొడుకైన పేదోళ్ళ మీద అధికారం చెలాయించాలని చూసారో, మార్కెట్ యార్డ్ లో కొన్ని శాల్తీలు గల్లంతవుతాయ్. భాయ్, రేపటినుండి నువ్వు ఇంటికి రా. సాబ్... మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.
మార్కెట్ నుండి కారులో వెళ్తు... మణి-“రుద్ర, ఆ రెడ్డి బాగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేయమంటావ్ ?” చంపెసేద్దాం అనేలా చూస్తున్నాడు శివ. గణ-“ఇంకొన్ని రోజులు చూద్దాం, అప్పటికి తోక జాడిస్తె అప్పుడు చూద్దాం.” రుద్ర అలానే చేద్దాం అన్నట్టు చూస్తాడు. దారిలో కొబ్బరి బొండాల బండి చూసి, ఆపండి, ఆపండి అని సైగ చేస్తాడు శివ. గణ-“ఈ దారిలో ఈ బండి ఎప్పుడు పెట్టారు ?” అని ఆలోచిస్తూ కార్ ఆపి, దిగి, అందరూ నడుచుకుంటూ బొండాల బండి దగ్గరికి వస్తారు. మణి-“అన్నా చూస్తే మా ఊరి వాడిలా లేవు, ఎక్కడి నుండి వచ్చావ్ ? ఐనా బొండాలు కొట్టటానికి ఇన్ని కత్తులు ఎందుకన్నా?” వాడ్ని చూస్తుంటే బొండాలు అమ్మే వాడిలా లేడు. చింపిరి జుట్టు, దుమ్ముపట్టి పోయిన బట్టలు, మోకాళ్ళ పైకి కట్టిన గళ్ళ లుంగీ, కుడి చేతి మనికట్టు నిండా మంత్రించిన దారాలు, జార్దా పాన్ కి బ్రాండ్ అంబాసడర్ లా దంతాలు. అందరూ తలా ఓ కొబ్బరి బొండాం తాగుతుంటే, వెనుక నుండి గన్ పెట్టి “వెనక్కి తిరక్కు” అని ఓ స్వరం. సరిగ్గా అప్పుడే ఎదురుగా బొండాలు అమ్మేవాడు వేరే కత్తి చేతిలో పట్టుకొని తెగనరకడానికి సిద్ధంగా ఉన్నాడు.
మిగిలిన కథ తర్వాతి భాగం లో