జరిగిన కథ: Part - 1 Part - 2 Part - 3
రుద్ర, మణి, గణ, శివ, బొండాలు అమ్మేవాడితో సహా అందరూ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారు. రుద్ర ఎదురుగా ఒక ఎస్ ఐ నిల్చొని “నేను ఎన్ని సార్లు చెప్పినా, నువ్వు నా మాట వినటం లేదు. అందుకే ఇలా చేయక తప్పలేదు” అని రుద్ర చేతులు పట్టుకొని చెప్తున్నాడు. సర్లే...మరీ ఇంత నాటకం అవసరమా. మాటలతో చెప్పుంటే అయిపోయేది. “ఎన్ని సార్లు చెప్పాన్రా, ఒక్కసారైనా చెవులకు ఎక్కిందా? ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఉంది. ఐనా వాడి వాలకం చూసి కూడా బొండాలు అమ్మేవాడని ఎలా అనుకున్నారు. జాగ్రత్తగా లేపోయినా పర్లేదు, అలసత్వం పనికిరాదు, అది చాలా ప్రమాదం.” సర్లేరా... ఇక మేము వెళ్ళొచ్చా. “ఉండండి, మొదటిసారి మా స్టేషన్ కి వచ్చారు. భోజనం చెప్పాను, తినేసి వెళ్ళండి” ఆ భోజనమేదో వాడికి పెట్టు అంటూ ఆ బొండాలు అమ్మే వాడ్ని చూపిస్తూ, మేము బయలుదేరతాం ఇంకా. వచ్చే వారం ఇంటికి రా ఒకసారి అని వెళ్ళిపోతారు రుద్రా వాళ్ళు. స్టేషన్ నుండి బయటకి రాగానే గణ,మణి-“రుద్ర...ఎవరతను ?” అని అడిగితె, శివ అదే ప్రశ్న వచ్చేలా సైగ చేస్తాడు. వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అన్నా...నాలుగు టీ అని టీ షాప్ వాడికి చెప్తాడు. ఇంతకీ ఎవరతను అని ఆ ముగ్గురూ అదే ప్రశ్న అడగ్గానే, ముందు ఈ టీ తీసుకోండి అని టీ అందిస్తాడు. టీ తాగుతూ, ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ఆతురుత.
“ఆతురుత కాదు ఆవేదన, ఆందోళన” అని వెనక నుండి ఓ ఆడ గొంతు. ఎవరా అని నలుగురు వెనక్కి చూడగానే ఓ అందమైన అమ్మాయి, నార చీర, పొడుగాటి జడ, చేతి నిండా గాజులు, పద్దతిగా పెట్టిన నిండు బొట్టు, కనుబొమ్మలతో సహా కళ్ళని కాపు కాసేట్టు ఉన్న కళ్ళజోడు, ముక్కుని మెరిపించే ముక్కెర, చెవులను పలికించే బుట్ట దిద్దులు, రుద్ర భుజాల కు ఓ ఇంచు పై వరకు సరిపడేంత ఎత్తు, లేత గోధుమ రంగు వర్ణంలో సాదా సీదా తెలుగు ఆడపడుచులా ఉంది. భుజానికో సంచి, అందులో కొన్ని కాగితాలు, ఎడమ చేతిలో చిన్న పుస్తకం, కుడి చేతిలో సన్నటి పెన్ను, వాలకం చూస్తే ఓ విలేకరిలా ఉంది. ఎవరమ్మాయ్ నువ్వు ? అని అడిగాడు రుద్ర. తనని చూసి గణ, మణి, శివ ముగ్గురూ “హ్మ్...మేము ఇంటికి వెళ్తాం, నువ్వు త్వరగా వచ్చేయ్” అంటూ కార్ తీసుకొని వెళ్ళిపోతారు. పుస్తకం, పెన్ను రెండూ బ్యాగులో పడేసి, రుద్ర భుజాల మీద రెండు చేతులు వేసి, రుద్ర కళ్ళలోకి చూస్తూ “నేనెవరో తెలీదా మీకు ?” అని అడుగుతుంది తను.
తెలీదని నేను అనలేదే. “ఎవరమ్మాయ్ అన్నావ్”. అంటే... నువ్వెవరో నీకు తెలుసో లేదో అని, తెలిస్తే తెలుకుందాం అని, తెలీకపోతే తెలియచేద్దాం అని. “ఆహా! ఔనా! ఏది నేనవరో ఎందుకు కాని, నా పేరేంటో చెప్పు అసలా” అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం. “కవితలు తర్వాత ముందు పేరు చెప్పు కన్నా.” చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది. “చలం శ్రీశ్రీ మాటలు వల్లించటం విడ్డూరంగా ఉంది కాని, పేరు చెప్పు” పేరులో ఏముంది మిత్రమా...కష్టపడకుండా సంపాదించుకున్నది, ఎంతకష్టపడ్డా సంపాదించలేనిది. మాలిన్యం అంటని మనసు కదా ముఖ్యం. “కళ్ళతో మాట్లాడే వ్యక్తి పెదాలు బానే కదలుతున్నాయే?”. ఎప్పుడో అన్నారు కదా పెద్దలు, ఆరు నెల్ల సావాసంలో వారు, వీరవుతారు. “మనుషులు మారుతారని అన్నారు, విన్నారు, కానీ మౌనం మాట్లాడుతుందని ఎవరైనా కలగన్నారా ?”. కొన్నిసార్లు మౌనం కూడా మాట్లాడుతుంది లే, అర్ధం చేసుకోగల మనసు, వినేంత తీరిక, చెప్పాలనిపించే శ్రద్ధ చూపించే మనుషులు కనపడాలే కాని.
