రాజమండ్రిలోని ఈ ప్రియదర్శిని పాఠశాలకు వెళ్ళినప్పుడు విద్యార్ధులను చూస్తే వీళ్ళందరూ మూగ, చెవిటి వారు అని అస్సలు అనుకోరు. ఒక వ్యక్తిలోని లోపాలను ముందుగానే పసిగట్టడానికి వారి బాడీ లాంగ్వేజిని చూస్తే తెలిసిపోతుంది. కాని ఈ విద్యార్ధులను చూస్తే అస్సలు అలా అనిపించదు వారు కూడా మనలానే స్పందిస్తారు, ప్రవర్తిస్తారు ఇదంత వారిని అలా ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆ పాఠశాల యాజమాన్యం వారిది.
అమ్మ నాన్నలకు వారి పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా గాని పిల్లలలోని లోపాలను ఒక్కోసారి సరిచేయలేరు. అలవాట్లను మార్చవచ్చేమో కాని జన్మతహా, ప్రమాదవశాత్తు ఏర్పడిన లోపాలను సరిచేయడం చాలా కష్టం. ఒక విద్యార్ధి చదువులో కాస్త వెనుకబడి ఉంటేనే అడ్మిషన్ ఇవ్వని ఈ స్కూల్స్ మూగ, చెవిటి లాంటి శారీరక లోపం ఉన్నవారి పట్ల ఎలా ప్రవర్తిస్తారో అనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పిల్లల బాధలు చూసి ఆవేదనతో సుమన గంటెల గారు 2000లో రాజమండ్రిలోనే ఈ ఆశ్రమ పాఠశాలను తొమ్మిదిమంది విద్యార్ధులతో స్థాపించారు(ప్రస్తుతం స్వప్న గారు ఈ స్కూల్ బాధ్యతలను చూస్తున్నారు). ఇందులో చదువుకునే విద్యార్ధులకు చదువుతో పాటు, భోజనం, వసతి, స్పీచ్ థెరపి, సాంస్కృతిక కళలు మిగిలినవన్ని కూడా పూర్తిగా ఉచితం.
ఎల్.కే.జి నుండే: అన్ని ఉన్నవారికి చెప్పిన ప్రతిది అర్ధమవుతుంది. అందుకే ముందుగా టీచర్స్ చెప్పేది అర్ధం అవ్వాలని ఎల్.కే.జి నుండే మాట్లాడడం రాని విద్యార్ధుల కోసం స్పీచ్ థెరపీని నేర్పించడం మొదలుపెడతారు, వినడం ఇబ్బందిగా ఉన్న వారికి చేతి సిగ్నల్స్ ద్వారా ఎలా అర్ధం చేసుకోవాలో అని ట్రైనింగ్ మొదలుపెడతారు. అలా కేవలం కొన్ని క్లాసుల వరకు మాత్రమే కాదు ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాల టెక్నిక్స్ వివరిస్తారు. ఆ తర్వాత ఏ ఉద్యోగం దొరకకపోయినా గాని తమ స్వశక్తిగా బ్రతకడానికి కంప్యూటర్ ట్రైనింగ్, గాజుల తయారి, గోల్డెన్ ట్రీ లాంటి వెన్నే నేర్పించి అన్ని విధాలుగా తల్లిదండ్రుల బాధ్యతలన్నీటిని పాఠశాల యాజమాన్యం వారే చూసుకుంటారు.
ఈ ఆశ్రమ పాఠశాల పూర్తిగా కూడా డోనేషన్ల ద్వారానే నడుపుతున్నారు. 19 సంవత్సరాల ఈ సుధీర్ఘ ప్రయాణంలో ఎన్నో సార్లు రకరకాల ఇబ్బందులు ఎదుర్కున్నా గాని ఆ విషయాలు పిల్లలకు తెలియకుండా చుసుకుంటున్నారు. వారికి ఏ రకంగానైనా ఆసరాగా ఉండాలి అని తపించేవారు ఈ నెంబర్ కు కాల్ చేయవచ్చు 9989224050.