ఫస్ట్ రోజు రివ్యూ రాయడం కోసం థియేటర్ లోకి వెళ్లి అందరితో పాటు మహానటి ని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంతగా నేను ఈ సినిమా గురించి ఆలోచిస్తాను అని , అర్ధం చేసుకుంటాను అనీ , పరితపిస్తాను అనీ అనుకోలేదు. ఈ సినిమా విషయం లో నా మైండ్ లో ఒక డిఫరెంట్ యాంగిల్ తడుతోంది - మహానటి లో నన్ను ఆకట్టుకున్న అంశాల్లో కీర్తి కంటే అందమైనది , నాగ అశ్విన్ కంటే తెలివైనది , సమంత కంటే నిశితమైనదీ ఇంకొకటి ఉంది .. అసలు ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకొక విచిత్రమైన ప్రశ్న తొలిచింది . " అసలు నలభై లలో యాభైలలో అరవై లలో పుట్టినవాళ్ళు ఈ సినిమాని సినిమాలాగా చూస్తారా ? లేక వేరే దృష్టి ఉంటుందా అని " 'ఉంటుంది' అనేది నాకు అనిపిస్తున్న భావన. మహానాటి సినిమా ఈ తరానికి , కొత్త తరాలకి , కాస్తంత ముందరి తరాలకీ ఒక సినిమా మాత్రమే కావచ్చు .. యాభై లలో పుట్టి అరవై లలో పెరిగి లేదా నలభై లలో పుట్టి యాభైలలో పెరిగి ఇప్పుడు మనవళ్ల ని ఆడిస్తూ నో మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తూనో గడిపే వారికి ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు అనేది నా గట్టి నమ్మకం. ఉదాహరణ కి నా తరం వారికి తొమ్మిదో తరగతి లో ఖుషి వచ్చింది , డిగ్రీ లో పోకిరి వచ్చింది(నా తరవాత తరాల వారికి తొమ్మిదో తరగతి లో పోకిరి డిగ్రీ లో అత్తారింటికి దారేది కూడా వచ్చి ఉండచ్చు అది వేరే సంగతి) .. ఈ సినిమాల యొక్క ఐదేళ్ళు, పదేళ్ళు గడిచే కొద్దీ మనందరం ఆ స్మృతులు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం .. 10 ఇయర్స్ ఆఫ్ పోకిరీ , 17 ఇయర్స్ of ఖుషీ అని మనం రాసుకునేది అప్పటి అనుభూతులని గుర్తుకు తెచ్చుకోవడానికే. రికార్డులు, హడావిడీ కంటే కూడా 'ఆ రోజులతో' మనం విపరీతంగా కనక్ట్ అయిపోతాం.
అప్పటి తరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలు యాభై ఏళ్ళు అయితే కనక్ట్ కావచ్చు కానీ హీరోల మీద అభిమానం తో కనక్ట్ అవ్వడానికీ సావిత్రి మీద ప్రేమతో కనక్ట్ కావడానికి మేజర్ డిఫరెన్స్ ఉంది. సావిత్రి డామినేట్ చెయ్యకుండా డామినేట్ చేసిన డామినేట్ హీరోయిన్ - సావిత్రి తరం లో ఉన్న వారికి మాత్రమే ఈ మాట అర్ధం అవుతుంది. ఆమె ఎవ్వరి మీదా జయలలిత లాగా , భానుమతి లాగా డామినేషన్ కోసం ఎగబడిన వ్యక్తి కాదు . సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పినట్టు " వెండితెర కి సావిత్రి అవసరం ఉంది, సావిత్రి కి వెండితెర అవసరం లేకపోయినా" ఇది నూటికి నూరు పాళ్ళూ నిజం. సావిత్రి ఏనాడో ఆ తరం జనాలకి పడిన రుణమే కావచ్చు అదంతా కూడా .. ఒక ఎన్టీఆర్ , ఏఎన్నార్ లు లెజెండ్ లు అయినా సావిత్రి అనే ఒక హీరోయిన్ అప్పుడు 'గొప్ప' కాదు సగటు ఆడపిల్ల .. మనింట్లోంచి ఒక ఆడపిల్ల తెరమీదకి వెళ్ళిందా అనేట్టు గా ఆమె ఉండేది. సో హీరోలతో కంటే సావిత్రి మీద వారి కనక్తింగ్ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది
