Story Narrated by Spiritual Guru Osho
ఒక ఊరిలో ఓ అమాయకుడు ఉండేవాడు. పేరు చెప్పకుండా అమాయకుడు అని చెప్పినప్పుడే అర్ధం చేసుకోవచ్చు అమాయకత్వంతో అతనికెంత గుర్తింపు దక్కిందో అని. అతనేం చేసినా ఆ ఊరి జనాలు నవ్వుతారు.. ఏం చేయకపోయినా నవ్వుతారు.. మాట్లాడినా నవ్వుతారు.. మాట్లాడక పోయినా నవ్వుతారు. దీనితో అతను ఎవ్వరితో మాట్లాడకుండా ఊరికి దూరంగా ఇంటిని నిర్మించుకుని ఉండేవాడు.. ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ అమాయకుడు తన బాధ బరువును తగ్గించుకోవడానికి సాధువు కాళ్ళ మీద పడి తనకున్న వ్యధనంతా విన్నవించుకున్నాడు. నేను ఎవ్వరితో ధ్యైర్యంగా మాట్లడలేకపోతున్నా ఏది మాట్లాడినా ఏదో ఒక అర్ధం తీసుకుని హేళన చేస్తున్నారు, నాకు ఇలాంటి బతుకువద్దు.. నేను ఇలా ఒక అమాయకుడిగా చనిపోవడం ఇష్టంలేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు..
ఆ సాధువు ఇలా హితోపదేశం చేశాడు.. "ఒక దారి ఉంది.. ఈ సూత్రాన్ని పాటించు.. ప్రతి ఒక్కటిని విమర్శించు". అమాయకుడు: ఎందుకు.. విమర్శిస్తే ఏం జరుగుతుంది?
సాధువు: (చిన్నగా నవ్వుతూ) అదంతా నీకు తర్వాత తెలుస్తుంది. ఒక వారం తర్వాత నన్ను కలువు. అమాయకుడు: నాకు విమర్శించడం ఎలాగో తెలియదు ఎలా విమర్శించాలి? సాధువు: ఎవ్వరు ఏది చెప్పినా గాని దానికి నెగిటివ్ గా మాట్లాడు.. ఉదాహరణకు ఎవరైనా సూర్యోదయం చాలా అందంగా ఉందని అంటే దానికి నువ్వు 'సూర్యోదయమా.. అందులో గొప్పదనమేముంది, కొత్తేముంది? కొన్ని లక్షల సంవత్సరాల నుండి అలాగే ఉదయిస్తున్నాడు. సూర్యుడు కేవలం ఒక మండుతున్న వస్తువు మాత్రమే అంతే అని తీసిపారేసేయ్..! ఏవరైనా భగవంతుని గురించి, ప్రేమతో నిండిన ఆయన సూక్తుల గురుంచి మాట్లాడితే వెంటనే అతనికి ఎదురుగ వెళ్ళి ఆ సూక్తులలో ప్రేమెక్కడ ఉంది.! దాంట్లో ప్రత్యేకత అంటూ ఏది లేదు, ఎప్పటినుండో అవ్వే మాటలు..! అందులో కొత్తదనమేమి ఉంది.. అని వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా గుడ్డిగా విమర్శించు..! ఇంకెవరైనా ఒక అందమైన అమ్మాయిని చూస్తూ మాట్లాడుకుంటుంటే వారి దగ్గరికి పిలవకున్నా వెళ్ళి 'ఏముంది ఆ అమ్మాయిలో.. ముక్కు పెద్దగా ఉంది, ఆమె ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుండేది, అంటూ ఆమెలో ఏన్నో లోపాలున్నాయని విమర్శించు..! మొత్తానికి నీ పనులన్ని మానుకుని వాళ్ళు నిన్ను పిలవకున్నా, అడగకున్నా నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీటిని విమర్శించు..! వాళ్ళు పాజిటివ్ గా ఉన్నవాటికి నెగిటివ్ మాట్లాడు, నెగిటివ్ గా ఉన్నవాటికి పాజిటివ్ గా మాట్లాడు.. ఇలా ఈ ఏడు రోజులు చేసి చూడు తేడా నీకు తెలుస్తుందని సాధువు వివరించాడు.
వారం రోజుల తర్వాత ఆ అమాయకుడు సాధువు దగ్గరికి వచ్చాడు.. మునపటి సారి వచ్చినట్టుగా అతని ముఖం దిగులుగా పాలిపోయినట్టుగా లేదు హాయిగా నవ్వుతూ వస్తున్నాడు ఒంటరిగా మాత్రం కాదు తనని అనుసరిస్తూ కొంతమంది సేవకులు, వెనుకాల ఓ బ్యాండ్ మేళం. ఆ అమాయకుడు సాధువు దగ్గరికి వచ్చి 'మీరు చెప్పిన ట్రిక్ పనిచేస్తుంది' అని కన్ను కొట్టాడు. ఇప్పుడు నన్ను చూసి ఎవ్వరూ నవ్వడం లేదు.. నన్ను చూసి హేళనగా మాట్లాడిన వాళ్ళే నన్ను జీనియస్ గా కీర్తిస్తున్నారు. మాటల్లో నా మీద ఎవ్వరూ గెలవడం లేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు..? సాధువు.. ఇక ఏమి చేయకు దీనినే పాటించు. పాజిటివ్ గా ఏది మాట్లాడకు.. ఎవరైనా దేవుని గురుంచి మాట్లాడితే అతన్ని నాస్తికుడిని చేయడానికి ప్రయత్నించు. ఏమి మాట్లాడినా గాని దానికి తగ్గట్టు నెగిటివ్ గా ఓ మాట అనేసి వదిలేసేయ్. ఎందుకంటే నెగిటివ్ మాటలో ఉన్న చిక్కుముడిని విప్పడం చాలా కష్టం, పెంచడం కష్టం కాని తుంచడం సులభం.! భగవంతుని గురించి మాట్లాడాలి అంటే అందుకు ఎంతో జ్ఞానం కావాలి, పరిస్థితులకూ తగ్గట్టు సూక్ష్మంగా ఆలోచించాలి, ఎప్పుడూ మెళకువతో ఉండి ప్రేమతో నిండిన హృదయం కావాలి, నిత్యం వెలుగుతున్న దీపంలా ఉన్న ఆత్మ కావాలి.. కాని ఒక విమర్శకు ఇవ్వేమి అవసరం లేదు నిబద్ధత, బాధ్యత కూడా అవసరం లేదు. నీకు తోచినట్టు మాట్లాడితే సరిపోతుంది..!
మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్ లా కష్టపడనవసరం లేదు, మదర్ థెరిస్సాలా అన్ని వదిలేసి సేవ చేయనవసరం లేదు, భగత్ సింగ్ లా ప్రాణత్యాగం చేయనవసరం లేదు. కాని ఒక్కరూపాయి ఖర్చులేకుండా గొప్పగా మాట్లాడుకునేలా చేస్తుంది విమర్శ. గొప్ప గొప్ప వ్యక్తులు కారణం లేకుండా ఎవ్వరిని విమర్శించరు ఒకవేళ విమర్శించినా వారు మారాలి అనే తపన ఆ విమర్శలో ఉంటుంది.. కేవలం ఏ పనిచేయకుండా అడ్డదిడ్డంగా నలుగురిని తిట్టిపారేసే వాళ్ళకు ఏ కష్టం అవసరం లేదు అందుకే కొంతమంది విమర్శించడంలో ఆరితేరారు.. అలాంటి వారే మన సమాజంలో ఎక్కువ.