This Story Of A Man Who Retrieves Abandoned Dead Bodies Will Tell You The Harsh Reality Of Life

Shiva ante eede telugu short story
Updated on
This Story Of A Man Who Retrieves Abandoned Dead Bodies Will Tell You The Harsh Reality Of Life

Contributed By Telugu Lessa

ధన్!!

ఉలిక్కిపడి లేచాడు శివ. తనకి బాగా తెలిసిన శబ్దం అది. సమయం రాత్రి 2.45. పైన కుక్కలు మొరగడం మొదలుపెట్టాయి. హడావిడిగా పైకి పరిగెత్తాడు. అప్పటికే రెండు మూడు బళ్ళు ఆగాయి. కొంతమంది కింద నీళ్లలోకి చూస్తున్నారు. లేక్ పోలీస్ కానిస్టేబుల్ రేడియోలో అలెర్ట్ చేస్తున్నాడు. శివకి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనయ్యింది. భృకటి ముడిపెట్టి, ఆ చీకట్లో తను గోడ పక్కన పెట్టిన కర్ర కోసం చూశాడు. అది కనపడగానే ఏదో బండ గుర్తు దొరికినట్టు, ఒక్క ఉదుటున నీళ్ళలోకి దూకాడు. ఆ చీకట్లో అతని చూపు అంతా మునిగిపోతున్న వ్యక్తి మీదే వుంది. వేగంగా ఈదుకుంటూ ముందుకు వెళ్ళాడు.

ఆ వ్యక్తి ఒకవైపుకు జారిపోగా, శివ మరో వైపు వెతకసాగాడు. ఆ చీకట్లో ఒక చెయ్యి కనబడగానే అటు వైపు ఈది ఎట్టకేలకు చెయ్యి పట్టుకుని గోడ దగ్గరున్న రాళ్ళవరకు లాకొచ్చాడు. అప్పటికే నీళ్లు మింగేసిన ఆమెకి తాడుకట్టి పైకి చూసాడు. పై నుండి లేక్ పోలీసులు లాగి అంబులెన్సు ఎక్కించి తీసుకెళ్లారు.

అంత రాత్రివేళ కూడా జనం గుంపులు గుంపులుగా, తర్వాత జట్లు జట్లుగా, మెల్లమెల్లగా నలుగురుగా, నలుగురు ఇద్దరుగా విడిపోయి వెళ్లిపోయారు.

“రేయ్, ఈడేరా శవాల శివ అంటే” అని బండి స్టార్ట్ చేస్తూ వెనక కూర్చున్న వ్యక్తితో చెబుతున్నాడు ఒకతను. ఆ మాట వినగానే శివకి మనసులో కలుక్కుమంది.

నిలబడి అంబులెన్సు వెళ్లిన వైపు చూస్తున్న శివతో పోలీస్ వ్యాన్‌లోనుంచి కానిస్టేబుల్, “పేమెంట్ రేపు తీసుకో..” అని చెయ్యి ఊపాడు. వాళ్ళు వెళ్లిపోయారు.

“ఉండా? పొయ్యిండా?” అని టవల్ అందిస్తూ అడిగింది శాంతమ్మ.

“ఉంది”

“అయ్యో ఆడామెనా? ఇయ్యాలప్పుడు ఏంది?”

“ఏవో ఉంటయి పాడు పంచాయితీలు. ఇంట్ల చూసుకోవాలె ఇసోంటివి. పాణంపోతే వస్తదా?” అన్నాడు శివ.

