This Software Couple Captured Their Pre Wedding Shoot In Farmer's Attire and Here's Their Story

Updated on
This Software Couple Captured Their Pre Wedding Shoot In Farmer's Attire and Here's Their Story

ఈ మధ్య కాలంలో పెళ్లి చేయాలన్నా, కనీసం పెళ్లికి వెళ్లాలన్నా భయం వేస్తోంది! రెండు పవిత్రమైన మనసులు పెళ్లి అనే కార్యం ద్వారా ఒక శుభముహూర్తాన ఏకం అయ్యి, ఆత్మీయుల ఆశీస్సులు కోరే సమయం కాస్త "మాకు డబ్బులు బాగా ఉన్నాయి, వచ్చి మా బలుపును చూసి పొగిడి చావండ్ర" అన్నట్టుగా మారిపోయాయి. సరే ఈ గోల ఎప్పటికీ ఉండేదేలేండి!! ఇలాంటి కాలంలో కార్తీక్ హైందవి గార్ల జంట తమ పెళ్లిని తమకు నచ్చినట్టుగా, అలాగే సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తూ మట్టికి దగ్గరగా చేసుకోవాలని అనుకున్నారు.. అందుకు అనుగూనంగా వారి ప్రీ వెడ్డింగ్ షూట్ ను వ్యవసాయం చేసే "రైతు కుటుంబంగా" తెరకెక్కించారు. ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి గల కారణాలు, వారి ఆలోచనలను ఇంకాస్త డీటైల్డ్ గా తెలుసుకుందాం రండి. (4 నిమిషాల పూర్తి ప్రీ వెడ్డింగ్ వీడియో ఆర్టికల్ చివర్లో చూడవచ్చు)

1. కార్తీక్ గారికి ఊహ తెలిసే నాటికి నాన్న నర్సింహా గారు వ్యవసాయం చేస్తుండేవారు. అయితే పంటలు సరిగ్గా పండక, అప్పుల పాలైయ్యారు. బ్రతుకుతెరువు కోసం నాన్న గారు గల్ఫ్ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది.

2. నాన్న అలా వ్యవసాయాన్ని ఆపు చెయ్యడం, కన్నతల్లిని, పెంచి పెద్ద చేసిన నేలకు దూరమయ్యి మమ్మల్ని బ్రతికించుకోవడానికి ఎక్కడికో వెళ్లినందుకు కార్తీక్ గారు చాలా బాధ పడ్డారు.

3. కార్తీక్ గారు బాగా చదువుకుని, ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్ లోని ఓ మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తర్వాత నాన్న గారిని ఇండియాకు రప్పించి పనిభారం కూడా తగ్గించారు.

4. మంచి శాలరితో జాబ్ చేస్తున్నా కానీ ఇప్పటికీ కార్తీక్ గారికి వ్యవసాయం చేయాలనే ఉంటుంది. ప్రస్తుతం జాబ్ చేస్తున్నా కానీ భవిషత్తులో మాత్రం "చెప్పులు విప్పి గుడిలో అడుగుపెట్టినట్టుగా, చెప్పులు విప్పి నాగలితో పొలం దున్నాలని" అనుకుంటుంటారు.

5. "నేను భవిషత్తులో వ్యవసాయాన్ని చేస్తాను".. ఇదే విషయాన్ని అమ్మ నాన్నలకు చెప్పినట్టుగా, కాబోయే అత్త మామలకు అలాగే మరీ ముఖ్యంగా పెళ్లిచేసుకోబోయే హైందవి గారికి కూడా చెప్పారు.

6. హైందవి ఎలా రియాక్ట్ అవుతుందోనని కార్తీక్ కాస్త కంగారు పడ్డారు. హైందవి గారు మాత్రం "ఖచ్చితంగా వ్యవసాయం చేద్దామండి, అయితే వ్యవసాయంలో నష్టాలు ఎక్కువగా వస్తాయి!! వాటిని తట్టుకునే విధంగా మనం ఆర్ధికంగా చాలా స్ట్రాంగ్ అయ్యాక మొదలుపెడదాము. అలాగే ఒక పక్క ఉద్యోగం మరో పక్క వ్యవసాయం ఎలా బ్యాలన్స్ గా చేసుకోవాలని విలువైన సూచనలిచ్చారు."