“పేరు చెప్పమంటే, ప్రాసలతో పదాలను ప్రయాసపెడుతున్నావ్. పేరేంటో చెప్పవయ్య.” చెప్పలేక కాదు. “మరి ?” చెప్పాలని లేక, ఐనా ఇందాక నువ్వే చెప్పావ్ కదా. “హ్మ్...నీకెప్పటికి గుర్తుండాలి. ఐనా నీకు నా పేరు గుర్తుండాలి అనుకోవటం నా పిచ్చి, కాదు వెర్రి...కాదు మూర్కత్వం. సర్లే కాని, ఏంటి ఇక్కడ ఉన్నారు అందరూ. ఏదైనా గొడవా ?” లేదు. నరసింహం(యస్ ఐ) ఒకసారి కలిసి వెల్లమంటేను. “ఏంటి విషయం ?”. చెప్పాను కదా. “నాకు కూడా చెప్పకూడదా ?” నీకు తెలియాల్సినది చెప్పకుండా ఉన్నానా ఎప్పుడైనా ? “నీకు తెలిసినవన్ని నాకు తెలీకూడదా ?”. సముద్రం లోతు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఎక్కువ తెలిసే కొద్ది, ఇబ్బందుల అలల్లో మునిగిపోవటం, సమస్యల సుడుల్లో చిక్కుకోవటం తప్ప ఒరిగేదేముంది చెప్పు. “నాకు తెలీనివి ఏమున్నాయని నీ దగ్గర.” నా గురించిన విషయాలు నీకు తెలిసి నాకు తెలియనివి ఉన్నాయా ? “బోలెడన్ని.” ఏం తెలుసు ? “ఏం తెలీకుండానే, నీతో కలిసి తిరుగుతున్నానా ?” ముందు ఏం తెలుసుకున్నావో చెప్పు, తర్వాత ఏం తెలుసుకోవాలో చెప్తా. “నేనేం తెలుసుకోలేదని అనుకుంటున్నావో అవన్నీ, నేనేం తెలుసుకోకూడదని కోరుకుంటున్నావో అవి కూడా”.
ఔనా!...నువ్వు చెప్పింది అట్ట పుస్తకాలు, ఇంకు ఇంకిన కాగితాలు, అచ్చువేసిన యంత్రాల సాక్షిగా అక్షరాలా నిజమోయ్ చలం. ఆడవాళ్ళు మామలు వాళ్ళు కాదు అని మనసులో అనుకోని, నాకు తెలియని నీకు తెలిసిన నా విషయాలు ఏంటో చెప్తే నేను తెలుసుకుంటాగా. “విజ్ఞప్తా ? ఆజ్ఞ్య ?” అర్జీ. “అర్జీలు పెట్టటానికి నేనేం నీపై అధికారిని కాదే.” చెప్తావా ? వెళ్ళమంటావా ? అని వెళ్లబోతుంటే “నాకు నీ గురించి మొత్తం తెలుసు, ఎక్కడి నుండి చెప్పమంటావ్ ?” నీకు మొదలు ఎక్కడి నుండి తెలుసో అక్కడి నుండే మొదలుపెట్టు. “చెప్తాను కాని, నాకో మాటివ్వు ముందు.” అని చేయి చాచి ఒట్టేయమంటుంది. పెదాలు దాటి పారిపోయే పదాలకే విలువిచ్చే మనిషిని, చేతులు చేసే వాగ్దానాలు ఎందుకు ? నా వాక్కు వీగిపోని వాగ్దానమే. “నాకు తెలుసు...” అంటూ బ్యాగ్ లోనుండి ఓ పెద్ద ఫైల్ తీసి రుద్ర ముందు పెడుతుంది. రుద్ర ఫైల్ మొదటి పేజి తీయ్యగానే... రుద్ర చిన్నప్పటి ఫోటో కుడి వైపుగా అంటించి ఉన్న కాగితంలో...
మోతుకూరి రఘురామయ్య,
s/o మోతుకూరి బలరామయ్య.
జననం: 29-04-1962, స్వస్థలం: పొన్నెకల్లు.
