కోకిలకు గానాన్ని ఎవరు నేర్పిస్తారు..? నెమలికి నాట్య శిక్షణ ఎవరిస్తారు..? నిజమే ఎవ్వరూ నేర్పించలేరు. అవి జన్మతహా వచ్చే వరాలు. వరానికి, కష్టపడే తత్వానికి చాలా తేడా ఉంటుంది. వరానికి ఏ శ్రమ అవసరం లేకపోవచ్చు. కాని మనలోని లోటుకు మాత్రం శ్రమ అవసరం.. మనలోని ఏ లోపాన్ని ఐనా కష్టంతో పూడ్చవచ్చు. ఆ శ్రమతో మరో కోకిలలా మాధురంగా పాటలు పాడవచ్చు.. నెమలి నాట్యంలా సమ్మోహనం చేయవచ్చు. "సిరిసిల్ల రాజేశ్వరి" మాటలు రాకుంటే ఏం స్వచ్చమైన మనసుంది.. చేతులు లేకుంటే ఏం తన రాతలతో ప్రజలను చైతన్య పరిచేంతటి శక్తి ఉంది. ఇది చాలదా తన ఉనికి, తన సంకల్ప బలం ఎంతటి శక్తివంతమైనదో గుర్తించడానికి..
కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ వనిత ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. జన్మతహా శారీరకంగా వికలాంగురాలైనా కూడా మానసికంగా మాత్రం కాదు. "చేతులు వంకర తిరిగిపోయి పనిచేయలేవు, ఎక్కువ సేపు నిలబడలేదు. నరాల బలహీనత మూలంగా శరీరం ఎప్పుడూ వణికిపోతుంటుంది.." ఇన్ని సమస్యలున్న కూడా అతి కష్టం మీద తనలోని లోటును తన శక్తితోనే అధిగమించడానికి ప్రయత్నం చేశారు. అతి కష్టం మీద ఏడవ తరగతి పూర్తిచేశారు. ఆరోగ్య కారణాలు, ఆర్ధిక పరిస్థితి మూలంగ చదువును అంతటితోనే ఆపేసి తన గుండె చాటున ఉన్న భావాలను కాలితో వ్రాయడం ప్రారంభించారు. అలా దాదాపు 500 కవిత్వాల పాటు తన ప్రయాణం సాగింది.. ఇంకా సాగుతుంది. ఇందులో తనలాంటి వారు పడుతున్న బాధలు, రైతు, మహిళ సమస్యలు, తెలంగాణ కోసం యువకుల ఆత్మహత్యలపై ఎన్నో ఆలోచనాత్మకంగా రచనలు రాశారు.
సుద్దాల అశోక్ తేజ గారంటే తనకి విపరీతమైన అభిమానం. ఆయన పాటల స్పూర్తితోనే ఒకే జన్మలో రెండోసారి జన్మించి తన కవిత్వాలకు జన్మనిస్తున్నారు. దైవంగా అభిమానించే అభిమానిని అంతే గౌరవించే సుద్దాల అశోక్ తేజ గారు రాజేశ్వరి గురుంచి తెలుసుకుని స్వయంగా ఇంటికి వచ్చి కన్న కూతురిలా గుండెకు హత్తుకుని తన రచనలను ఒక పుస్తక రూపంలో పబ్లిష్ చేయించి ఆ కవిత్వాలను విశ్వవాప్తం చేశారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తన బాధను, టాలెంట్ ను గుర్తించి ప్రభుత్వం తరుపున రూ.10లక్షల ఫిక్స్‌డ్ టర్మ్ డిపాజిట్ చేపించి ప్రతినెలా రూ.10 వేలు పెన్షన్ అందేలా ఏర్పాట్లు చేశారు. నిజంగా అన్ని ఉన్న కూడా నాకు అది లేదు ఇది లేదు అంటూ వారి పుట్టుకను, వ్యవస్థను తిట్టుకుంటారు చాలామంది, అంతే కాని వారిలో దాగున్న గొప్ప శక్తిని గుర్తించలేరు, తెలుసుకొని కష్టపడలేరు! నిజానికి వారే అసలైన వికలాంగులు.!
"కలలు కనేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి.. కలల తీరం చేరాలంటే నిప్పుల బాటలో నడవాలి మరి.. అక్షరం పక్కన అక్షరం చేర్చి నడిచాను.. గమ్యం చేరేసరికి అది మధుర కావ్యమై నన్ను చేరుకుంది..!" "కన్నీళ్లను కలం చేసి మనసును అక్షరాలుగా మలిచి బాధను భావంగా తలచి రాస్తున్నాను.. ఈ కావ్యాన్ని కవిత కోసం నేను పుట్టాను.. కాంతికోసం కలం పట్టాను.. వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం.!" "నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన నాలోని సాహిత్యకళ ఆగదు.. వెలుగుతున్న చంద్రునికి కళ్లు లేవు, అయినా వెలుగుతూనే ఉంటాడు.. పారే జలపాతానికి కాళ్లు లేవు, అయినా జలజల పారుతూనే ఉంటుంది.. నాకు చేతులు లేవు, అయినా కానీ నాలో కవిత సాగుతూనే ఉంటుంది.!" - సిరిసిల్ల రాజేశ్వరి.