వాలెంటైన్స్ డే కదా సింగిల్ ని ఏమి చేస్తా మా ఫ్రెండ్స్ పెడుతున్న పోస్ట్స్ చూస్తూ గడిపేస్తున్న... ఇంతలో ఒక వార్త ని చూసి ఆలోచనలన్నీ దాని వైపుకి వెళ్లిపోయాయి. "కాశ్మిర్ పుల్వామా అనే ప్రదేశం లో 42 మంది సైనికుల్ని దొంగ దారిలో కారు లో బాంబు పెట్టి చంపేసిన టెర్రరిస్టులు. ఉరి లో జరిగిన దానికంటే ఎక్కువ సంఖ్య లో ప్రాణ నష్టం" ఇంకా ఎక్కువ తెలుసుకోకుండానే ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. మనిషి గా పుట్టి సాటి మనిషిని చంపేంత తెలివి మనకెందుకు ఇచ్చాడు ఆ దేవుడు?. అవసరం ఏముంది? అవకాశం ఉంది కదా అని చంపేస్తే మానవత్వం ఏమైతుంది?.." ఇలా నా ఆలోచనలు నా అదుపు లోనుండి వెళ్ళేలోపు అమ్మ వచ్చి నా పక్కన కూర్చుంది.
అయితే సెల్ తో లేదా లాప్ టాప్ తో ఉండే నేను, ఈరోజు నిశబ్దంగా ఎదో ఆలోచిస్తుండటం గమనించి "ఏమైంది శ్రీను?" అని అడిగింది అమ్మ. "ఏమి లేదమ్మా పాకిస్తాన్ వాళ్ళు ఇంకోసారి అటాక్ చేశారు. ఈ టెర్రరిస్ట్ అటాక్స్ లో ఎంతో మంది సైనికులు చనిపోవటం వారు చనిపోయారని తెలిసి వారి కుటుంబం బాధపడటం, ఎందుకమ్మా ఇదంతా ఎవరి ఆనందం కోసం.నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ప్రాంతం పేరుతో దేశం పేరు తో తమలో ఉన్న సైకో ని తృప్తి పరచడం కోసం వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు అని?"
నేను మొదటి సారి ఇలా మాట్లాడటం చూసి ఓ పక్క ఆశ్చర్యపోతూ "ఆకలి శ్రీను, ఏ విద్వంసమైన మొదలయ్యేది ఆకలి వల్లే.. కాకపోతే కొంతమందికి పక్క వాళ్ళ పై అధికారం చెలాయించాలనే ఆకలి.. పక్క వారి డబ్బు ని దొంగిలించాలానే ఆకలి ఉంటుంది. ఈ దాడులు చేసే వారు ఈ కోవ లో కి వస్తారన్నమాట.. కాకపొతే వీళ్ళ ఆకలి తీరదు.. పెరుగుతూనే ఉంటుంది. "
అమ్మ ఆకలి ని చూస్తుంది అంటే ఇదేనేమో అనుకుని " మరి పరిష్కారం ఏంటమ్మా? యుద్ధమేనా? సైనికులు, సరిహద్దులలో బతికే అమాయక ప్రజలు, బలి కావాల్సిందేనా? 42 మంది సైనికులంటమ్మ... వాల్లకీ భార్యా పిల్లలు ఉండి ఉంటారు .. ఒక్క క్షణం ఎన్నో ఆనందాలను చిదిమేసిందమ్మా.. అలాంటి క్షణాలు భవిష్యత్తు లో రాకుండా ఏమి చేయలేమా? ఆ సైనికుల చావుకి అర్ధం లేనట్టేనా?" అని ఇంకా వస్తున్న ఆలోచనలని అలానే తనకు చెప్పాను.
"నాన్న... నువ్వు సైనికుడివి కాకపోవచ్చు... కానీ నువ్వు చేసేది ఏ పనైనా దేశం కోసం చెయ్యి. నా దేశం కోసం ఉపయోగపడాలి అని ఒక్కడైనా అనుకునేలా నీ పని చెయ్యి. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని అన్నారు శ్రీ శ్రీ గారు .ఆయన ఇచ్చిన సమిధ ఏంటంటే ఆయన కలం నుండి పుట్టుకొచ్చిన ఎన్నో అగ్ని కణాల్లాంటి కవితలు. ఆ కవితలు చదివి ఎంత మంది స్ఫూర్తి పొందుంటారు.. దేశం గర్వించదగ్గ స్థాయి కి చేరుకొని ఉంటారు? నువ్వు చనిపోయినా 42 మంది గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఆ 42 మంది కి జరిగిన అన్యాయాన్ని చూసి చలించి నీలాగా తన తల్లి తోనో తండ్రి తోనో ఫ్రెండ్స్ తోనో లవర్ తోనో మాట్లాడుతున్నా కొన్ని వందల మంది యువకుల గురించి ఆలోచిస్తున్న. వాళ్ళ ఆలోచన ఈ దేశాన్ని శాంతి వైపు కి నడిఫైస్తే చాలు శ్రీను. ఆ 42 మంది చావుకి అర్ధం దొరికినట్టే..." అని ఏమి గుర్తోచిందో? లోపలికి వెళ్ళిపోయింది.
తల్లికి మించిన యోధులు లేరు అన్నాడు కెజిఎఫ్ లో రాఖీ భాయి. మరి ఆ యోధుల కన్న బాగా యుద్ధ పాఠాలు ఇంకెవరు చెప్తారు. నేను సైనికుడిని కాకపోవచ్చు యుద్ధం చేసేంత ధైర్యం బలం లేక పోవచ్చు కానీ.. నేను చేసే పని లో ఒకటైన మనలో ఉన్న వీరుణ్ణి తట్టి లేపేలా చేస్తాను, కనీసం ప్రయత్నిస్తాను. ఆలా అయినా ఈ దేశ శాంతి కి తద్వారా ప్రపంచ శాంతి కి నేను సైతం సమిధను అయినట్టే కదా!