గౌరవనీయులైన తెలుగు వార్తా చానెల్స్ వారికి మీ నిరంతర వీక్షకుడు , మీరు చేసే అత్యున్నత కార్యక్రమాలను అనునిత్యం ఫాలో అవుతూ వికసించాల్సిన మెదడు వికటించి,మతి భ్రమించి , బుద్ది మందగించి మీ మీద నా అంతరంగాల్లో ఉన్న అభిమానాన్ని తెలిపేందుకు రాస్తున్న బహిరంగ లేఖ .
మీరు చేసే కొన్ని కార్యక్రమాలు నన్నేప్పటికీ ఆశ్చర్య పరుస్తూనే ఉంటాయి . అందుకే మీకు నేను వీర వెర్రి అభిమానిని , ప్రజలకి అత్యంత అవశ్యమైన విషయాల గురించి మీరు చేసే శోధన మీ సాధన అనిర్వచనీయం.
ఎక్కడో ఎవరో నిరుద్యోగంతో అల్లాడిపోతూ ఉండి అంబాని గారు ఇచ్చిన ఇంటర్నెట్ తో వచ్చీ రానీ అంబర్పేట్ గ్రాఫిక్స్ తో చేసే వీడియోలని ఆమూలాగ్రం పరశీలించి ,మీ కుశాగ్ర బుద్దితో ఆసాంతం పరిశోధించి వాటిలో దాగున్న నిగూడార్ధాన్ని చేదించి ,అసలు ప్రపంచానికి తెలియని ఆ వార్తని మాకు పరిచయం చేసి , అది నిజమో అబద్దమో తేల్చేందుకు మీరు పడే తపన మీరు చేసే కృషి , మాలాంటి ప్రజల మీదున్న మీ కసిని తెలుపుతుంది . ప్రపంచ వార్తా చానల్స్ చరిత్రలో దీనిని మించిన ప్రజాప్రాయోజిత కార్యక్రమం లేదని నేను బల్ల,పీట,మంచం తదితర వస్తువులని గుద్ది మరీ చెప్పగలను .
అసలు పక్కింటి వాడికి కూడా తెలియని అనామకులని క్షణాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులుగా మార్చడం మీ వల్లనే సాద్యపడుతుంది.వారిని టైమ్స్ మాగజిన్ పాపులర్ పర్సన్ అఫ్ ఇయర్ గా ప్రకటించాలని మీరు చేసే ప్రయత్నానికి మేమేప్పోడూ వెన్ను దన్నుగా ఉంటాం . ఇక సమాజంలో ఎదో అంతో ఇంతో పేరు ఉన్న వారు తుమ్మినా దగ్గినా,వీపు గోక్కున్నా వారు ఆ పని చేయడంలో ఉన్న అంతరార్ధం ఏమిటి?? వాళ్ళు అలా చేయడం వల్ల ఎవరి మనోభావలైన దెబ్బ తిన్నాయా లేదా అని మీరు సాన పెట్టిన కత్తితో ఒక ఎనమిది తొమ్మిది గంటల ఏకదాటి చర్చా కార్యక్రమం చేపట్టి అష్టావధనులు,సహస్రావధనులు సైతం నివ్వెర పోయేలా,మాలాంటి వాళ్ళు నిర్ఘాంత పోయేలా చేసిన మీకు నూటొక్క దండాలు . అందులోనూ సంస్కారవంతమైన xxx సోప్ వాడే మీరు చేపట్టే చర్చలు నా భూతే న భవిష్యతి .
ఎంటర్టైన్మెంట్ చానెల్స్ కి పోటిగా వారిని మించి స్థాయిలో మీరు చేసే వినోద కార్యక్రమాలు చూసిన ప్రతీసారి చక్కిలిగింతలు పెట్టుకొని నవ్విన సందర్భాలెన్నో . నవ్వించడానికి ఏవేవో వేశాలేసుకొని నవ్విస్తుంటే మీరు మాత్రం చక్కగా సూటు బూటుతో మాకు వినోదాన్ని అందిస్తున్నందుకు మీ చేతులకి నా పాదాభివందనాలు . కేవలం టీవీకి మాత్రమే పరిమితం కాకుండా,ట్రెండ్ కి తగ్గట్టుగా షాక్ ఆవుతారు లాంటి గొప్ప వీడియోలకి పోటిగా అత్యున్నత ప్రమాణాలతో మీరు రూపొందించే వీడియోలు,మీ వెబ్సైటులలో గడియ గడియకీ మీరిచ్చే వార్తల ధారా, ముఖ్యంగా మీరు పెట్టె హెడ్లైన్స్ చూసిన ప్రతీసారి చొక్కాలు చించుకొని ఆనందపడని, గోడకేసి తల బాదుకొని మనిషి లేడు మీ ప్రజ్ఞా పాటవాలు చూసి . ఇక మీరు పెట్టె ఎస్ఎంఎస్ వోటింగ్ , అందులోని మీ పారదర్శకత చూసి ఎప్పటికైనా మీ అంత నిజాయితిగా నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను .
