ప్రస్తుత వ్యవసాయ పద్దతుల వల్ల మనం ముఖ్యంగా మూడు రకాలుగా నష్టపోతున్నాం 1. చాలా కష్టాలుపడి పంట పండించినా గాని సరైన గిట్టుబాటు ధర పంటకు లభించకపోవడం, 2. విపరీతమైన పెస్టిసైడ్స్ ఉపయోగించడం వల్ల కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు రావడం, 3. పెస్టిసైడ్స్ వాడకం వల్ల భూమి కూడా కలుషితం అవుతుంది.
ఇక రైతుల సమస్యల గురించి అంటారా వాటి గురించి ఎంతని చెప్పుకుంటాం.. ఏమని చెప్పుకుంటాం.. తరతరాలుగా కోట్ల పేజీలు కన్నీటి గాధలతో నిండినా గాని ఆగని నిరంతర కథలుగా సాగుతున్నాయి వారి జీవితాలు. మన భారతదేశంలో రైతులు అత్యధికంగా పండిస్తున్న పంటలలో ఒకటి కాటన్(పత్తి,14%). రైతు సోదరులు పత్తిని 'తెల్ల బంగారం' అని పిలుస్తారు. బంగారాన్ని వెలికితీయడానికి ఒక కార్మికుడు ఎంత కష్టపడతాడో అంతకు చాలా రెట్లు రైతు పత్తి కోసం నెలల తరబడి కష్టపడతాడు. సమస్యను నిశితంగా పరిశీలిస్తే పరిష్కారం కూడా స్పష్టంగా తెలుస్తుంది. శరత్ గిడ్డ(Bachelor's Degree In Mechanical Engineering & A Social Entrepreneur), అనిల్ కుమార్(Master's In Organic Agriculture From Wageningn University) గారు "అన్విత ఆర్గానిక్స్" అనే సంస్థను స్థాపించి దీని గురించి చాలా రీసెర్చ్ చేశారు.. ముందుగా పత్తి రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు తెలుసుకుందాం.
ప్రధాన సమస్యలు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉపయోగాలు: మన దేశంలో పత్తి పంటకోసం ఎక్కువ శాతం "బీ.టి" పత్తి విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. "బీ.టి" రకం విత్తనాలు చాలా ఖర్చుతో కూడిన విత్తనాలు. ఇంకా పెస్టిసైడ్స్ ఇతర ఖర్చులతో కలుపుకుని ఎకరానికి 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే సాంప్రదాయ విత్తనాల ద్వారా వ్యవసాయం చేస్తే కేవలం 5,000 నుండి 6,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. సాంప్రదాయ విత్తనాలు తీసుకునే నీటి కన్నా పెస్టిసైడ్స్ వాడిన పంట ఎక్కువ నీటిని తీసుకుంటుంది. భారతదేశంలో 80% మంది రైతులు కేవలం వర్షం నీటినే ఆధారం చేసుకుని వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల సరైన సమయానికి వర్షాలు పడకుంటే ఆ పంట నాశనం అవ్వడమో (లేదా) ఆశించిన పంట రాకపోవడమో జరుగుతుంది. పెస్టిసైడ్స్ ఉపయోగించిన పంటకు సరైన సమయానికి నీరు అందకుంటే పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అదే సాంప్రదాయ విత్తనాలతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పెట్టుబడి ఖర్చు తగ్గడంతో పాటు ఒక వేళ వర్షాలు పడకపోయినా గాని 60% పంటను కాపాడుకోవచ్చు.
పంట పండించడం వరకు మాత్రమే కాదు పత్తిని షర్ట్స్ గా తయారుచేయడంలో కూడా ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. పెస్టిసైడ్స్ ఉపయోగించిన పత్తితో తయారుచేసే ఒక్క టీ షర్ట్ కోసం 3,000 లీటర్ల నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అదే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన పత్తి ద్వారా తయారుచేసే టీ షర్ట్స్ కోసం కేవలం 300 లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుంది. పెస్టిసైడ్స్ ఉపయోగించిన పత్తి ద్వారా తయారుచేసిన టీ షర్ట్స్ వేసుకోవడం వల్ల కూడా రకరకాల చర్మవ్యాధులు వస్తున్నాయి. అంతెందుకండి పురుగుల మందు డబ్బా మూత తీసి మందు కలపుతున్న సమయంలో గాలిని పీల్చడం వల్ల కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. ఏ రకంగా చూసినా కూడా ఇటు రైతులకు, అటు సమాజానికి, ముఖ్యంగా ప్రకృతికి కూడా పెస్టిసైడ్స్ తో పండించే పంట అత్యంత ప్రమాదకరమని వీరి రీసెర్చ్ లో మరింత స్పష్టంగా ఋజువయ్యింది.
