పేదవాడికి కష్టపడే తత్వమే గొప్ప ఆస్థి. బర్నానా గున్నయ్య గారు కటిక పేదరికంలో పుట్టిపెరిగారు. ఒక్క పూట గంజి కూలీ నుండి రూ.100 రూపాయల రోజువారి కూలీ వరకు పనిచేస్తూ తన కొడుకుని తనలాంటి జీవితం నుండి దూరం చేయాలని శ్రమించారు. నాన్న మాత్రమే కాదు అమ్మ పోలియో బాధితురాలైనా గాని తన కొడుకు కోసం ఓ హాస్పిటల్ లో పనిమనిషి గా పనిచేసేవారు. మనం చేసే పనికి కష్టం, నిజాయితీ తోడైతే దాని నుండి అత్యుత్తమ ఫలితం అందుకుంటాము. అలా గున్నయ్య గారికి కూడా అలాంటి ప్రతిఫలమే లభించింది.
అమ్మ నాన్నలు పడుతున్న ఇంతటి కష్టానికి యాదగిరి గారు కలత చెందని రోజు అంటూ ఏది లేదు. ఖచ్చితంగా నా తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలి అని నిరంతరం శ్రమించేవారు. ఆర్ధికరంగా వెనుకబడి ఉన్న చిన్నతనం నుండి చదువుల్లో మాత్రం ఎప్పుడూ ముందుండే వారు. అలా హైదరాబాద్ ట్రిపుల్ ఐటిలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఇంజినీరింగ్ లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్ లో అమెరికా నుండి అత్యధిక జీతాన్ని ఆఫర్ చేస్తూ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆహ్వానించింది. ఐ.ఐ.ఏం ప్రవేశ పరీక్ష క్యాట్ లో 93.4% క్వాలిఫై అయ్యారు కూడా. ఇంతటి ఘనమైన ప్రతిభతో ఉజ్వల భవిషత్తు తన కళ్ళముందు కనిపిస్తూన్నా దానిలో ఏ ఆనందం కనిపించలేదు.. ఇవ్వేమి నా జీవితానికి పరిపూర్ణత్వం కలిగించలేవు అని ఇవన్నీ వదులుకుని దేశానికి సైనికుడిగా ఉండాలని భావించారు.
మొదట తల్లిదండ్రులు అంగీకరించలేకపోయినా కాని తర్వాత యాదగిరి గారు పరిపూర్ణంగా వర్ణించడంతో ఈ వృత్తి లో గొప్పతనం అర్ధం చేసుకున్నారు. ఐ.ఎం.ఏ(ఇండియన్ మిలటరీ అకాడమీ) పరీక్షరాసి అత్యధిక మార్కులతో అర్హత సాధించారు. ఇంత వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదులుకుని ఫుడ్ ట్రక్ పెట్టినవాళ్ళని చూశాము.. వ్యవసాయం చేస్తున్నవాళ్ళని చూస్తున్నాం. అది వారి వ్యక్తిగతం అందులో వారికి మాత్రమే ఆనందం ఉంటుంది. వీరందరికి యాదగిరి గారు పూర్తిగా భిన్నం. ఇలాంటి భవిషత్తును ఎంచుకోవాలంటే దేశమే నా కుటుంబం, భారతీయులే నా కుటుంబ సభ్యులు అనే గొప్ప హృదయం ఉంటే తప్ప ఇది సాధ్యపడదు. భారతమాత అంటే ఎక్కడో లేదండి, ఎవ్వరికి కనిపించని అదృశ్య వ్యక్తో కాదు తమ బిడ్డను ఇలా సైనికునిగా దేశానికి అంకితమిచ్చే ప్రతి తల్లి ఓ భారతమాతనే..