"మన మాటలు చేతలు ఒకే రకంగా ఉండడమే నిజాయితీ" అని ఓ గొప్ప కవి గారంటారు. శేఖర్ కమ్ముల గారు నిజాయితీ గల దర్శకుడు, ఆయన సినిమా కథలలో మహిళలకు ఎంతటి విలువనిస్తారో తెర వెనుక కూడా అంతే గౌరవం ఇస్తూ వారి అభ్యున్నతికి తన స్థాయిలో సహాయపడతారు. శేఖర్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మహిళా సహాయ దర్శకులను గత రెండు మూడు సినిమాల నుండి ఎంపిక చేసుకోలేదు, తనకంటూ ఏ పేరు రాక మునుపు నుండే ఈ పరంపర మొదలయ్యింది. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా శేఖర్ కమ్ముల గారు ప్రత్యేకంగా తన ఫేస్ బుక్ పేజ్ లో చేసిన పోస్ట్ ఆధారంగా ఈ ఆర్టికల్ రూపుదిద్దుకుంది. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే.. నా ఫిల్మ్ జర్నీలో నాతో పాటు పని చేసిన అమ్మాయిలు అందరికి.. హాపి విమెన్స్ డే. 1999లో నా ఫస్ట్ ఫిల్మ్ 'డాలర్ డ్రీంస్ ' టైంకి ఇండస్ట్రిలో పని చేసే అమ్మాయిల సంఖ్య, వాళ్ళకి ఉండాల్సిన ఫెసిలిటీస్ చాలా తక్కువ. అయినా సరే.. చాలా కష్టమైన స్కెడ్యుల్స్ లో, శెలవలు కుడా లేకుండా, టైం, ప్లేస్ పట్టించుకోకుండా, సదుపాయాలు తక్కువ ఉన్నా సరే, అన్నిటినీ తట్టుకుని, నిలబడి పని చేశారు. ఎంత కఠినంగా ఉన్నా సరే, సినిమా కోసం ప్రతీ పనీ ఫెయిల్ అవ్వకుండా చేస్తూనే ఉన్నారు. నా సినిమాలు అన్నిటిలో ఎప్పటికీ ఉండిపొయే ఒక పాజిటివ్ ముద్ర మీరు వేస్తునే ఉన్నారు మన టీంలో పని చేసి, డైరెక్టర్స్ అయిన అబ్బాయిలని చూశాను. మీరు ఆ లిస్ట్లో ఎప్పుడు చేరుతారా అని వెయిట్ చేస్తున్నాను. మీ కథల్ని, అమ్మాయిలుగా మీరు మాత్రమే చెప్పగలిగే అంశాలని స్క్రీన్ మీద చూసే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను.