సౌందర్య మన తెలుగుఅమ్మాయి కాదు, తెలుగు నేల మీద పుట్టలేదు, పెరగలేదు, చదువు కోలేదు, కాని కేవలం తెలుగు తెరపై నటించింది అంతే మనం ఒక తెలుగమ్మాయిగా మన గుండెల్లో పెట్టుకున్నాం మహనటి సావిత్రి తర్వాతి స్థానంతో ఇప్పటికి గౌరవించుకుంటున్నాం.. అప్పటి వరకు హీరోయిన్లు, హీరోల హీరోయిజం ముందు వెల వెల పోయేవారు.. కేవలం Exposing చేస్తేనే అభిమానులు పెరుగుతారు అనే భావన ఉండేది కాని సౌందర్య రాకతో అవన్నీ మాయమైపోయాయి.. సౌందర్య పుట్టింది కర్నాటకలోని అష్టగ్రామంలో 1972 జూలై 18న జన్మించింది. తండ్రి ప్రముఖ నిర్మాత,రచయిత కె.ఎస్.సత్యనారాయణ్.
ఎం.బి.బి.ఎస్ చదువుతుండగానే హీరోయిన్ గా అవకాశాలు రావడం మొదలయ్యాయి. మొదట కన్నడ సినిమాలలో అడుగుపెట్టినా తర్వాత 1992లో మనవరాలి పెళ్ళి సినిమాతో మనకు ముందుగా కనిపించింది. రెండవ సినిమాగా మంచి కన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను తీసే ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో ఒక గుర్తింపు వచ్చింది ఇక ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదగడానికి ఒక్కో సినిమాను ఒక్కో అడుగుగా ఎదుగుతూ వచ్చింది. తెలుగు అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో మాత్రమే కాదు రజినీకాంత్(అరుణాచలం,నరసింహా) కమల్ హాసన్(నవ్వండి లవ్వండి), అమితాబ్ బచ్చన్(సూర్యవంశం) లాంటి భారతదేశం గర్వించదగ్గ నటులతో నటించి భారతదేశమంతటా ప్రశంశలలందుకునేంత స్థాయికి చేరుకుంది. తెలుగులో అంతఃపురం పవిత్రబందం అమ్మోరు సినిమాలలోని అద్వితీయ నటనకుగాను మూడు నంది అవార్డులను అందుకున్నారు.
హీరోయిన్లు అంటే ఒక్క సినిమాకో లేదా కొన్ని సినిమాలకో పరిమతం అవుతారు, ఇండస్ట్రీ లో కూడా Use & Throw అన్న రీతిగా ఉంటుంది.. కాని మన సౌందర్య మాత్రం అందం అభినయంలో ఉన్నత స్థాయిలో ఉంటునే మనఇంటి అమ్మయిగా మెలిగారు. 12సంవత్సరాల నట జీవితంలో వివిధ భాషలలో 100 సినిమాలకు పైగా నటించి ఏ ఒక్కనాడు ఏ రూమర్ లేకుండా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. సంపాదించిన డబ్బుతో విద్య సంస్థలు స్థాపించి విద్యాదానం చేశారు. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంతో మనల్ని విడిచిపోయినప్పుడు బాధ పడని సినీ అభిమాని లేడు.. కన్నీరు పెట్టని సినీ నటులు లేరు.. సౌందర్య మన నుండి భౌతికంగా దూరమై చాలా సంవత్సరాలు దాటిపోయినా ఇంకా మన హృదయాలలో అంతే పదిలంగా ఉంది సౌందర్య అంటే ఎవ్వరూ అందుకోలేని ఆకాశంలోని తార కాదు మన పక్కింటి అమ్మాయిగా మన తెలుగింటి అమ్మాయిగా ఎప్పటికి నిలిచిపోతుంది..
తన నటనలో ఎప్పటికి నిలిచిపోయే కొన్ని సినిమాలు..
1) అంతఃపురం
2) పెళ్ళి చేసుకుందాం
3) దొంగాట
4) పవిత్రబందం
5) చుడాలని ఉంది
6) 9నెలలు
7) రాజా
8) శ్రీ మంజునాథ
9) నిన్నే ప్రేమిస్తా
10) అమ్మోరు