Samantha's Work With Pratyusha Foundation Is Proof That She Truly Has A Heart Of Gold!
Srikanth Kashetti
Updated on
"తీసుకోవడంలో కాదండి, ఇవ్వడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది" సమంత ఈ మాట చెప్పినప్పుడు ఇంత చిన్న వయసులోనే అంత జీవితాన్ని ఎలా అనుభవించిందా అని అనుకున్నా.. నిజానికి గొప్ప హృదయం ఉన్నవారి మాటలు, పనులు గొప్పగానే ఉంటాయి. "సమంత" దక్షిణ భారతదేశంలో అందమైన అగ్ర నటి మాత్రమే కాదు, ఒక స్టార్ హీరోయిన్ గా పేదవారికి సేవ చేయడంలో కూడా తనదే అగ్రస్థానం. కొంతమంది హీరోలు తమకు తోచినట్టుగా కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కాని హీరోయిన్లు అంటే చాలా తక్కువ. తమ సమయాన్ని, డబ్బును పేదవారికి సహాయంగా ఇచ్చే హీరోయిన్లు అత్యంత అరుదు. ఈ విషయంలో అందమైన నటనకు, గొప్ప సేవకు తనకు తనే సాటి అని నిరూపించుకుంటుంది అక్కినేని సమంత.
ప్రత్యూష వెలుగులు..
"చీకటిని చీల్చుకుంటు ఉదయించే సూర్యుని తొలి కిరణ సైనికులను ప్రత్యూషగా పిలుస్తారు". సమంత ఈ ప్రత్యూష పేరుతో ఫౌండేషన్ స్థాపించడానికి ఒక బలమైన కారణం ఉంది. ఒకసారి "సమంతాకు ఆరోగ్యం బాగోలేక చాలా రోజులు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. తను అనుభవిస్తున్న బాధ కన్నా ఆ హాస్పిటల్ లో మిగిలిన వారు ఆర్ధికంగా బాధ పడుతున్న తీరు తనను తీవ్రంగా కలిచివేసింది. "ఏదైనా ఒక కష్టం కలుగుతుందంటే దాని తర్వాత ఒక పరిపూర్ణమైన ఆనందం ఉంటుందన్నట్టు.. ఇంకా ఆ కష్టమే మనల్ని ఒక ఉన్నత లక్ష్యానికి తీసుకెళ్తుందన్నట్టు "ఇలా కూర్చుని బాధ పడడం కన్నా వారి బాధను కొంతైనా తగ్గించాలి. అది ఒకరిద్దరి వరకు మాత్రమే కాకుండా శాశ్వతంగా ఎంతమందికి వీలుంటే అంతమందికి సేవ చేయాలని అప్పుడే బలంగా నిర్ణయించుకుంది". ఇలాంటి ధృడ సంకల్పం కలగడానికి తన తల్లి కూడా ఒక గొప్ప స్పూర్తి. సమంతది ఒక మధ్యతరగతి కుటుంబం. వారి కుటుంబం ఆర్ధికంగా కొంత ఇబ్బంది పడుతున్నా కూడా సమంత తల్లి పేదవారికి సేవ చేసేవారట.
అమ్మ నాన్నల ఎంపిక భగవంతుడు నిర్ణయిస్తే స్నేహం మాత్రం మన అదృష్టం కొద్ది ఏర్పడుతాయని నమ్మే సమంతకు ప్రత్యూష ఫౌండేషన్ స్థాపన కోసం మరో ఇద్దరు మిత్రులు తోడయ్యారు. ఒక సందర్భంలో సమంత గైనకాలజిస్ట్ మంజుల అనగని, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు శశి మందా లను కలవడం జరిగింది.. వీరి ముగ్గరి లక్ష్యాలు ఒకటే అవ్వడంతో "ప్రత్యూష ఫౌండేషన్" తొందరగానే స్థాపించారు. అనారోగ్యంగా ఉన్న చిన్నారులను, మహిళలను ఆదుకోవడం, మహిళలకు తీవ్రమైన ప్రాణాంతక వ్యాదులు రాకముందే తగిన జాగ్రత్తలు ఎలా పాటించాలి అని వివరించడం ఈ సంస్థ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే ప్రత్యూష సపోర్ట్ స్థాపించిన తొలిరోజుల్లోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతోమంది చిన్న పిల్లలకు అపరేషన్ చేయించారు. తెలంగాణలోని రేయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తో పాటు ఆంధ్రపదేశ్ లోని కొన్ని కార్పోరేట్ హాస్పిటల్స్ వారి అమూల్యమైన సహకారంతో ఈ ఉద్యమం కొనసాగుతుంది.
ప్రత్యూష నిర్వహణ, ఫండ్స్..
అనాధాశ్రమంలోని పిల్లలకు ఆర్ధికంగా సహాయం చేస్తూనే వారి ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది ఈ ఫౌండేషన్. ఇప్పటి వరకు ఎంతోమందికి చూపులేని వారికి కంటి ఆపరేషన్లు, వివిధ ప్రాంతాలలో వైద్య శిబిరాల ఏర్పాటు, 'మేక్ ఏ విష్' ద్వారా చిన్నారుల కలలను నిజం చేయడం ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలలో సమంత ఆధ్వర్యంలోని "ప్రత్యూష" ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతుంది. ఒక స్టార్ హీరోయిన్ గా ఉంటూనే ఏ మొహమాటం లేకుండా సమంత ఇంకా వారి టీం ఫండ్స్ సేకరిస్తారు. అలాగే సినిమాలో ఉపయోగించిన ప్రత్యేక వస్తువులను వేలం ద్వారా అమ్మి, సెలెబ్రేటీలతో కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేస్తుంటారు. "ప్రత్యూష" ఇంకా సమంత మీద ఉన్న అభిమానంతో అడగగానే సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎంతోమంది అండగా ఉంటూ విరాళాలను అందిస్తుంటారు. హైదరాబాద్ లో ఉన్న 'ప్రత్యూష సపోర్ట్'ను ప్రస్తుతం తమిళనాడులో కూడా ఏర్పాటుచేయాలని అందుకు తగిన ప్రణాళికలు చేస్తున్నారు సమంత.
ఇప్పటి వరకు అక్కినేని అమల గారు మూగ జీవులపై ప్రేమతో బ్లూ క్రాస్ వంటి సంస్థల ద్వారా ఎంతగానో కృషిచేస్తుంటే ఆనందించాం, గర్వించాం.. ఇప్పుడు ఇదే ఇంటికి మరో గొప్ప మనిషి చేరుకోవడం నిజంగా మహా సంతోషకరం. అమల, సమంత గారి కలయికలో మరిన్ని సేవా కార్యక్రమాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటు అడ్వాన్స్ గా అక్కినేని సమంత నాగచైతన్యలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.