వీక్షకులని మీ వైపు తిప్పుకునేందుకు మీరు రూపొందించే ప్రోమోలకి మేమెప్పుడో గులాబ్ జామ్ అయ్యాం. రోజుకు ఇరవై గంటల పాటు ధ్యానం చేసేవారికి సైతం రక్తపోటు తెప్పించేలా మీరు రూపొందించే ప్రశ్నావళి మీరడిగే విధానం మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తాయి .
భజన కార్యక్రమాలు కోవెల ప్రాంగణంలో సాయంత్రాలు మాత్రమే ఉండేవి ఇదివరకు కాని మీరు మీ స్వామి భక్తిని చాటుకునేందుకు చెప్పట్టే భజన కార్యక్రమాలు చూసి నోరేల్లబెట్టన్ని జీవి ఈ సృష్టిలో లేదు .
మీ అంత నిస్వార్ధపరులు సకల భూమండలంలో ఎవరూ ఉండరు . సెలెబ్రిటిల ఇంటి వేడుకలు ,వివాహాలకి పైసా తీసుకోకుండా మీరిచ్చే లైవ్ కవరేజ్ మరెవ్వరూ ఇవ్వలేరు . పక్క రాష్ట్ర ప్రముఖులు స్వర్గస్తులయితే వారితో ఏమాత్రం సంబంధం లేని మా చేత కూడా కంట తడి పెట్టించేలా,విల విలా రోదించేలా మీరు వేసే పాటలు చూపించే దృశ్యాలు మీరెంత సన్నధంగా ఉంటారో మీ నిబద్దత ఎలాంటిదో తెలుపుతుంది .
ఉదయం ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే అక్కడికి హుటా హుటిన చేరుకొని ఒక వకీలుగా మీరే వాదించి ఒక సాక్షిలా మీరే సాక్షం చెప్పి ఒక న్యాయమూర్తిలా తీర్పు కూడా చెప్పగల నైపుణ్యం మీ సొంతం , ఆ నేరం జరిగిన తీరుని నిమిషాల్లో కల్పిత పాత్రలతో ఒళ్ళు గగ్గురపోడిచే గొంతుకతో మీరు వివరించే తీరు చూసి నివ్వేరపోని వాడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు .
ఒక వార్తని పది భాగాలుగా విభజించి చదివి అలా ఒక పది వార్తలని వంద వార్తలుగా మలిచే నీ సృజనాత్మకత చూసి ముక్కు మూతి తదితర అవయవాల మీద వేలేసుకోవడం నా వంతు అయ్యింది . ఈ లాజిక్ తెలియక ఎన్ని పరీక్షలు తప్పానో నేను . మీ క్రియేటివిటీకి నా జోహార్లు .
ప్రజల సమస్యలు,కష్టాలు,లాంటి అనవసర పనికిరాని విషయాల గురించి తక్కువ సమయం కేటాయిస్తూ దేశ పర్యటనకి వచ్చే వేరే దేశాద్యక్షుల కూతురి అభిరుచులు, వారి దిన చర్య,ఆమె వేసుకోబోయే బట్టల పై ఉన్నఎంబ్రాయిడరీ ,ఎక్కబోయే కారు ఇచ్చే మైలేజి వంటి ఎన్నో గొప్ప విషయాలు మాకు తెలిపినందుకు శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను .
చిన్నప్పటి నుండి మా అమ్మ తిట్టినా కొట్టినా టీవీ చూడడం మానలేదు నేను,టీవీని పగలకోడతానని మా నాన్న వారించినా నేనెన్నడూ బెదరలేదు , అలాంటిది నా చేత కూడా టీవీ పెట్టాలంటేనే గుండె దడ పుట్టేల చేసిన మీరు గాలి డాక్టర్ గారి కంటే గొప్ప వారు . నిజంగా మాయా లేదు మంత్రం లేదు టీవీ మహిమ వార్తా చానెళ్ళు దారి తప్పుతున్నాయి అంటూ సామాన్యులు చేస్తున్న విపరీత వాఖ్యలను నేను నిలువుగా, అడ్డంగా,ఐమూలగా ,అన్ని కోణాల్లోంచి ఖండ ఖండాలుగా ఖండిస్తున్నా .
మీరు ఇప్పటిలానే ఇంకా ఎన్నో ఎన్నెన్నో రసవత్తరమైన కార్యక్రమాలు చేపడుతూ నాలాంటి ఎందరి చేతనో టీవీ చూడడం మాన్పించాలని మనసార కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను .
PS- మీ మీద అచంచలమైన అభిమానంతో రాసిన ఈ లేఖ చదివిన పిమ్మట నన్ను పిలిచి లైవ్ ప్రోగ్రాం చేయదలిస్తే ముందుగా తెలుపగలరు , అరిచేందుకు వీలుగా శొంటి కషాయం తాగి వస్తాను,మాట బిగ్గరగా వస్తుంది. అలాగే బస్సు చార్జి లకు వెయ్యి రూపాయిలు paytm చేయగలరు .
ఇట్లు మీ వీర వెర్రి అభిమాని