7. కార్తీక్ హైందవి గార్లది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరూ ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

8. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆలోచన కూడా కార్తీక్ గారిది. హైందవి గారు దీనికి కూడా మరో ఆలోచన లేకుండా సంతోషంగా అంగీకరించారు.

9. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ సిద్దిపేట జిల్లా మల్యాల గ్రామంలో చిత్రీకరించారు. దాదాపు నాలుగు నిమిషాల వీడియో కోసం ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు శ్రమించారు.

10. రైతుగా బ్రతకడం, వ్యవసాయం చెయ్యడం ఎంత కష్టతరమో ఈ ఒక్కరోజులోనే కార్తీక్ హైందవి గార్లకు ఇంకాస్త లోతుగా తెలిసివచ్చింది.

11. అప్పటివరకు సినిమాలో చూపించినట్టుగా, అలాగే బయట రైతు నాగలిని ఎత్తుకుని నడుస్తున్నవి చూసి నాగలి ఎత్తుకోవడం కార్తీక్ గారు సులభం అనుకున్నారు కానీ 25కేజీలకు పైగా ఉన్న నాగలిని ఎత్తుకోవడం ఆశా మాషి విషయం కాదని ఈ షూట్ ద్వారా తెలుసుకున్నారు. నాగలిని భుజాన వేసుకోవడం దించడం ఒక పద్ధతి ప్రకారం జరగాలి లేదంటే బరువు ఎక్కువగా ఉండడంతో పాటు శరీరానికి గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. పక్కనే ఉన్న రైతు సూచనలివ్వడం వల్ల కార్తీక్ గారు ఈ షాట్ పూర్తిచేయ్యగలిగారు.

12. ఎద్దుల భుజాన నాగలి వేసి పొలం దున్నే ఈ 10 సెకండ్ల షాట్ కోసం 4 గంటల పాటు శ్రమించారు.

13. కార్తీక్ గారు 7 సంవత్సరాల నుండి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నారు. ఈ ఒక్క రోజుల్లోనే రైతు జీవితం, వ్యవసాయం ఎంత గొప్పదో తెలుసుకున్నారు.

14. సాఫ్ట్ వేర్ జాబ్ లో కోడింగ్ విషయంలో, మరే ఇతర విషయంలో పొరపాట్లు జరిగితే పరిష్కరించుకోవచ్చు. వ్యవసాయంలో పొరపాటు జరిగితే మాత్రం పంట నాశనమవుతుంది నెలల తరబడి చేసిన కష్టం ఒక్క పొరపాటుకు నిర్వీర్యమవుతుంది.

15. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చూసి బంధువుల దగ్గరి నుండి కొలీగ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీరిని ఆత్మీయ హృదయంతో అభినందిస్తున్నారు, మేము కూడా ఇలానే చేసుకుంటామని కొందరు ఇష్టాన్ని పంచుకున్నారు. మాములు షూట్ కు ఈ విధమైన ప్రశంసలు దక్కేవి కావు.

16. మనకు భోజనం పెడుతున్న రైతును మరోసారి గౌరవించుకోవడం, స్మరించుకోవడమే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ముఖ్య ఉద్దేశ్యం.

17. “నాగలి మోసే ఎద్దులు అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక భూమిని చీల్చే నాగలి అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక నాగలిని చుట్టే దారం అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక ఎద్దులను కదిపే కర్ర అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక.” –క్షేత్రపతి సూక్తం ఋగ్వేదం.

18. బురద నుండి బువ్వ తీసే ఓ అన్నదాత సుఖీభవ!!

నర్సింహా నర్సవ్వ గారి కనిష్ట కుమారుడు చిరంజీవి కార్తీక్ కు, రాఘవులు ఝాన్సీ గార్ల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి హైందవి గార్ల వివాహం నవంబర్ 28(2019)న కన్నుల పండుగగా జరిగింది.

4 నిమిషాల పూర్తి ప్రీ వెడ్డింగ్ వీడియో ఇక్కడ చూడవచ్చు