Contributed By Sai Ram Nedunuri
తన గురించి చాలా విషయాలు తెలిసినా, ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు నేను
అసలు నేనంటూ ఒకడ్ని ఉన్నానని, ఎపుడూ గమనించనే లేదేమో తను
తనని అభిమానిస్తున్నానని ఎన్నో సార్లు కళ్ళతో చెప్పేశాను నేను
నా అభిమానాన్ని కాదు కదా, నా చూపులని కూడా ఎప్పుడూ గమనించి ఉండదు తను
ఆ రోజు ఎందుకో, తన వైపు చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయాను నేను
ఎంతో మంది అందుకోవాలని చూస్తున్నా, ఎవరికి అందని జాబిల్లిలా మెరుస్తూ ఉంది తను
రెప్పపాటు కాలం కూడా తనని చూడకుండా ఉండలేక తనని చూస్తూ రెప్పార్పడం మానేశాను నేను
రెప్పపాటు కాలం అయినా నా చూపుల నుంచి తప్పించుకోవాలని రెప్పలాడిస్తూనే ఉంది తను
తన ఇబ్బంది గమనించి కష్టమైనా తన నుంచి చూపు మరల్చాను నేను
హాయితో కూడుకున్న నిశ్వాసని విడిచి, ప్రశాంతంగా తన పని చేసుకుంటోందేమో తను
తనని చూడకుండా తన చుట్టుపక్కల ఉండలేకదూరంగా అడుగులేసాను నేను
అనుకోకుండా నా అడుగులకు ఎదురుగా తారసపడింది తను
వేగం పెరిగిన శ్వాసతో ఏం చేయాలో తెలియక నా చూపుని తన పాదాల పట్టీల వైపుకి, నా అడుగులను తన కుడి వైపుకి మరల్చేసాను నేను
నా హడావిడి చూసి ఏమనుకుందో ఏమో తను
దూరంగా వెళ్లి కూర్చుని, నా ఆలోచనలను తన నుంచి వెనక్కి రప్పించడానికి కష్టపడుతున్నాను నేను
ఇంతలో ఎవరితోనో మాట్లాడుతూ ఎదురుగా నడుచుకుంటూ వస్తోంది తను
పెరుగుతున్న గుండె వేగాన్ని, తనవైపుగా వెళ్తున్న నా చూపుని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను నేను
నా ఎదురుగా వచ్చి కూర్చుంది తను
నా గుండె చప్పుడు తప్ప ఇంకేమీ వినలేకపోతున్నాను నేను
ఎదో చెప్పాలన్నట్టుగా నా వైపు చూసింది తను
రెప్పార్పకుండా చూసి తనని ఇబ్బంది పెట్టినందుకు ఏమనుకోవద్దు అని చెప్పాను నేను
అదేదో సంగీత వాయిద్యం మోగినట్టుగట్టిగా నవ్వేసింది తను
ఏమనాలో తెలియక, ఎన్నో చెప్పే అవకాశాన్ని వదులుకోలేక, సందిగ్ధంలో ఉన్నాను నేను
కంగారుపడొద్దు అని సర్దిచెప్పి, తన ఇబ్బందిని గమనించి దూరంగా నేను వెళ్లిన తీరు నచ్చిందని చెప్పి నవ్వింది తను
అయితే నన్ను ఈరోజే మొదటి సారిగా గమనించిందనుకున్నాను నేను
ఎప్పటిలాగ కాకుండా, ఇవాళ తన చుట్టు పక్కల తనకు తెలిసిన చాలా మంది గమనిస్తూ ఉండడం వలన ఇబ్బందిగా అనిపించిందని అనింది తను
అంటే తనకి నా గురించి ముందే తెలుసా అని ఆశ్చర్యపోయాను నేను
తనకి తెలియకుండా తన చుట్టూ ఉన్నానని నేను అనుకున్న ఎన్నో రోజులని మళ్ళీ గుర్తుచేసింది తను
తన మీద నా భావాలని చెప్పేయనా నేను ?
నా మీద అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేస్తోందా తను ?