పదిమంది కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో ఒక్కరు పనిచేస్తే ఆ ఇల్లు గడవడం ఎంత కష్టమో 130 కోట్ల భారతీయ జనాభాలో కొందరు మాత్రమే సహాయక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అంతే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శక్తి, అందుకు తగ్గ ఆలోచనలు, అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఈ విపత్కరమైన పరిస్థితిలో తమవంతు బాధ్యతలను నెరవేరిస్తే అభాగ్యులకు ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్తితిలో మాటలు కాదు చేతలు ముఖ్యం అని బలంగా నమ్మే మహిళ అమరేశ్వరి గారు. ఒకపక్క సుమారు 10 గంటలకు పైగా సెక్యూరిటీ జాబ్ నిర్వహిస్తూనే ఏ మాత్రం అలసట చెందక ప్రతిరోజు 250 మస్కులు పైగా కుడుతూ ఉచితంగా అందజేస్తున్నారు.
రెండు నెలల క్రితం మాములు సర్జికల్ మాస్క్ మూడు రూపాయలుండేది, N95 మాస్క్ దాదాపు వందరూపాయలలోనే లభించేది. ఇప్పుడు N95 మాస్క్ రూ.1000 ఇచ్చినా దొరకని పరిస్థితి, సర్జికల్ మాస్క్ ఐతే సరేసరి. కోవిడ్19 నుండి రక్షణ పొందాలంటే మాస్క్ ఖచ్చితం, కొన్ని ప్రభుత్వాలు ఐతే హెల్మెట్ లేకుంటే ఎలాంటి ఫైన్ విధిస్తున్నారో మాస్క్ లేకుంటే కూడా అదే ఫైన్ విధిస్తున్నారు. ఈ సమయంలో అమరేశ్వరి గారి సహాయం వెలకట్టలేనిది. ఈ మాస్కుల తయారీ కోసం చీరలు, మార్కెట్ లో దొరికే బ్లౌస్ పీస్ లను కొనుగోలు చేస్తున్నారు. అమ్మ వాటిని ముక్కలుగా కత్తిరించి ఇస్తే అమరేశ్వరి గారు మస్కులు కుడుతున్నారు.
అమరేశ్వరి గారు తెలంగాణ రాజ్ భవన్ లో సెక్యూరిటీగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉద్యోగం రోజు విడిచి రోజు ఉంటుంది. ఉద్యోగానికి వెళ్లే రోజులలో ఉదయం మూడున్నరకే లేచి ఇంటి పనులు చూసుకుని, కుటుంబ సభ్యుల కోసం, తన లంచ్ కోసం భోజనం వండుకుని సరిగ్గా ఉదయం ఆరు గంటలకల్లా గవర్నర్ గారి ఇంటికి చేరుకుంటారు, తిరిగి ఆఫీసు నుండి ఇంటికి వెళ్లే సరికి రాత్రి తొమ్మిది దాటిపోతుంది. ఐన కానీ ఇక్కడ ఏ మాత్రం అలసట ప్రదర్శించక ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు.
మొదట తన ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలకు, ఆ తర్వాత ఆఫీసుకు వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే వారికి తను కుట్టిన మాస్కులను అందజేసి తగిన జాగ్రత్తలు చెబుతున్నారు. మన తెలంగాణా లో 20 కోవిడ్19 కేసులు నమోదైన దగ్గరి నుండి వారు మాస్కులు కుట్టడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి 3,000 మాస్కులు కుట్టిన అమరేశ్వరి గారు భవిష్యత్తులో 10,000 మాస్కులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
Source:TNM & Eenadu