మహానటి సినిమాలో 'మాయాబజార్' వస్తుంది , మిస్సమ్మ కనపడుతుంది , ఒకటి కాదు రెండు కాదు అన్నింటినీ టచ్ చేసాడు డైరెక్టర్ .. అయితే చూస్తున్న ప్రేక్షకుల్లో ఆ తరం వారు వెంటనే తమ తమ వయసుకి తగ్గట్టు అప్పటి పరిస్థితులని విపరీతంగా గుర్తు తెచ్చుకుంటారు అనేది నా ఫీలింగ్ . ఆణువణువూ వారి బాల్యం కావచ్చు, యవ్వనం కావచ్చు , పెళ్ళైన కొత్త రోజులు కావచ్చు అన్నీ వారి మనస్సులో మళ్ళీ చక్కర్లు కొట్టేది మహానటి థియేటర్ లలోనే. ఎంతగా అంటే ఒక పక్క సావిత్రి మళ్ళీ పుట్టిందా అన్నట్టు నటించే కీర్తి , అచ్చం అప్పటి పాత్రలనే తెరమీద చూపించి ఆదరగోడుతూ ఉన్న సీన్ లు, అప్పటి సినిమాల కబుర్లు, ఇలోగా ఆమె జీవితం లో ఏం జరుగుతోంది అనే టెన్షన్ - ఇంత అందమైన పొందికైన కలయిక తెరమీద నుంచి మనుషుల మనసుల్లోకి భావోద్వేగాల లాగా తీసుకురావడం జరిగే పనేనా ? ఇదే మహానటి లో అశ్విన్ చేసిన ఒక అద్భుతమైన మ్యాజిక్.
ఒక అమ్మాయి ఊరునుంచి వచ్చి హీరోయిన్ అయ్యి , గొప్పగా ఎదిగి , చివరికి అన్యాయం అయిపోతుంది అనే సింపుల్ బోరింగ్ పాయింట్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి - హ్యూమన్ టచింగ్ పాయింట్ ఉంది అక్కడ. ఆ ఒక అమ్మాయి నిజంగా ఉంది అనేది మన మనసు చెప్తూ ఉంటుంది, ఆ ఒక అమ్మాయి ఎవరో కాదు మన కళ్ళముందు ఎదిగిన సావిత్రి అనే మాట వినపడుతూ ఉంటుంది చెవుల్లో .
సినిమా నిడివి మూడు గంటల్లో ప్రతీ నిమిషం ఆ తరం జనాలని తమ రోజుల్లోకి మళ్ళీ మోసుకుని పోయిన సినిమా మహానటి .. మూడు గంటల వ్యవధి లో మన చిన్నతనం , యవ్వనం సర్వం కళ్ళముందు మెదలడం అదీ మనకి తెలీకుండా జరగడం అంటే అంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది? అరవై నుంచి డబ్బై ఏళ్ళ వయసుల వారికి " మూడు గంటల పాటు వారిని చిన్న పిల్లల్ని అయిపోండి" అంటి అంతకంటే వారి జన్మకి కావాల్సింది ఏముంటుంది ? ఎందుకంటే ఇన్నేళ్ళ జీవితం లో వారికి అనుభవాలు మెండుగా ఉండచ్చు, అనుభూతులు గొప్పవి ఉండచ్చు కానీ జ్ఞాపకాలని వెనక్కి ఇంత చక్కగా తీసుకుని రావడం మాత్రం నాగ అశ్విన్ వల్లనే అయ్యింది .. Nothing can be a greatest gift for your Mom or your Granny on this Mother's day . Show MAHANTI to your Mom who is your life's biggest Savitri. ఇంత గొప్పగా మా తల్లి తండ్రుల/ తాత అమ్మమ్మల ని సంతోషపెట్టిన అతనికీ , ఈ సినిమాకి అతనికోసం సహకరించిన ప్రతీ ఒక్కరికీ సహకరించిన ప్రతీ ఒక్కరికీ డబ్భై లు ఎనభైలు తొంభైలలో ఆ పైన పుట్టిన ప్రతీ ఒక్కరి తరఫునా .. 'మహా' వందనం ..