ఆ రోజుతో శివ కాపాడిన ప్రాణాల లెక్క 114. లేక్ నుండి ఒక శవాన్ని పైకి లేపినా, ఒక ప్రాణాన్ని కాపాడినా రెండు మూడు రోజుల వరకు శివ మనసులో ఏదో కలవరం. తనలా ఒక అనాథకి ఉన్నన్ని బాధలు ఉన్నాయా వీళ్ళకి? వీళ్లది ఫుట్‌పాత్ జీవితం కాదు, కాగితాలు ఏరుకున్న కష్టాలు లేవు, భిక్షమెత్తిన బాధలు లేవు.. ఎందుకు చావడం? అలల చప్పుడు, పైన రోడ్డు మీద వెళ్లే ఒకటి రెండు బండ్లు తప్ప అంతా నిశ్శబ్దం. వీధి దీపం నుండి లాగిన చిన్న కరెంటు కనెక్షన్ నుండి ఓ గుడ్డి దీపం కింద ఏడుగురు పిల్లలు, శివ చేరతీసిన నలుగురు ఆనాథలు పడి నిద్రపోతున్నారు. చిన్నోడు, ప్రవీణ్ అటు ఇటు కదులుతున్నాడు. వాడికి లైట్ ఉంటే నిద్ర పట్టదు. అది లేకపోతే కింద నుండి విషపు జీవులు పైకి పాకుతాయని భయం శివకి. వాటికి కాపలాగా అరడజను పిల్లుల్ని ఆ హాల్ మధ్యలో పెంచుతాడు. ఇక నిద్ర పట్టలేదు అతనికి. లేచి, రెడీ అయ్యి మార్కెట్‌కి వెళ్ళాడు.

మోండా మార్కెట్.

“ఆ.. మూర ముప్పై.. మూర ముప్పై.. పండుగ పొద్దుగాల బేరాలు లేవక్కా.. ఆ మూర ముప్పై మూర ముప్పై..”

శివ వెనక్కి తిరిగి చూసాడు. చిన్న పిల్లాడు ఒక మూలకు నిలబడి కనకాంబరం మాలలు అమ్ముతున్నాడు. వాడి దగ్గర ఇద్దరు ముగ్గురు నుంచుని బేరం ఆడుతున్నారు. ‘నాకు పదమూడేండ్లు ఉండంగ నేను లేపిన ఫస్టు పీనుగుకు ముప్పై రూపాయలిచ్చిర్రు, ఇయ్యాల గదే ముప్పైకి మూర ఇస్తుర్రు. దేవునికి కొనాల్నంటె బ్యారం, సచ్చి దేవునికాడికి పోయినా బ్యారం. ఏం దునియ రా భై?’ అనుకుంటుండగా అతని ఫోన్ మోగింది.

“హలో..”

“ఆ శవాల శివా? ఈడ కట్ట మైసమ్మ గుడికాడికి రా. బాడీ తీయాలె”

“వస్తున్న సార్” అని చెప్పాడే కానీ మనసులో మాత్రం ‘శవాల శివ అంటున్నడేంది, ఛ’ అనుకున్నాడు.

“జర జల్దీ రా. గబ్బు కొడుతున్నది”

కొద్దిసేపటికి శివ అక్కడికి చేరుకున్నాడు. గుడి గోడ పైకి ఎక్కి చూసాడు. బాడీ గుడి వెనక తేలుతోంది. కిందకి దిగి వచ్చి, తాడు తీసుకుని నీళ్లలోకి దూకాడు. ఈదుకుంటూ బాడీ దగ్గరకి వెళ్ళాడు. పది మీటర్ల దూరం ఉండగానే దుర్గంధం భరించలేకుండా ఉంది. ఊపిరి బిగపట్టాడు.

“దీంతల్లి.. వారం రోజులు డెట్టాల్‌తోటి కడిగినా పోదు ఈ కంపు. పాణం తీసుకుంటే ఏమొస్తది?” అని తిట్టుకుంటూ దగ్గరకి వెళ్లి తాడుకట్టి బయటకి లాక్కొచ్చాడు. తను చేసే పనంటే శివకి చాలా గౌరవం. అంతే గౌరవంగా ఒక శవాన్ని ఎత్తుకొస్తాడు. తను ఎప్పుడూ రెడీగా పెట్టుకునే ప్లాస్టిక్ షీటులో ప్రేమగా చుడతాడు. పోలీసువారి దగ్గర అవి ఉండవని తెలుసు, అందుకే ఆ బాధ్యత కూడా తనదే.

