Contributed By Rohith Sai
అక్కడ "ఒక" ప్రసవం జరగాలంటే ...."రెండు" ప్రాణాలు యుద్ధం చెయ్యాల్సిందే!!
బైటకి కనపడే లోకంలో,
కనీస వసతులు లేమిలో,
చాలీచాలని మెతుకులతో,
తడారిపోయిన గొంతుకతో ,
"అమ్మ" అనే పిలుపుకై,తల్లి మోసే మా'రణం'.
లోపల చీకటి గర్భంలో,
వెచ్చగ పారే రుధిరంలో,
అందీఅందని పోషణతో,
ఆకలికేకల రోదనతో,
రేపొద్దు చూసే ఉదయానికై,
బిడ్డ చేసే రణం.
తొమ్మిదిమాసాల పోరు జరిగాక,
ఇరువురి ప్రాణాలు నిలిచాక,
బిడ్డ మొదటి ఏడుపు విన్నాక,ఆ రోజు,
తన చూపు .....ఎదురుగా ఉన్న గోడపైన ఆగింది.
ఆమె భర్త ఆనందంగా నవ్వుతూ,
తన వైపే చూస్తున్నాడు.
ఆ బిడ్డ... వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం.
కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రమాదం,
అతన్ని, ఆమెకి దూరం చేసింది.
అప్పటి వరుకు ఓ అందమైన ఆనందం,ఒక్కసారిగా... పదిలంగా మోసే జ్ఞాపకం.
ఆమెదిప్పుడు, చితికిపోయిన బ్రతుకు,
జారిపోయిన జీవితం, మార్చలేని గతం.
ఐదేళ్ళ ప్రేమ ఏమారిపోయింది,
పసుపు తాడు తెగిపోయింది,
ఒంటరితనం ఆభరణం అయ్యింది.
ప్రేమించి, పెద్దల్ని ఎదిరించిన వివాహం...
అయినవాళ్ళ ఎవ్వరు రాక,
స్నేహితుల అండ లేక,
ఇప్పుడుఆమె జీవితం అస్తవ్యస్తం,ప్రపంచం
అతలాకుతలం.ఒంటరితనం తనని ఇంకా బాధపెట్టింది.
బిడ్డ భవిష్యత్తు మరింత భయపెట్టింది.
జీవితం ఆమెకు చూపేవి రెండే మార్గాలు:
కష్టాలకి తలవంచి,
పుట్టిన బిడ్డతో కలిసి కాటికి పోవడం...
కన్నీళ్లు తుడుచుకుని, కష్టాన్ని ఎదిరించి, బిడ్డని కాచుకోవడం.
బాగా ఆలోచించింది,
ప్రపంచానికి తన విజయాన్ని పరిచయం చెయ్యాలని నిశ్చయించుకుంది.
రెండో దారినే ఎంచుకుంది.
ఎప్పుడు గడప దాటని తనుతన కోసం,
తన బిడ్డ కోసం,ముందుకు సాగింది.
గడప దాటి, ఊరు దాటి,
వేరే ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
తన ఆశయమే ఆయుధంగా,భర్త స్మృతులే ఆశీస్సులుగా,
దాచుకున్న తాళే పెట్టుబడిగా పెట్టి,
పచ్చడి వ్యాపారం మొదలుపెట్టింది.
కాయ కష్టంతో, చేతి మహత్యంతో,వ్యాపారం కొన్ని నెలల్లోనే పుంజుకుంది.
వాళ్ళ జీవితం నిప్పుల కొలిమి నుండివెన్నెల వాకిట్లోకి చేరింది.
బిడ్డ ఎదిగింది, బడిలో చేరింది.వాళ్ళమ్మ గతాన్ని,
కష్టాన్ని, వివరించి,
"చదువుకో తల్లి... బతుకు బాగుంటుంది"అని పదేపదే చెప్పేది.
చదువు ఆలోచించడం నేర్పింది.
పాప పెద్దైయింది.
వ్యాపారం తాను పుచ్చుకుంది.
ఇంకాస్త పెద్దగా విస్తరించింది.
వందల కుటుంబాలకు తాను ఆసరాగా మారింది...వారికి చేయూతనిచ్చింది.
బిడ్డని చూసిన తల్లి మురిసిపోయింది.
ఆ తల్లి... జీవితాన్ని గెలిచింది!!
ఇది భాదల్ని, కష్టాల్ని తట్టుకుని,బిడ్డని పెంచిన ఒక ఒంటరి తల్లి కథ.
మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో,మనకి అరుదుగా వినపించే ఓ వీర గాథ .