బానిసత్వం తప్ప భారతీయులకి మరో దిక్కు లేదు, కులం మతం,భాష, ఎక్కడా ఏకత్వం లేని ఈ భారత దేశం ఎక్కువ కాలం స్వతంత్ర దేశంగా ఉండలేదు,తొందరలోనే విచ్చిన్నం అవుతుంది. ఇది ఆనాటి ఆంగ్ల పాలకుల మాట. ఇవన్నీ కల్లబొల్లి కబుర్లేనంటూ భారత దేశం భిన్నత్వం లో ఏకత్వం అనే తారక మంత్రంతో మహా శక్తిగా ఎదుగుతోంది నేడు. కాని ఇప్పుడు ఉన్న భారతదేశ పటం ఇలా ఉండడానికి కారకులు ఎవరు,ఒకప్పుడు ఎన్నో వందల చిన్న రాజ్యాలుగా బ్రిటిష్ సార్వభోమాదికారం కింద ఉన్న రాజ్యాలు ఇప్పుడు భారతదేశంలో ఎలా ఉన్నాయి . ఆంగ్లేయుల ఊహకందని రీతిలో భారతదేశాన్ని సమైక్యం చేసింది ఎవరు ?? ఒక్కడు .ఒకే ఒక్కడు,ఆ ఒక్కడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ , ఎవరితరం కాదు అనుకున్న పనిని పటేల్ ఒక్కడు ఎలా సాదించాడు . తెలుసుకుందాం రండి .
1947 భారత దేశానికి స్వతంత్రం ప్రకటించి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు ,కాని వెళ్తూ వెళ్తూ దేశ విభజన చేసి సమస్యతో వీడ్కోలు పలికాడు . ఆ సమస్య సృష్టించిన మంటలు చల్లారకముందే భారత దేశానికి మరో సవాలు స్వాగతం పలికింది . అదే సంస్థానాల సమస్య . నిజానికి ఇది బ్రిటిష్ వారు పరిష్కరించవలసినది ,కాని ఈ సమస్యని మరింత జటిలం చేస్తూ ఆ సంస్థానాలకి మూడు దారులని ఎంచుకోమని సూచించారు. భారత్ లేదా పాకిస్తాన్ లో విలీనం అవ్వడం లేక స్వతంత్ర దేశంగా ఉండడం . స్వతంత్రదేశంగా అవతరించిన భారతదేశం పూర్తిగా నిలదోక్కుకోకముందే కొన్ని వందల ముక్కలుగా విడిపోయే పరిస్థితిని సృష్టించి సంక్షోభ స్థితిలోకి నేట్టేసారు అప్పటి వైస్రాయ్ మౌంట్ బాటెన్.
ఒకటి కాదు,రెండు కాదు,అక్షరాల 565 సంస్థానాలు,ఒక సంస్థానానికి మరో సంస్థానానికి సామజికంగా, ఆర్ధికంగా,సాంస్కృతికంగా,భౌగోళికంగా ఎక్కడ సారూప్యత లేదు. వేటికవే భిన్న రాజ్యాలుగా ఉండేవి .ఇవన్నీ భారత దేశంలో విలీనం అవుతేనే దేశ సమగ్రతకి సమైక్యతకి రక్ష. కష్టతరం,అసాధ్యం అనే అనుకున్నారంతా,కాని ఓ మహా శక్తి నవ భారత నిర్మాణానికి రూపకర్తగా ఓ మహా యజ్ఞంలా సంస్థానాల విలీన ప్రక్రియను ఆరంబించారు.ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్.స్వాతంత్రానికి పూర్వం,గాంధిజీ ప్రియ శిష్యుడిగా స్వాతంత్రోద్యమంలో తన పాత్రని సమర్ధవంతంగా పోషించిన వల్లభాయ్ పటేల్, స్వాతంత్రానంతరం కూడా ఒక మహత్కార్యాన్ని తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు .
చిన్నా చితక జాగిర్ల నుంచి,బికనేర్ ,హైదరాబాద్,ట్రావెన్కోర్,జునాఘడ్ వంటి పెద్ద రాజ్యాల వరకు,దాదాపు 565 సంస్థానాలు అప్పటివరకు బ్రిటిష్ సార్వభోమత్వం కింద ఉండేవి,బ్రిటష్ వారు సూచించిన మూడు దారులలో చాలా వరకు సంస్థానాలు స్వతంత్రంగా ఉండేదుకే మొగ్గు చూపాయి,కాని వల్లభాయ్ పటేల్ ప్రతీ సంస్థానాల రాజులతో,మంత్రులతో విస్త్రుత చర్చలు,సంప్రదింపులు,సమావేశాలు జరిపి,భారతదేశంలో విలీనం అయ్యేందుకు వారికున్న సందేహాలను నివృత్తి చేస్తూ,వారి రాచరిక భోగాభాగ్యలకు ,కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు జరగకుండా చూస్తూ వారిని రాజ్ ప్రాముఖ్గా ఆయ రాష్ట్రాలకు నియమిస్తూ వారిని కూడా నవ భారత నిర్మాణంలో ఒక భాగం చేసారు . వారి ఆస్తుల సంరక్షణ చేపట్టి,ఏటేటా వారికి భత్యం కూడా ఏర్పాటు చేసి వారిని తగిన రీతిలో గౌరవిస్తూ వారిని ఒప్పించారు . అప్పటివరకు రాచరిక పాలనలో ఉన్న ప్రజలకు కూడా విముక్తి కల్పించి ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేసారు పటేల్ .అన్నీ సంస్థానాలు పటేల్ విజ్ఞాపనను వెంటనే ఆమోదించలేదు,కొన్ని మొదట స్వతంత్రంగా ఉంటామని ప్రకటించాయి.కాని పటేల్ మాటల్లోని ధృడత్వాన్ని, దార్శనికతను ,ఆయన ముందు చూపు దూరదృష్టితో ఏకీభవించి సంస్థానాలను విలీనం చేసాయి.
