తిప్పలు పడి మొత్తానికి బ్యాక్ లాగ్స్ రాసి ఇంటికి వచ్చాను. మనసు ఏం బాలేదు , సొంత కాళ్ళ మీద నిలబడాలని కోరిక , 30 వేలకి 300 గంటలు ఉద్యోగానికి ఇవ్వాలనిపించలేదు. నాకంటూ ఒక చిన్న ఛాయ్ బండి ఉన్న తారా స్థాయికి వెళ్ళగలను అనే నమ్మకం. చుట్టాలు వద్దన్నారు , ఇంట్లో డబ్బులు ఇవ్వలేదు.
March 26th 2019 , ఇంట్లో నుండి బయటికి వచ్చేసాను . కార్తీక్ గాడి దగ్గర నుండి అప్పు తీసుకున్న 2500 /- మాత్రమే జేబులో ఉన్నాయ్. ఎదోక ట్రైన్ ఎక్కుదాం అని స్టేషన్ కి వెళ్ళాను. కొంత మంది ముంబాయి వెళ్లమన్నారు , ఇంకొంత మంది పంజాబ్ లో వ్యాపారానికి ఆస్కారం ఎక్కువ అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి , ఆ 2500 తో ఏం వ్యాపారం చేయాలి అన్నదాని కన్నా , నేను చేస్తుంది కరెక్ట్ ఏనా? అనే ఆలోచన ఎక్కువ ఉంది బుర్రలో.
దురదృష్టమో ఏంటో , ఈ తిక్క ఆలోచనలు , నిర్ణయాలు చూసి కోపం వచ్చి మాట్లాడడం మానేసింది కీర్తి . తనది తప్పు అని చెప్పలేను , కానీ పక్కన ఉంటె బాగుండే అనిపించింది. ఒకప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న తను పక్కనే నిలబడేది , తనే ధైర్యం . తీసుకున్న ఏ నిర్ణయానికైనా ఊపిరి పోసేది , ఆయువునిచ్చేది. కానీ ఈ సారి ఇల్లు వదిలేసి రావడం నచ్చలేదు , తనకేంటి ఆలోచిస్తే నాకే మంచిగా అనిపించట్లేదు.
మొత్తానికి ఏం చేయాలో అర్ధంకాక వారణాసి ట్రైన్ ఎక్కాను . మొగల్ సరాయ్ స్టేషన్ లో దిగి ఆటో ఎక్కి గంగా నది దగరికి చేరాను. ఆ నది , గాలి , గంగా హారతి తెలియని ప్రశాంతతను దరి చేర్చాయి. అప్పటి దాకా మదిలో కలిసి ఏకం అయ్యి కల్లోలం చేసిన వేల ఆలోచనలు ఒక్కసారిగా విడి విడిగా కనిపించాయి.
జీవితం లో అతివృష్టి , అనావృష్టి అనేవి సహజం. ఈరోజు ఎన్నో నవ్వులు , ఇంకెన్నో జ్ఞపకాలు , కానీ ఆ మరుసటి రోజే జీవితం తలకిందులు కావచ్చు , బాధలతో నిండిపోవచ్చు , నిస్సహాయత దరి చేరచ్చు . బాధ సంతోషం కలిస్తేనే జీవితం అన్నారు అందుకే కాబోలు , కానీ ఏది శాశ్వతం కాదు. నవ్వులు శాశ్వతం కాదు , బాధలు శాశ్వతం కాదు.
బుర్రలో ఎన్నో పనులుండచ్చు , ఏం చేయాలో అర్ధం కాకపోతుండచ్చు , అంత మాత్రాన కృంగిపోయి , ఆవేశ నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదని అర్ధం అయింది . ఎదో ఒకటి త్వరపడి చేసేయడం కంటే కొన్ని సార్లు ఏం చేయకుండా ఉండడమే మేలు . ఇంట్లో వద్దన్నారు , వచ్చేసాను , నేనిక్కడ ఎలా ఉన్నానో పక్కన పెడితే , అసలా వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు ? మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు నేను . బ్రతిమిలాడితే ఒప్పుకునే వారేమో
సరిగ్గా గుర్తుచేసుకుంటే ఎన్నో ఆలోచనలు తరుముతుంటే తీసుకున్న నిర్ణయం ఇది.