“ఆ కంపుల ఎట్లుంటవ్ అంతసేపు ఊపిరి తియ్యకుంట?” శివ పైకి రాగానే, ముక్కుకి రుమాలు అడ్డం పెట్టుకుని వెనక్కి అడుగులేస్తూ అడిగాడు పోలీసాయన.

“ఫస్టుది లేపినంక రెండేళ్లు వైజాగ్ పొయ్యి, బీచ్‌కాడ అలలకు ఎదురీదుకుంట నాకు నేనే నేర్చుకున్న సారు” అన్నాడు శివ.

“ఏం..దీ? గీపని కోసం రెండేళ్లు నీకు నువ్వే ట్రైనింగ్ ఇచ్చుకుండేనా?”

“అవును సార్.. గీ పని కోసమే.. మీ ముందలున్న సారుగ్గూడ ఎరుకే..” అని చెప్తూ మోకాళ్ళ మీద కూర్చుని బాడీని ఒక ప్లాస్టిక్ షీట్లో చుట్టి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేశాడు.

“సర్లే, తర్వాతొచ్చి పైసల్ తీస్కపో” అని శివకి చెప్పి కొత్తగా వచ్చిన కానిస్టేబుల్‌తో, “ఇగో ఈననే శవాల శివ. నెంబర్ ఇస్త.. అవసరమైతే కాల్ చెయ్యి” అని జీప్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు పోలీసులు.

ఆ మాటలకి, “దీనమ్మా బతుకు… శవాల శివ.. శవాల శివ అని ఇనలేక దమ్ అయితాంది” అని మనుసులో తిట్టుకున్నాడు శివ.

“ఏదో ఒకటి చేసి లైఫ్ సెట్టు చేస్కోవాలె” అని ఇంటికి పరిగెత్తాడు.

స్నానం చేసి బయటకి వస్తూ, “పిల్లగాండ్లను ఓ వారం దాంక నా తానికి రానీయకు. శవం కంపు కొడ్తది. ఆళ్లని ఊరికి తోలు. నేను పేమెంటు తీసుకుని ఆధార్ కార్డు కోసం పొయ్యొస్త” అని శాంతమ్మకి చెప్పాడు శివ.

చొక్కా వేస్కుంటున్న అతన్ని, భుజం మీద గాయాన్ని చూస్తూ నుంచుంది శాంతమ్మ. ఈ కొరోనాల మన్నువడ ఇల్లు గడుస్తలేదని సీకులు కోసం ఆ నీటిలో దూకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. సర్రున భుజం నుండి ఛాతీ లోతుకు గుచ్చుకపోయింది ఒక సీకు. ఆ మురుగు నీటీలో నుండి బయటకి వచ్చి దగ్గరగా చూసేవరకు తెలీలేదు ఎవరికీ.. తన భుజం, ఛాతీ నుంచి రక్తం రావడం. మూడు వారాలు హాస్పిటల్లో పడ్డాడు. ఆ మాటలే గుర్తొచ్చాయి శాంతమ్మకి.

“ఏమంటుండు డాట్టర్?”

“ఏమంటడు? మల్ల అదే పరేషానీ. గుర్తింపు కార్డు తేవాల్నంట. ఆధారో ఏందో..”

“మన కాడ లేవ్ కదా..”

“నీ ఇస్కూల్ యాదికి ఉన్నదా? ఆడికి పొయ్యి అడిగితే?”

“ఎహే అదెప్పటి కథ? నన్ను ఆడ ఎవలు షరీఖ్ చేశిర్రో గిట్ల కూడా తెల్వది..”

ఇనప కుర్చీ బలంగా లాగిన శబ్దానికి శాంతమ్మ ఆలోచనల నుండి బయటపడింది.

“ఇప్పుడు నువ్వు ఆడికి పోతే ఆ కార్డు ఇస్తరా?”