అసలైన పరిష్కారం: ఇప్పటి వరకు మనం చూసిన సమస్యలన్నీటికి శరత్(9908935699), అనిల్ గారి దగ్గర సరైన పరిష్కారం ఉంది. వీరి టీం నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి "పండించిన పత్తి పంట నుండి షర్ట్స్ అయ్యే వరకు ఎలాంటి పద్దతులు ఉంటాయి, ఎన్నిచోట్ల దళారులుంటారు, ఎన్నిచోట్ల మోసం జరుగుతుందో ముందుగా రైతులకు వివరిస్తారు". అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కు, పెస్టిసైడ్స్ ఉపయోగించడం వల్ల వచ్చే పంటకు మధ్య తేడాను పూర్తిగా వివరిస్తారు. ఆ తర్వాత ఈ పద్దతి నచ్చి ముందుకు వచ్చిన రైతులకు సుచనలిస్తూ వీరే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయిస్తారు. రైతులకు ఆర్ధికంగా ఇబ్బంది ఉంటే దళారుల దగ్గరి నుండి అప్పు కాకుండా నేరుగా గ్రామీణ బ్యాంకుల ద్వారా ఋణాన్ని అందిస్తారు.
రైతులు ఎన్ని ఎకరాలలో పంటను వేస్తున్నారో చూసి అందుకు తగ్గ ధరను పంట పండక ముందే నిర్ణయిస్తారు. పంట చేతికందే సమయానికి మార్కెట్ ధర తగ్గితే ముందు నిర్ణయించిన ధరనే అందిస్తారు, ఒకవేళ మార్కెట్ ధర పెరిగితే ఆ పెరిగిన ధర చెల్లించి పంటను కొనుగోలు చేస్తారు. ఈ పద్దతి ప్లానింగ్ దశలోనే లేదండి.. ఈ పాటికే ఒకసారి వరంగల్ లో 50మంది రైతుల భూములలో ఆచరించి సక్సెస్ అయ్యరు. వరంగల్ లో క్వింటా పత్తి ధర 3,500 ఉంటే వీరు 6,700 రూపాయలకు కొనుగోలు చేసి వారు కలలో ఊహించే ఆనందాన్ని నిజం చేసి చూపించారు.. ఈ పద్దతిలో రైతు పండించిన పంటను నేరుగా సంస్థకు అమ్మడం వల్ల రైతు, వినియోగదారుడు, సంస్థలు ఆదాయం అందుకుంటారు. ప్రస్తుతం రైతుల నుండి సేకరించిన పంటను మన భారతదేశంలో కాకుండా(ఇక్కడ అంతగా మార్కెట్ లేకపోవడం వల్ల) అభివృద్ధి చెందిన దేశాలలోని పెద్ద బ్రాండ్ సంస్థలకు చేరవేస్తున్నారు. అంతే కాకుండా భవిషత్తులో మరో అద్భుతమైన పద్దతి కూడా రాబోతుంది "ఏ రైతు పంట ద్వారా ఐతే టీ షర్ట్ తయారు చేయబడిందో ఆ టీ షర్ట్ మీద ఆ రైతుకు సంబంధించిన ఐడి నెంబర్ ఉంటుంది.. వినియోగదారుడు నేరుగా ఆ ఐడి ద్వారా తనకు తోచినంత విరాళాన్ని నేరుగా రైతుకు అందించే అవకాశం కూడా త్వరలో రాబోతుంది.
ఏ మార్పు ఐనా, ఏ పద్దతి ఐనా ప్రవేశపెట్టిన మొదటిరోజే విజయం సాధించదు.. అందులో అవసరం ఉంటే ఖచ్చితంగా ఏదోరోజు ఊహించిన మార్పు సాద్యం అవుతుంది. ఈ కాన్సెప్ట్ ద్వారా రైతులకు, వినియోగదారులకు, సంస్థలకు, ముఖ్యంగా ప్రకృతికి కూడా మంచి జరుగుతుందనడంలో ఏ రకమైన అనుమానం లేదు. స్వతంత్రం రాకముందు నుండి రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఈ పద్దతి వల్ల రైతు తన ఉహల్లో ఊహించే ఆనందాన్ని నిజం చేసుకుంటారు. ప్రభుత్వం వారు చొరవ తీసుకుని రైతులకు ఉపయోగపడేలా తగిన చర్యలు తీసుకుంటే ఈ పద్దతి వల్ల మన రైతు రాజు అవుతాడు.