రెండు సంవత్సరాల క్రితం డా. రెడ్డిస్ ల్యాబ్ లో పని చేస్తున్న యువనేశ్వరి కూకట్ పల్లి మార్గంలో వెళుతుండగా సిగ్నల్ పడగానే అక్కడికి కొంతమంది చిన్నపిల్లలు వచ్చి బెగ్గింగ్ చేస్తున్నారు. సిగ్నల్స్ ఇవ్వగానే రోడ్డు పక్కకు వెళ్ళి ఆడుకుంటున్నారు. చినిగిన మురికి బట్టలు, ఎప్పుడో వారం క్రితం దువ్వినట్టుగా ఉన్న తల. కాళ్ళకు చెప్పుల స్థానంలో మురికి, దుమ్ము.. ఎవరైనా ఇలాంటి పరిస్థితులలో ఏమని ఆలోచిస్తారు.? "జంతువులు కన్నట్టుగా కని, రోడ్డు మీద వదిలేశారు" అని మనసులో పేరెంట్స్ ని ఈసడించుకుంటారేమో.. యువ మాత్రం బాధపడింది. వీరి బాగోగులు చూసుకోవాలి, వీరికి మానసికంగా ఎదగేందుకు సహాయం చేస్తే ఈ మురికే రేపు వజ్రాలుగా రూపాంతరం చెందుతారనే నిర్ణయానికి వచ్చింది.
ఏదైనా ఒక్కరితోనే, ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ నిర్ణయానికి రాగానే "ఇది నా ఒక్కరి వల్ల కాదు, నాలాంటి మనస్తత్వాలు కలగలిసిన వ్యక్తులు ఇందులో పాల్గొనాలి అని భావించి మాధవి దినేష్, కృష్ణ, లోగో, శ్రీనువాసన్, సాయి, శ్వేత తో "చొట్టు కి ఎడ్యుకేషన్"( 9533641922) ను స్థాపించారు.
డబ్బులిస్తేనే స్కూలికస్తాం:
కూకట్ పల్లి, మియాపూర్ లోని మురికివాడలలోని ఎక్కువమంది ఉదయం మూడు నాలుగు గంటలకే పనుల వేటకు బయలుదేరుతారు. పిల్లలను చూసుకునే వారు లేక మురికిగా ఉండడం, స్కూల్స్ వెళ్ళకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్ చేయడం లాంటివాటికి అలవాటుపడ్డారు. యువనేశ్వరి తోటి సభ్యులతో ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు "డబ్బులిస్తేనే మీ దగ్గర చదువు చెప్పించుకుంటాము". అని చెప్పేసరికి పిల్లల మనస్తత్వానికి కలత చెందిన టీమ్ సభ్యులు మరింత ఉద్యమంగా పిల్లలలో మార్పులు మొదలుబెట్టారు.
మెడికల్ క్యాంప్ మేలు చేసింది:
కొంతమంది వ్యక్తులచ్చి పిల్లలకు చదువు నేర్పిస్తామనంటే తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపించలేదు. రెడ్డీస్ ల్యాబ్ లో జాబ్ చేస్తున్న యువనేశ్వరి తనకు తెలిసిన డాక్టర్ మిత్రులతో కలిసి స్లమ్ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేశారు. అప్పుడు తల్లిదండ్రులకు నమ్మకం కలిగింది. స్లమ్స్ లో ఉన్న చాలామంది పిల్లలు 10 సంవత్సరాలు దాటినా గాని అక్షరాలు, అంకెలు రానివారున్నారు. స్థానికంగా ఒక టెంట్ ని ఏర్పాటుచేసి వారికి బేసిక్ ఎడ్యుకేషన్ ను అందించి దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ లో చేర్పిస్తుంటారు.
తెలంగాణ ప్రభుత్వం బెగ్గింగ్ నీ బ్యాన్ చేసినా గాని కొంతమంది పిల్లలు ఆ అలవాటును మానలేకపోతున్నారు. ఏదో కోపంగా, భయపెట్టడంలా కాకుండా స్వచ్చమైన ప్రేమతో పిల్లల జీవితాలను మార్చివేస్తున్న యువత ప్రస్తుత సమాజంలో ఉండడం దేశానికెంతో మేలు..