తల్లి ప్రమోదిని. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు మొత్తం ముగ్గురు సంతానంలో పరంధామయ్య అలియాస్ ? మొదటి కొడుడు, రఘురామయ్య అలియాస్ రుద్ర, రెండో కొడుకు, విజయ లక్ష్మి అలియాస్ శోభ, చివరి సంతానం. రుద్రకి ఆరేల్లప్పుడు, అతని తండ్రి బలరామయ్యని, తల్లి ప్రమోదినిని వెంకటేశం అలియాస్ శంకరన్న చంపేసాడు. అప్పటి నుండి రుద్ర శంకరన్న దగ్గరే ఉంటున్నాడు. అక్కడికి ఒక పేజి పూర్తయ్యింది, తర్వాతి పేజి చదువుదాం అని తిప్పగానే, కవిత(రుద్ర కోసం వచ్చిన విలేకరి) ఫైల్ లాక్కుంటుంది. ఇటివ్వు, మొదలెట్టగానే ముగించేస్తే ఎలా!. “మొదలు, చివర తెలిసిన వాడివే కదా. ఇస్తాలే కాని, నాకో విషయం చెప్పు.” ఏంటి ? “ఎంత పర్సనల్ అయినా చెప్పాలి మరి” చెప్పకుండానే ఓ పుస్తకం రాసేంత తెలుసుకున్నావ్ కదా, ఇంకేం ఉందని నేను చెప్పటానికి. “ఇంకో పురాణం కూడా రాయగలను కాని అందులో నిజం ఉందో, లేదో తెలీదు కదా. అది తెలిసింది నీకొక్కడికే, అందుకే అడుగుతున్నాను చెప్తావా ?”. నాకు తెలిసింది చెప్తాను, ఏంటి ? “మీ నాన్నని చంపింది ఎవరు ?” నానా. “శంకరాన్నేనా ? నిజంగా శంకరన్నేనా ?”. నేను చూసేప్పటికి నాన్న అమ్మ ఒడిలో పడి ఉన్నారు, నానా చేతిలో గన్ ఉంది, గన్ నుండి పొగొస్తుంది, అమ్మ నాన్నని చూస్తూ ఏడుస్తుంది. రుద్ర ఇలా చెప్తుంటే కవిత ఆశ్చర్యంగా, నిశ్చేష్టురాలై చూస్తుంది. అమ్మాయ్... ఏంటలా ఊపిరున్న శిలలా చూస్తున్నావ్ ? అమ్మాయ్... నిన్నే.
కవిత ఒక్కసారిగా తేరుకొని “నిజంగా శంకరన్నే చంపాడా ? నిజం ?” నేను చూసింది చెప్పాను, అక్కడేం జరిగిందో, ఏది నిజమో నాకు తెలీదు. “నీ తల్లిదండ్రులని చంపిన శంకర్ మీద నీకు కోపం లేదా ?”. ఇద్దరినీ కాదు, మా నాన్నని మాత్రమే. “మరి మీ అమ్మగారు ?” మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది అని రుద్ర చెప్తుంటే అతని కళ్ళలో నుండి కన్నీరు ధారగా కారుతుంది. కవిత రుద్ర కన్నీరు చూసి కూడా పట్టించుకోకుండా “మీ నాన్నని చంపిన వ్యక్తితో ఎందుకు కలిసుంటున్నావ్ ? ఎందుకు అతని కోసం కలబడుతున్నావ్ ? ఎందుకు అతని మీద అంత అభిమానం చూపిస్తున్నావ్ ?”. రుద్ర ఏం మాట్లాడలేదు. కవిత వైపు చూడకుండా పక్కకి చూస్తూ, గడ్డం మీద చేయి పెట్టి ఎదో ఆలోచిస్తున్నాడు. కవిత రుద్ర వైపే చూస్తుంది, ఏం చెప్తాడా అని. ఓ పక్క రుద్రని అడుగుతూనే, మరోపక్క నోట్ పాడ్ లో రాసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత, రుద్ర ఓ పెద్ద నిట్టూర్పు విడిచి ఏంటి అడిగావ్ ? “అదే, శంకరన్నతో ఎందుకు కలిసి ఉంటున్నావ్ ఇప్పటికి కూడా అని”. ఇప్పటికి కూడా అంటే ? “చిన్నప్పుడు అంటే ఎవరో ఒకరు కావాలి, నీకేం తేలీదు కాబట్టి ఉన్నావ్. ఇప్పుడు నీ అవసరం అతనికి ఉంది కాని, నీకు ఎవ్వరి అవసరం లేదు. మీ వాళ్ళని చంపింది అతనే అని తెలుసు. ఐనా కూడా అతన్ని చంపకుండా, అతనికోసం చావటానికి కూడా ఎందుకు వెనకాడటం లేదని ?” హ...హా...హా...చాలా పెద్ద ప్రశ్న. ఎందుకు అతన్ని చంపటం లేదు ? ఎందుకు అతనితో ఉంటున్నా ? ఎందుకు...? ఎందుకూ అంటే...
మిగిలిన కథ తర్వాతి భాగంలో