Meet Santosh, A Classical Dancer Who Beautifully Transforms Himself Into A Woman

Updated on
Meet Santosh, A Classical Dancer Who Beautifully Transforms Himself Into A Woman

సంతోష్ ఏడవ తరగతి నుండే స్త్రీ వేషధారణలో నాట్యం చేస్తూ చదువుకుంటున్నారు. పుట్టి పెరిగి నడక నేర్చుకున్న ఊరి నుండి విమానంలో ఆకాశమార్గాన విదేశాలకు వెళ్లి అక్కడ కూడా ప్రదర్శనలిచ్చాడు. ఈ ప్రయాణంలో ఒకసారి అమెరికాలో నాట్యమాడారు. ఆరోజు పసుపు కుంకుమ కలిసిన చీర, నడుస్తున్న పాదాలకు హొయలు పోతున్న చేతులకు గోరింటాకు పెట్టుకుని వేలాది ప్రేక్షకుల ముందు నాట్యం చేశారు. "అద్భుతం" కలిసిన మాటలతో చప్పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. సంతోష్ వారందరి గౌరవాలు అందుకుని మేకప్ రూమ్ కి వెళుతున్నాడు.

ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి స్త్రీ వేషధారణలో ఉన్న సంతోష్ చెయ్యి పట్టుకుని "నన్ను పెళ్లి చేసుకుంటావా? నేనొచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతాను" అని అన్నాడు. సంతోష్ అసలు విషయం చెప్పేలోగా తన ఫ్రెండ్ వచ్చి "మీకు సభ్యత లేదా? ఒక ఇండియన్ ఉమెన్ తో ఇలాగేనా మాట్లాడేదని" ఆటపట్టించింది. కాసేపు అల్లరి తర్వాత నేను అబ్బాయిని అని చెప్పినా కూడా అతను నమ్మలేదు ఆఖరికి మేకప్ తీశాక పాపం అతని గుండె పగిలిపోయింది.

కాల ప్రవాహం:

చిన్నతనంలో అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడం, ఆర్ధికంగా ఇబ్బందులుండడంతో సంతోష్ విజయవాడ నుండి కోల్ కతా మేనమామ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చదువుకుంటూనే శారదా దేవి గారి దగ్గర భారత నాట్యం, పూరి జగన్నాథ్ దేవాలయ ఆస్థాన దేవదాసి బృందావతి మోహాపాత్ర శిష్యరికంలో ఒడిస్సి నేర్చుకున్నాడు. ఊహించని పరిస్థితిలో మేనమామ చనిపోవడంతో మళ్ళీ విజయవాడకు తిరిగి వచ్చి ఎమ్మేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాడు.

మొదట్లో అస్సలు నచ్చేది కాదు:

సంతోష్ మేకప్ తీస్తే కాని అబ్బాయి అని నమ్మలేం. ఒంటి మీద చీర, తలలో మల్లెలు, ఘల్లు ఘల్లు మని కాలికి పట్టీలు వేసుకుని భూమి మీద తారంగమాడడం చిన్నతనంలోని సంతోష్ కు ఏ మాత్రం నచ్చేది కాదు. లంక అన్నపూర్ణ గారి దగ్గర కూచిపూడి నేర్చుకుంటున్న సమయంలో ఆయన కూడా స్త్రీ పాత్రలో నృత్యం చేసేవారు. ఆయన విపరీతమైన అవమానాలు ఎదుర్కునేవారు. అది చూసి సంతోష్ కు ఉమెన్ గెటప్ అస్సలు వేసుకోకూడదు అని అనుకునేవాడు. కానీ మొదటిసారి బలవంతంగా వేయాల్సి వచ్చింది. గురువు శారద గారి కూతురు శ్రీదేవి కొన్ని కారణాల వల్ల ఆరోజు నాట్యం వెయ్యలేకపోయింది. తన తరుపున స్త్రీ పాత్రలో సంతోష్ ను చెయ్యమని గురువు గారు అడగడంతో కాదనలేక పోయాడు. అప్పటి నుండి ఈ నాట్య పరంపర కొనసాగుతూ వస్తూ ఉంది.

మన జెండర్ ను అప్పటికప్పుడు మార్చుకుని పరకాయ ప్రవేశం చేయడమంటే మాటలు కాదు. అచ్చం ఒక స్త్రీ ఎలా అయితే ఉంటుందో నేను అలాగే ఉండాలని ఇంటి దగ్గరలోని దేవాలయంలో ప్రాక్టీస్ చేసేవాడు. చిన్నతనంలో పాపగా, యుక్త వయసులో అమ్మాయిగా మనం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలోను వందలాది ప్రదర్శనలిచ్చాడు. తనకింత తేజస్సును తీసుకువచ్చిన నాట్యాన్ని మరెందరికో విజయవాడ చిట్టినగర్ లోని అకాడెమీ ద్వారా నేర్పుతున్నారు కూడా.