ఓహ్ ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారా.? పర్వాలేదు. ఎలా ఉన్నాయండి ఇక్కడ ఫుడ్.? చాలా బాగుందండి! ఎక్కువ తినేస్తారని బయట ఉప్పు కారం తగ్గించి రుచి లేకుండా పెడుతుంటారని విన్నానే.? అవునుగాని ఇక్కడైతే అట్ల లేదు, ఏదో పెడుతున్నామంటే పెడుతున్నామనిజెప్పి అన్నం, సాంబార్ అని కాకుండా మన ఇంట్లో ఎలా ఐతే భోజనం చేస్తమో అలాగే ఉందండి. రోజూ పప్పు, కూరలతో పాటుగా, ఎగ్ కూడా పెడుతున్నారు. ఇందాక వడ్డించేవారు చెబుతుంటే విన్నాను, ఈ బియ్యం రూ.50 కేజీ పెట్టి మంచి క్వాలిటీ రైస్ తీసుకొచ్చారని, మేము రూపాయి బియ్యం తినేవాళ్ళం, ఈ భోజనం పెడుతున్నవాళ్ళు ఎవరో కానీ ఆయన వల్ల మేము ప్రతిరోజు సన్నబియ్యంతో తింటున్నాము.. భోజనం చేస్తున్న వ్యక్తి లాక్ డౌన్ వల్ల పని కోల్పోయిన దినసరి కూలి, భోజనం ఎలా ఉందని ఎంక్వరి చేసిన వ్యక్తే వారు తినే భోజనం వండింది, స్పాన్సర్ చేసింది..
రాజేంద్ర ప్రసాద్ గారు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. లాక్ డౌన్ మొదలైన తొలిరోజులలో ప్రజలు అడ్జస్ట్ అవ్వడానికి కాస్త సమయం పట్టింది. వేరేప్రాంతానికి చెందిన వారు, ఇంకా దినసరి కూలీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోగలం. పనులు లేక, సిటీలో కంటే సొంతవూరికి వెళితే బుక్కెడు బువ్వ అయిన దక్కుతుందని కాలినడకన, ప్రైవేట్ వెహికిల్స్ వెళ్ళడానికి ప్రయత్నించేవారు. ఇక్కడి నుండి మళ్ళీ వేరే ఊరికి గుంపులు గుంపుగా వెళితే ప్రమాదం విస్తరిస్తుంది, భోజనానికే కదా వారురు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది నేను చూసుకుంటాను అని రాజేంద్రప్రసాద్ గారు లోకల్ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ గారి గైడెన్స్ తో ఆహారం వండి వడ్డించడం మొదలుపెట్టారు.
కట్ చేయడం దగ్గరి నుండి: ప్రసాద్ గారిది జగిత్యాల, నాన్న గారు రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్. ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అన్ని పనులను తానే దగ్గరుండి చెయ్యడం తనలోని వ్యక్తిత్వానికి నిదర్శనం. రేపు ఎంత క్వాంటిటి కూరగాయలు, బియ్యం కావాలో ఈరోజే సిద్ధం చేసి పెట్టుకుంటారు. ఉదయం 7:30 కల్లా ప్రసాద్ గారూ పాటు మరికొందరు వ్యక్తులు వంటకు సిద్ధమవుతారు. కూరగాయలు కట్ చెయ్యడం, మసాలా తయారుచేసుకోవడం లాంటివి చెయ్యడం మొదలుపెడతారు.
ప్రతిరోజు 350 వరకు: ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్న వారిలో ఎక్కువ శాతం రెస్టారెంట్ వైటర్లు, కన్స్ట్రక్షన్ లేబర్, వాచ్ మెన్ ఇలాంటి వారే అధికం. ఉచిత భోజనాలు మొదలుపెట్టిన మొదటిరోజు రోజు ఇక్కడ 50 మంది భోజనం చేస్తే ఈరోజు దాదాపు 350 వరకు ఇక్కడ చేయి కడుగుతున్నారు. ఇక్కడి పేదవారు ప్రభుత్వం తరపున రేషన్ ను రాత్రి కోసం ఉపయోగించుకుని మధ్యాహ్నం వరకు మాత్రం ఇక్కడ కడుపునింపుకుంటున్నారు. మొదట రాజేంద్రప్రసాద్ గారే స్పాన్సర్ చేసినా కానీ ఇదొక మానవత్వం నిండిన కార్యక్రమం ఇందులో మనమూ పాల్గొనాలని దాతలు ముందుకువచ్చి ప్రతిరోజు ఒకరు చొప్పున స్పాన్సర్ చేస్తున్నారు.