“యాడ ఇస్తరు? నేనెవరో ఎవరికి ఎరుక? చేతుల పైసలు పెట్టాలె, లేకుంటే పోలీసాయన దగ్గర మొత్తుకుంట..ఊకెనే అయితయా ఇసొంటి పనులు?”

“ఆ టీవీ సారు చెప్పినట్టు వేరే పని దెవులాడుకుందాం..”

“ఎహే.. ఏందే నీ లొల్లి? గిదే నా పని. అనాథగ ఈందాంక దొబ్బుకొచ్చిన. ఈ పనిమీద పేరువడ్డది. పొయ్యిన ఆ జీవితం మల్ల వద్దు. ఇంక ఇంతే. నన్ను సాకిన అమ్మ, కొడుకు సచ్చిండ్రు ఇండ్లనే. నాతోటి ఈతకొట్టిన నా దోస్తుగాడ్ని గిదే మింగేసింది. ఇగ సాలు. నా పాణం ఉండంగ ఇంకొకలు ఇందులపడి సావొద్దు”

“సక్కగ తిండి పెట్టిందా ఇది? ఆ సీకుల కోసం, ఇండ్ల ఏసిన దినం కవర్ల చిల్లర కోసం నువ్వు దుంకినప్పుడల్ల నా పాణం పోతది. ఏమైతదో అని తల పట్టుకొని కూసుంట ఈడ. ఏడుగుర్ని నేనెట్ల సాదాలె నువ్వు సస్తే? ఇది సాలదన్నట్టు ఇంకో నలుగురు పోరగాల్ని దగ్గరకి తీసినవ్, ఆశపెట్టినవ్.. యాదిలేదా??”

“నీకూ నేర్పిన కదనే. 24 మందిని కాపాడినవ్‌లే. నీకు తెల్వదా ఏముందో ఈ కంపుల? పొయ్యేముందు నలుగురు కొడుకులల్ల ఒకన్ని ఇదే పనికి దింపుత, వాడు లేప్తడు నా తర్వాత. దీంతల్లి. దమ్ అయితాంది. గుర్తింపు కావాలె. నా పేరు మీద కార్డు కావాలె. స్కూల్‌ల నలుగురు హనుమంతులు ఉంటిరని నా పేరు శివ అని మార్చిన్రు. పెట్టినపేరూ పాయే. ఇగ నేను ఏంది?”

‘నాకు నా పేరు కావాలె. నన్ను మంది గుర్తుపట్టాలె.. రోడ్ మీద పోతాంటే — ఈడే హనుమంతు.. వడ్డే హనుమంతు అని పిలవాలె. వీడే అందుల దూకి పాణాలు బచాయించేదిఅని తెల్వాలె. ఇజ్జత్ కావాలె నాకు’

ఇంతలో ప్రవీణ్ తన కాళ్లకు తొడుక్కున్న కొత్త బూట్లు చూసుకుని మురిసిపోతున్నాడు. అటు ఇటు తిరుగుతూ, వంగి చూసుకుని సంబరపడుతున్నాడు.

“ఏందిరా?” అడిగాడు శివ.

“మొన్న నువ్వు శవం లేపినప్పుడు దాని బూట్లు నాయినా. ఉతికి పెట్టినవులే. నాకు సరిపోయినై” అన్నాడు ప్రవీణ్.

“గట్లనా! సరే తొడుక్కో. ఇయ్యాల శవం బూట్లు నా సైజు అనుకుంటలే. నేను అయి తొడుక్కుంట” అన్నాడు శివ.

అంకాలు అంకాలుగా సాగుతున్న జీవితం అతనిది. ఎన్ని సమాధానం లేని ప్రశ్నలో, ఎన్ని సమాధానం వెతకాల్సిన ప్రయత్నాలో.