రాసిన బ్యాక్ లాగ్ పాస్ అవ్వనేమో అనే ఆలోచన
నచ్చిన వ్యాపారం ఎప్పుడు మొదలు పెడతానో అనే తొందర
ఎక్కడ 9 -5 కి తల ఒగ్గాలేమో అనే భయం
అసలా జీవితం ఎటు పోతుంది అనే ప్రశ్న
కూర్చుని వీటికి సమాధానం ఇచ్చుకుంటే అయ్యిపోయేదేమో ! ఏదైనా మన మంచికే లే ! ఆ రాత్రి అక్కడే ఘాట్ లో పడుకుని పొద్దున ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసాను . 3 రోజులు ఎక్కడున్నానో తెలీదు , ఏం అయిపోయానో తెలీదు . అమ్మ కొట్టింది , కానీ ప్రతి దెబ్బ ప్రేమతోనే తగిలింది.
కొన్ని రోజులు అయ్యాక ఇద్దర్ని కూర్చోపెట్టి ప్రశాంతంగా ఉన్నది చెప్పాను, ఇది తప్ప వేరే ఏది చేయలేను అని , ఒక్క అవకాశం ఇవ్వమని అడిగా . ఒక్క సంవత్సరం ! ఒకే ఒక్క సంవత్సరం తీస్కో గడువు అన్నారు . గెలిచాం అనిపించింది , ఎందుకో తెలీదు , అప్పటి దాకా ఉన్న బాధ అంత మెల్లిగా పోతు ఆనందాన్ని తీస్కోచింది.
కీర్తిని కలిసాను , చూడగానే చంప పగలకొట్టింది . అక్కడే టీ షాప్ లో కూర్చుని బిజినెస్ మోడల్ గీసుకున్నాము. కార్తీక్ గాడు ఇచ్చిన 2500 లో 700 మిగిలి ఉన్నాయ్ . ఒక తాటి ఆకుల బుట్ట 300 రూపాయలకి , 20 kg కీరా ౩౦౦ రూపాయలకి ఉప్పు కారం తీస్కున్నాము . 160 కీరాలు , ప్లేట్ 10 రూపాయలు , రోజు సంపాదన 1600 . మొదట రోజు లాభం 900 రూపాయలు. ఒక ఆయన అక్కడే కింద కూర్చుని పాటల పుస్తకాలు అమ్మడం చూసాం. కొత్త వ్యాపారం పెడతావా ? , పెట్టుబడి నేనుపెడతా అని అడిగితే "హా " అన్నాడు. అలా స్టేషన్ లో చిన్న వ్యాపారి నుండి చాలా మంది బిచ్చగాళ్ళ వరకు "హా " అనే అన్నారు. సంవత్సరం లోపు 26 స్టేషన్స్ లో 85 మందికి పెట్టుబడి పెట్టాం. 50 % వాళ్ళకి లాభం , ఖర్చు పోగా 85 నుండి తక్కువ లో తక్కువ 100000 రూపాయలు వస్తున్నాయి.
జీవితం కొన్ని సార్లు కింద పడేసి తొక్కుతుంది . ఆలోచనలతో ముంచెత్తుతుంది , సమాధానం లేని ప్రశ్నలని సంధిస్తుంది.
మనం చేయాల్సింది కేవలం సహనం తో నిలబడడమే , నిలబడ్డావా , ఊహించని ఆనందం కూడా సమయానుసారం ఇస్తుంది.ఇది నా కథ . నీ కథ లో సమస్యల్ని విడి విడిగా చేసి చూడు , సమాధానం వాటి మధ్యలోనే స్పష్టంగా కనిపిస్తుంది.