దాదాపు చర్చల ద్వారానే అన్నీ సంస్థానాలను భారత్లో విలీనం జరిగేలా చేసారు పటేల్ కాని హైదరాబాద్, జునాఘడ్, కాశ్మీర్ సంస్థానాల విషయంలో మాత్రం వేరే దారిలో వెళ్ళవలసి వచ్చింది .జునాఘడ్ సంస్థానం విషయంలో పాకిస్తాన్ ప్రజాబిప్రాయం మేరకే నడుచుకోవాలని మెలిక పెట్టింది. వల్లభాయ్ పటేల్ జునాఘడ్లో పర్యటించి అక్కడి ప్రజలకు నిజానిజాలను విడమర్చి చెప్పి,భారత్లో విలీనం వల్ల జరిగే లాభ నష్టాలను వివరించి ప్రజలు భారత్ లో విలీనానికే ఓటు వేసేలా అక్కడి ప్రజలను కూడా ప్రభావితం చేసారు . ఇక హైదరాబాద్ సంస్థానం పాకిస్తాన్లో అయినా విలీనం అవుతాం తప్ప భారత్ తో కలవం అని చెప్పేసింది,అప్పటికే నిజాం పాలనలో ప్రజల ఇబ్బందులు పతాక స్థాయికి చేరాయి,రజాకార్ల అరాచకం హెచ్చుమీరిపోయింది.పోలీస్ చర్యతో కేవలం నాలుగు రోజులలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత దళాలు స్వాదీనం లోకి తెచ్చుకున్నాయి, హైదరాబాద్ భారత్ లో విలీనం అయ్యింది,తెలంగాణా ప్రజలకి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించారు వల్లభాయ్ పటేల్ . (కాశ్మీర్ సంస్థాన విలీన ప్రక్రియ నెహ్రు ఆధ్వర్యంలో జరిగింది).
కేవలం ఆరు నెలలో అసాద్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపారు.72 ఏళ్లవయసు,భారత ఉపప్రధానిగా హోంమంత్రిగా భాద్యతలు, ఉక్కు సంకల్పం,కార్య నిర్వహణా దక్షత,పట్టుదల ,రాజకీయ చతురతతో రక్తపాత రహితంగా సుమారు 563 సంస్థానాలు ,ఒంటి చేత్తో భారత దేశంలో విలీనం చేయించి నవ భారత రూపకర్తగా మారారు . ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనమందరం భారతీయులుగా గుర్తిమ్పబడుతున్నాం అంటే ఈరోజు మన భారత పటం ఇలా ఉంది అంటే దానికి కారణం నిస్సందేహంగా వల్లభాయ్ పటేల్ . దేశ చరిత్ర లో అత్యంత కీలక పాత్ర పోషించి దేశ సమైక్యతను దేశ సమగ్రతను కాపాడడంలో ఆయన చూపిన తెగువ,ఆయన ప్రదర్శించిన రాజ నీతిజ్ఞాతకి మనమందరం రుణపడి ఉండాలి . ఇదంతా కేవలం ఈరోజు వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడానికి చేసే ప్రయత్నమే కాదు,ఆనాడు ఆయన చేసిన ఆ బృహత్కార్యం కేవలం దేశ సమైక్యత కోసమే కాదు ప్రజలలో ఐక్యత కోసం ,మన కోసం,భావి భారత పౌరులకోసం, కుల మత ప్రాంత వర్ణ వర్గ భాషా సాంస్కృతిక భేదాలు ఎన్ని ఉన్నా మనమంతా భారత దేశ పౌరులమే,మనమంతా భరత మాత బిడ్డలమే అని ఐక్యతతో కలిసి మెలసి ఉండాలనే కాంక్ష తోనే ఆనాడు భారత దేశ ఏకీకరణ జరిపారు వల్లభాయ్ పటేల్. కాని నేడు ఉత్తర దక్షిణ భారతలంటూ విడదీసి మాట్లాడుతున్నాం ,మద్రాసి అంటూ చింకి అంటూ వివక్షతో మన వారిని పరాయి వారిగా విడదీస్తో భేదాలెన్చుతున్నాం మనలో మనం కలహించుకుంటూ ఉంటున్నాం . ఇలాంటి భారతం కోసం కాదు ఆ మహానుభావుడు ఆ వయసులో అంత శ్రమకోర్చి అసాద్యాన్ని సుసాద్యం చేసింది . స్పర్ధలు,భేదాలు ఎన్ని ఉన్నా మనమంతా భారతీయులమే.ఆ మహనీయుని స్ఫూర్తి మనలో ఎప్పటికీ ఉండాలని కోరుకుందాం. ఉంటుందని సర్దార్ వల్లభాయ్ పటేల్ సాక్షిగా ప్రమాణం చేద్దాం. మరొక్కసారి వల్లభాయ్ పటేల్ కి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాం . సాహో సర్దార్ వల్లభాయ్ పటేల్ .......