మానవ మనుగడకు ముప్పు తెచ్చే ప్లాస్టిక్ ను గౌరవిస్తున్నాం, ఎటువంటి హాని కలిగించని పాత బట్టలను వంటింట్లో పనిమనుషులుగా వాడుకుంటున్నాం.. వాటికేం ఇబ్బందులు లేవు. ఫలితం మనమే అనుభవిస్తున్నాం.

హైదరాబాద్ లో నివాసముంటున్న శోభ గారు చాలామందికి మల్లె తనకు ప్లాస్టిక్ మరియు అది ప్రపంచ వినాశనానికి ఎలా త్వరగా తీసుకువెళ్తుందో అంతగా ఆలోచన లేదు. ఇంటర్ పూర్తిచేసిన తర్వాత టైలరింగ్, పెయింటింగ్, ఎంబ్రైడరీ వర్క్స్ చేస్తూ ఆ తర్వాత బ్యూటీషియన్ కోర్స్ లో డిప్లొమా పూర్తిచేసి ఇంటిదగ్గరే పార్లర్ కూడా మొదలుపెట్టారు. "ఒక చిన్ని కదళికతో ప్రపంచాన్ని మార్చవచ్చు అని మహాత్మ గాంధీ గారు చెప్పినట్టుగా సాఫీగా సాగుతున్న శోభ గారి జీవన ప్రయాణంలో ఒక చిన్ని కదలికను ఈ ప్రకృతి కలిగించింది.


ఓసారి ఆరోగ్యం బాగోలేనప్పుడు తన ఫ్యామిలీ డాక్టర్ ను కలిశారు. ఏవో విషయాలు మాట్లాడుతూ టాపిక్ "వాతావరణం, కాలుష్యం. ప్రజల జీవితాలలో ప్లాస్టిక్ రాక, వాటి వల్ల ఎదురవుతున్న అనర్ధాలు మొదలైన విషయాల గురుంచి డాక్టర్ గారు శోభకు వివరించారు". ఇది జరిగిన కొంతకాలానికే తన స్నేహితురాలి నుండి 100 పేపర్ బ్యాగులకు సంభందించిన ఆర్డర్ ఒకటి వచ్చింది. "పేపర్ బ్యాగ్ అంటే మళ్ళి ప్రకృతికి ఇబ్బంది అలా కాకుండా పాత చీరలతో బ్యాగులను కుట్టి మిత్రురాలికి చూపించింది. చాలా బాగుందని మెచ్చుకుని 200 బ్యాగులకు ఆర్డర్ ఇచ్చారు. శోభ గారొక్కరే ఇన్ని బ్యాగులను కుట్టలేరు మరికొంత మంది సహాయం కావాలి. ఇంట్లో పనిమనిషి, స్లమ్ ఏరియాలో ఉండే మరికొందరితో మాట్లాడి(వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశ్యంతో) 200 బ్యాగులను కొన్ని రోజులలోనే కుట్టి ఇచ్చేశారు.

ఈ ఆర్డర్ తర్వాత పాత చీరలతో ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ లను పూర్తిగా నిర్ములించాలనే ఉద్దేశ్యంతో మరింత మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. కూరగాయలు, పండ్ల మార్కెట్ మొదలైన ప్రాంతాలకు చేరుకొని అవగాహన కల్పించారు. మొదట వాళ్ళు ఏ మాత్రం ఆసక్తి చూపించకపోయిన ఉచితంగా పంపిణి చేశారు. రాను రాను ప్రజలలోను అవగాహన పెరుగుతుండడం వల్ల ఆర్డర్లు కూడా పెరుగుతూ వచ్చాయి.


పాతచీరలను, ఇతర డ్రెస్ లను మరల ఉపయోగించుకోవడానికి ఒక పద్దతిని ఇక్కడ అవలంభిస్తారు. చీరలను సావ్ లాన్ వేసి కొన్ని గంటల పాటు నానబెడతారు. తర్వాత వాషింగ్ మెషిన్ లో డిటర్జెంట్ పౌడర్ తో ఉతికి ఆరబెడతారు. ఆ తర్వాత నే సంచులకు అనుగుణంగా కత్తిరించి తయారుచేస్తారు. కొన్ని చీరలతో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి వారం దాదాపు 5 వేల బ్యాగుల ఆర్డర్లను అందుకుంటుంది. శోభ గారి దగ్గర ప్రస్తుతం 10 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. మహిళలకు, ప్రకృతికి, ఒక్కసారి కొంటే ఎక్కువ రోజులులకు ఉపయోగపడుతుంది కాబట్టి వినియోగదారునికి కూడా ఆనందం మిగులుతుంది.

You can reach them here: Rising Eves
Phone Number: 8179836318