అన్నీ తెలుసుకుని ఒక్క సంబంధం వెతకడానికి చాలా సమయం పడుతుంది అదే 42 సంబంధాలు వెతకడానికి ఎంత కాలం పడుతుంది.? 42 పెళ్లి చూపులు.. 42 సార్లు ఎదురుచూపులు "ఇతనేనా నాకు కాబోయే భర్త అని.." ఇన్ని సంబంధాలు కుదరకపోవడానికి ప్రధాన కారణం శశి నల్లగా ఉండడం. శశి మాత్రమే కాదు, శశి పేరెంట్స్ కూడా కృంగి పోయిన పరిస్థితి. ఆ టైమ్ లోనే మరో కుటుంబం పెళ్లి చూపుల కోసం రాబోతున్నారని తెలిసింది. వారిలో ఆశలు అంతంత మాత్రమంగానే మినుకు మినుకు మంటూ ఉన్నాయి. ఆశ్చర్యం!! పెళ్ళికి ఒప్పుకున్నారు. అంతా ఓ కలలా ఉంది అందరికి..
త్వరలోనే ముహుర్తాలు.. పెళ్లి పనులలో బిజీగా ఉన్నవారికి కాబోయే భర్త శశి కి కాల్ చేశాడు.. "నాకు క్యాన్సర్ ఉందని రెండు రోజుల క్రితమే తెలిసింది. తెలిసి తెలిసి ఈ విషయం నీ దగ్గర దాచి నిన్ను మోసం చెయ్యాలని అనుకోలేదు, పెళ్లి పనులు ఆపుచేయండి Sorry". ఐతే వారం రోజుల తర్వాత ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫోటో శశి కి పంపాడు. అప్పుడు తెలిసింది, "నా నల్లని ముఖాన్ని వదిలించుకోవడానికి అబద్ధం ఆడాడని".
"నేను నా ఎదుగుదలకు ఆటంకం కాదు".. ఎవరికో భార్యగా వెళితే ఫలానా వారి భార్య అని అంటారు కాని నాకంటూ ఏదైనా ప్రత్యేక గుర్తింపును తీసుకురాదు. ముందు నేనేంటో నిరూపించుకోవాలి అని నిర్ణయం తీసుకుంది శశి. అప్పటికే శశి ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం లో చేరింది. ఇక్కడితోనే ఆగిపోకూడదు అని ఇంకేదైనా సాధించాలి అని ఆలోచిస్తుండగానే అప్పటికే ఎదో హాబీ గా చీరల మీద చేసిన డిజైన్స్ పై ఫ్రెండ్స్ నుండి మాంచి Appreciation వచ్చింది.
ఒకపక్క సెక్యూరిటీగా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే మరోపక్క యూట్యూబ్ లో ఫ్యాషన్ కు సంభందించిన వీడియోలు చూసేది. మొదట కొన్ని డిజైన్లు చేసి అమ్మడం మొదలుపెట్టింది. ఆశించిన స్థాయికన్నా సేల్స్ ఎక్కువ ఉండడంతో పూర్తిస్థాయిలో నాలుగు సంవత్సరాల క్రితం ఫ్యాషన్ డిజైనర్ గా రూపాంతరం చెందింది. శశి ప్రొడక్షన్ మీద ఎంత కేరింగ్ తీసుకుందో మార్కెటింగ్ మీద కూడా అంతే శ్రద్ధ తీసుకుంది. కస్టమర్స్ దగ్గరికి చేరువ అవ్వడానికి సోషల్ మీడియా ఎంచుకుంది. దేశమంతటా సక్సెస్ ఐన సవ్యసాచి, మల్హోత్ర లాంటి వారిని ఫాలో అవుతూ రీసెర్చ్ చేసేది. అలా శశి కూడా పోస్ట్ చేసేది. ప్రస్తుతం బంజారాహిల్స్ లోని తన "ముగ్ధ" షోరూమ్ లో కన్నా ఆన్ లైన్ లోనే ఎక్కువ సేల్స్ అందుతున్నాయి..
ఇంట్లో జరిగే ఫంక్షన్ల దగ్గరి నుండి లాక్మే ఫ్యాషన్ వీక్ వరకు శశి తన డిజైన్లను అందిస్తుంది. ఇక తనకు సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఎందరో అభిమానులున్నారు.. మిస్ యునివర్స్ సుస్మితసేన్, కాజల్, అనసూయా, తాప్సి.. ఇంకా ఎందరో..
ఒకప్పుడు పెళ్ళిచూపులలో తన ఒపీనియన్ తో సంబంధం లేకుండా "నన్ను ఇష్టపడుతారా, లేదా అని బిక్కు బిక్కు" మంటూ చుసిన శశి ఇప్పుడు 500 మందికి ఉద్యోగం ఇచ్చింది. నాలుగు సంవత్సరాలలో వేల మంది దగ్గరికి తన డిజైన్లను చేర్చింది. అంతేనా విలువ కట్టలేని తనని తెలుసుకుంది ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది..? 42 మంది శశిని రిజెక్ట్ చేసి చాలా మంచి పనే చేశారు. సరే ఇప్పుడు మన ఫేల్యూలర్స్ ని తలుచుకుందామా..