పేరెంట్స్ జస్పేర్ ను చిన్నతనం నుండి ఏ లోపం లేకుండా చూసుకున్నారు.. అడిగినది మాత్రమే కాదు అడగనది, తన ఊహకందని సౌకర్యాలను అమ్మనాన్నలు కల్పించారు. అన్ని ఇష్టమైనవాటితో పాటు 19సంవత్సరాలకే కార్ కొనిచ్చారు. ఇలా ఆనందంగా జీవితం సాగితే వీడి జన్మకు అర్ధం ఉండదనుకున్నాడేమో భగవంతుడు. 2014లో జస్పేర్ నడుపుతున్న కారుకి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కారు గాలిలో మూడు పల్టీలు కొట్టి పూర్తిగా డామేజ్ ఐయ్యింది. భగవంతుని స్క్రీన్ ప్లే కదా మనోడికి మాత్రం ఏమంత పెద్ద గాయాలు కాలేదు. అప్పుడే ఆ హాస్పిటల్ బెడ్ మీదే ఆలోచన మొదలయ్యింది. "ఒకవేళ అదే యాక్సిడెంట్ లో నేను చనిపోతే.? ఎంత అసంపూర్ణ జన్మ అయ్యేది నాది, నా చుట్టు అభాగ్యులున్నా గాని ఏ ఒక్కరి జీవితాన్ని బాగుచేయలేదు.. ఏ ఒక్కరి ప్రాణాన్ని కాపాడలేదు.. నిజంగా నేను చనిపోయేదుంటే ఎంత వ్యర్ధమయ్యేది.! ఇదే నాకు పునర్జన్మ నా మనస్తత్వానికి, నా శరీరానికి ఇది భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం, ఇక నేను సమాజం కోసమే బ్రతుకుతాను అని ముందుకు కదిలాడు.. "The Second Chance" సంస్థను స్థాపించారు.
ఒకసారి గాంధీ హాస్పిటల్ దగ్గర 70సంవత్సరాల వ్యక్తి కాలికి గాయంతో అక్కడే పడి ఉన్నారు. చుట్టు ఇంతమంది జనం ఉన్నా కాని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. జస్పేర్ హుటాహుటిగా అతని దగ్గరికి వెళ్ళి ప్రాక్చర్ ఐన శరీరానికి ట్రీట్మెంట్ అందించారు. ట్రీట్మెంట్ అందించడం అంటే డబ్బు ఇచ్చో, మెడిసిన్స్ ఇచ్చో మాత్రమే కాదు కంటికి రెప్పలా ఒక కొడుకులా హాస్పిటల్ లోనే ఉంటూ అన్ని టెస్ట్ లు చేసి, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకునేంత వరకు అక్కడే ఉండి సేవ చేసి ప్రాణం కాపాడారు. మరోసారి ఉస్మానియా హాస్పిటల్ ముందు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి సంచరిస్తు ఉండేవాడు. ఈ పిచ్చి మా వల్ల కాదని కుటుంబ సభ్యులు వెలివేసిన అమాయక ప్రాణం అది. సరిగ్గా తినడం రాదు, మాటల్లో వర్ణించలేనంత అసహ్యంగా అతని వ్యవహార శైలి ఉండేది. 22సంవత్సరాల జస్పేర్ ఆ వ్యక్తిని మానవత్వంతో ఆదుకుని సెకండ్ చాన్స్ హోమ్ కు తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇలాంటి మనసు కలిచివేసే సంఘటనలు వందల సంఖ్యలో ఉన్నాయి..
ఇంతవరకు చాలా ఆర్గనైజేషన్స్ హోటళ్ళు, రెస్టారెంట్స్ లో మిగిలిపోయిన ఆహారాన్ని గాని, దుప్పట్లు, బట్టలు ఇస్తూ అక్కడే ఉండనిస్తూ పెంచిపోషిస్తున్నారు తప్పా వారికి ఒక షెల్టర్ ఇచ్చి, ఉపాధితో వారిని బాగుచేసేవారు అత్యంత అరుదుగా ఉండేవారు. మంచి ఉద్దేశం ఉన్నా కాని జస్పేర్ సేవా సంస్థలలో ఉన్న లోపాలను గుర్తించి మిగిలిన వారందరి కన్నా భిన్నంగా ఉన్నతంగా తన సంస్థను నడిపిస్తున్నారు.
అనుకున్నట్టుగానే ముందుగా నిర్ధేశించుకున్న ప్రణాళికలకు తగ్గట్టుగానే పేదలు ఉన్న చోటుకు వెళ్ళి భోజనం పెట్టడం లాంటివి కాకుండా వారికి ఒక షెల్టర్ ఇచ్చి, భోజనం, మిగిలిన అన్ని ఖర్చులు భరిస్తూ కన్నబిడ్డాలా చూసుకుంటున్నారు. ఇక్కడున్న చాలా మందికి, ఏయిడ్స్, క్యాన్సర్ లాంటి ఇతర ప్రాణాంతకమైన జబ్బులు ఉన్నాయి. డబ్బులు తీసుకుని ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ల నుండి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల వరకు పట్టించుకోని సమయంలో జస్పేర్ ఇంకా అతని బృందం అండగా నిలబడి, భోజనం వసతి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సంస్థలో నలుగురు ఉద్యోగులు నెలకు 17,000 జీతంతో పనిచేస్తుంటారు (ఉద్యోగస్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకుని) ఈ ప్రపంచంలో ప్రతి వక్తి తన జీవితంలో కనీసం ఒక్కరినైనా ఆదుకున్నా కాని భూమి స్వర్గంగా మారిపోతుంది అలాంటి రోజులు రావాలని తపన పడుతూ అందుకు తగిన విధంగా మిత్రులను, సమాజాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగిపోతున్నారు.