ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఈ పేరు తెలియని సంగీత ప్రేమికుడు ఉండరు ఈ పేరు వినగానే ఆయన స్వరామృతం మన చెవిలో ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది.. మన తెలుగువాడైన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జూన్ 4, 1946 నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో జన్మించారు. బాలు తండ్రి ఒక హరికథా పండితుడు ఆ కారణం మూలంగానే కావచ్చు చిన్ననాటి నుండే పాటలు పాడటం ఒక హాబీగా అలవరచుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా బాలు ఏ గురువు దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోలేదు కేవలం చూసి నేర్చుకునే పాడేవారు. కాని ఇదే హాబి రేపటి రోజున కోట్లమంది అభిమానులను తీసుకువస్తుంది అని ఆయన ఆనాడు అనుకోలేదు. దాదాపు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పాటల పోటిలో పాల్గొన్నారు అది చూసి అప్పటి మహనీయులు ఘంటసాల, జానకి, కోదండపాణి సహకారం, ప్రోత్సహంతో హస్యనటుడు పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా రంగప్రవేశం చేశారు.. తొలి సంవత్సరాలలో అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చినా నెమ్మదిగా అడుగులు వేయడం నేర్చుకుంటు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఏ గాయకుడు అందుబాటులో లేనప్పుడు పిలిపించుకునే బాలు కాస్తా, మాకు బాలు తప్పా ఎవ్వరూ వద్దూ అని హీరోలు సంగీత దర్శకులు, దర్శకులు పట్టుబట్టేంతల ఆయన ప్రస్థానం సాగింది. ఈ రకంగా దక్షిణ భారత సినీ సంగీతాన్ని శాసించాడు, కళామతల్లికి తన పాటలతో గానాబిషేకం చేశారు.. దాదాపు 40 సంవత్సరాల పాటు పాటల ప్రపంచానికి చక్రవర్తిగా ఏలారు. 50 సంవత్సరాలపాటు సాగిన పాటల చరిత్రలో ఇప్పటికి తెలుగు, హింది, కన్నడ, తమిళం ఇలా 11 భాషలలోని 40,000 పాటలకు ప్రాణం పోశారు.
ఇలా ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడినందుకు గిన్నిస్ రికార్ఢును అందుకున్నారు. 40 సంవత్సరాల పాటు రోజుకు 10 గంటలు పాడుతూనే ఉన్నారు.. కన్నడలో ఒకేరోజు 22 పాటలు, తమిలంలో 19, హిందిలో 16పాటలు ఇలా వివిధ భాషలలో ఒకే రోజు అత్యధిక పాటలు పాడిన రికార్డ్ కూడా అయన పేరు మీదనే ఉంది.. కేవలం గాయకునిగా మాత్రమే కాదు యాంకర్ గా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా (40చిత్రాలు) పని చేసి అద్భుత ప్రతిభను కనబరిచారు. బాలు లోని సంభ్రమాశ్ఛర్యాలకు గురిచేసే ప్రతిభలో ముఖ్యమైనది ఆయన గాత్రశైలి.. ఏ హీరో గొంతుకు ఆ హీరో పాడినట్టుగా తన స్వరాన్ని సవరించి అచ్చం ఆ నటుడే పాడుతున్నంతల పాడటం బహుశా ఇంత స్పష్టమైన భావంతో భారతీయ సినీ పాటలను పాడేది ఒక్క బాలు గారే కావచ్చు. ఇక ఆయన అందుకున్న అవార్ఢుల విషయానికొస్తే 6సార్లు జాతీయ అవార్ఢులు, కేవలం మన తెలుగులోనే డబ్బింగ్ ఆర్టిస్టుగా, గాయకునిగా నటుడిగా ఇలా వివిధ విభాగాలలో 23 సార్లు నంది అవార్ఢులు అందుకున్నారు. పాడిన ప్రతి ఇండస్ట్రీ నుండి ఎన్నో అవార్ఢులు రివార్ఢులు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటి నుండి గౌరవ డాక్టరేట్, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
నాటి సీనియర్ ఎన్.టి.ఆర్ నుండి నేటి జూ. ఎన్.టి.ఆర్ వరకు, కృష్ణ నుండి మహేష్ బాబు వరకు, చిరంజీవి నుండి అల్లు అర్జున్ వరకు, ఇలా తరతరాల వారికి పాడి ఆయన గొంతు యవ్వన శక్తిని చూపించారు. మిగితా గాయకులలో లేని మరో అద్భుత విషయం కమేడియన్స్ లను అనుకరిస్తు పాడటం రాజబాబు, బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, బాబు మోహన్, ఆలి వంటి హస్యనటులకు కూడా చరిత్రలో నిలిచిపోయే పాటలను అందించారు. ఆయన పాటలోనే మన బాధను అనుభవించుతాం, ఆయన గొంతు ద్వారానే మన ఆనందాన్ని వెతుక్కుంటాం, స్పూర్తి, శృంగారం, టీజింగ్, భక్తి ఇలా ఒక్కటేమిటి నవ రసాలను తన గాత్రం ద్వారా ఒలికించగల పాటల రాజు ఎస్పి. బాలసుబ్రమణ్యం. మన పెద్దలు చెప్పినట్టు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అన్న మాటలకు నిఖార్సాయిన నిర్వచనం ఆయన. పాట ఎంత మధురమో ఆయన వ్యక్తిత్వం కూడా అంతే ఉన్నతమైనది..