“హలో, శివా! జల్దీ రా.. ట్రాక్ సైడ్.. గిప్పుడే దుంకిండు పోరగాడు”

శివ వెళ్ళేవరకు ఆ ప్రాణం ఆగలేదు. నీళ్ళలోకి దూకి, పైకి లాగి భుజాల మీద వేస్తుండగా జేబులో ఏదో తగిలింది. చెయ్యి పెట్టి చూసాడు. ఒక ఉత్తరం, దాని లోపల ఒక చిన్న కవర్లో కమ్మలు. ఉత్తరంలో అక్షరాలు పూర్తిగా చెరిగిపోయాయి. ఏ ప్రేమ ప్రయాణం ఎక్కడ ఆగిపోతే ఈ ప్రయాణం ఇక్కడ ముగిసిందో మరి అనుకున్నాడు మనసులో.

కమ్మలు తీసి తన జేబులో పెట్టుకుని బాడీ భుజం మీద వేసుకుని బయటకు వచ్చాడు. అంబులెన్సు వెళ్ళాక పోలీసాయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు.

ఆ సాయంత్రం.

“గీ కమ్మలు అమ్మితే ఎంతిస్తవు సేటు?” అని ఒక జ్యూవెలరీ షాపాయనను అడిగాడు శివ.

సేటు వాటిని అటు ఇటు తిప్పి చూసి, నాలుగుసార్లు గీకి, కాంటా వేసి “అయిదు వేల వరకు వస్తయ్” అన్నాడు.

“ఇయ్యి సేటు..”

డబ్బులు తీసుకుని బయటకి వచ్చి, “హలో.. ఓ శాంతమ్మా.. కార్డు కోసం పైసల్ సెట్ చేసిన. రేపు పొద్దుగాల్నే పోతా. నాకూ గుర్తింపు కార్డు వస్తది.. జిందగీ సెట్ ఇగ” అని సంబరపడ్డాడు.

నిండు పౌర్ణమి పండు వెన్నెల వెలుగులో రేకు మంచం మీద కూర్చుని హుస్సేన్‌సాగర్‌ని చూస్తున్నాడు శివ. చిన్న చిన్న అలలు అరుస్తూ గోడని ఢీ కొడుతూ చిన్నాభిన్నమైపోసాగాయి. ఎదురుగా పద్దెనిమిది మీటర్ల ఎత్తులో బుద్ధుడు రాయగిరి రాతి రాజసంతో హుందాగా నిలబడి నగరాన్ని చూస్తున్నాడు.

శాంతమ్మ వచ్చి పక్కన కూర్చుని బుద్ధుడినే చూస్తున్న శివని చూసి, “ఏంది?” అనడిగింది.

“అంత సున్ సాన్ ఎట్లుంటడే?”

“నువ్వు ఉన్నట్టే. ఇందాక లోపల్కిపోతే నీకేం తెలిసే? సున్ సాన్ కదనే?”

“ఎహే, అది వేరే. దిమాక్‌ల సున్ సాన్ ఎట్లుంటడో” అని నడుంవాల్చాడు.

శాంతమ్మ మంచం దగ్గరకు పాకి, రెండు చేతులు శివ తలగడమీద పెట్టి “ఏమో.. నాకు నువ్వు మస్తు సున్ సాన్ ఉంటవ్. దిమాగ్‌ల ఎంత పరేషానీ ఉన్నా నన్ను లేపుకొచ్చిన్నాడు ఎట్లున్నవో, గిప్పుడూ అంతే. లేకుంటే నీ దోస్తు చావు శాంతికి మా గుట్టకు వచ్చుడు ఏంది, రైల్ టేషన్‌ల మా అమ్మ అయ్యని కల్సుడు ఏంది, వాళ్ళు నిన్ను మా ఇంటికి పిలువుడు ఏంది?” అంది.

“మస్తు లవ్ అయ్యిందే నీ మీద ఆయాల్ల” అన్నాడు శివ, ఆమె చెయ్యి పట్టుకుని.

“ మంచిగైనది. లేకుంటే చెయ్యి లేని మా అయ్య, కండ్లు లేని మా అమ్మ పక్కన కూసొనిఆ రైల్ టేషన్‌ల వాళ్ళ లెక్క బిచ్చం ఎత్తుకుంటుండె…జిందగీ మార్చినవ్. ఇంకంతా మంచేలే తియ్య్. కార్డు వచ్చినంక నువ్వు ఎదురుచూస్తున్న ఆ హోమ్ గార్డ్ ఉద్యోగం వస్తే, మన బతుకులు బాగుంటయి” అన్నాడు శివ.

ఆమె మాటలు వింటూ శివ కళ్ళు మూసుకున్నాడు. మురుస్తూ అతడ్నే చూస్తోంది శాంతమ్మ. నుదుటిమీద కట్ట మైసమ్మ బొట్టు. ఉదయం పెట్టింది మళ్ళీ మొహం కడిగేవరకు అలానే చెక్కుచెదరకుండా దీర్ఘచతురస్రాకారంలో చైతన్యానికి ప్రతీక అయిన ఆ శివుని మూడో కన్నులా ఉంటుంది. ప్రపంచం రెండు కళ్ళతో చూడలేనిది ఈ శివ మూడో కన్నుతో చూస్తున్నాడా లేక ఆ శివునిలా గరళం అంతా కంఠంలో దాచుకున్నాడా అని ఆలోచిస్తూ మంచం మీద తల వాల్చి నిద్రలోకి జారుకుంది. కలలో…

“అమ్మా, నా తెల్లకోటు యాడ పెట్టినవే?” అని టక్ చేసుకుంటూ అడిగాడు ప్రవీణ్.

“ఉతికి ఈడ్నే పెట్టిన. నిన్న ఇస్త్రీ కూడా చేయించినరా” అని పసిబిడ్డని అరచేతుల్లో ఎత్తుకున్నట్టు భద్రంగా తెచ్చిచ్చింది శాంతమ్మ.

“ఓ శాంతమ్మా, నా బాక్స్ ఏడ? నేను పోవాల్నా వద్దా? కొడుక్కి చేయనీకే టైం సాలదు నీకు” అని కేక వేశాడు శివ.

“డాట్టర్ సదివే కొడుకుని మంచిగ పంపద్దా ఏంది?”

“నా హోమ్ గార్డ్ పని అంటే మజాక్ అనుకున్నవా?”

“ఓయమ్మో. మస్తుగున్నరు ఇద్దరు. నాకు రెండూ ఎక్కువనేతియ్య్” అంటూ మురుసుకుని గుమ్మం వరకు వెళ్లి ఇద్దరినీ సాగనంపింది.

మరుసటి రోజు పెందలాడే లేచి అన్ని పనులు చక చక కానిచ్చింది శాంతమ్మ. ‘మబ్బులో పడే కలలు నిజం అయితయ్’ అనుకుంటూ శివ దగ్గరకి వెళ్ళింది.

“మీ అయ్య ఏందిరా ఇంకా లేవలేదు, కార్డుకి పోతా అన్నడు..?” అని శివ భుజం తట్టింది శాంతమ్మ.

ఒళ్ళు కాలిపోతూ మూలుగుతున్న భర్తని చూసి కంగారుపడింది. ఏమాత్రం ఆగకుండా అసుపత్రికి పరిగెత్తింది.

“టెస్టులు చేసినం. మలేరియా, టైఫాయిడ్ రెండూ కలిపి కొట్టినయ్. అడ్మిట్ కావాలె. పైసలు రెడీ చేసుకో” అన్నాడు డాక్టర్ శాంతమ్మతో.

“కమ్మలు అమ్మిన పైసలు యాడ దాశిపెట్టినవ్?” అని బెడ్ మీద పడున్న శివని అడిగింది శాంతమ్మ.

“రాములా….నాలుగు పైసల్ రాంగనే ఖర్చు నెత్తినేసినవ్…ఇక నేనెప్పుడు బతకాలె….దీనమ్మ బతుకు….పెట్టెల అడుగున ఉన్న గణేష్ బొమ్మ కింద పెట్టిన..” అన్నాడు శివ కళ్లు తుడుచుకుంటూ.