ఒంటరిగా ఉన్న నా మదిని ఎన్నో ఆవేదనలు, నా బుద్ది అడగని ప్రశ్నంటూ లేదు, నా ఆలోచన వెళ్ళని ప్రదేశం ఉండకపోవచ్చు అలా గమ్యం అంటూ తెలీని ప్రయాణం చేస్తున్న బాటసారిలా దిక్కులు తిరుగుతున్న నా దృష్టిని మార్చేసిందో శక్తి. ఎక్కడికీ పరుగు, దేనికోసం ఈ ఆవేశం, ఎవ్వరి కోసం ఈ ఆవేదన, ఎందుకొచ్చాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తాం... ఇలా అర్ధం లేని, అంతు చిక్కని, అవసరం కాని ఊహల సుడిగుండం లో చిక్కి బయటకు రాలేక అవస్థలు పడుతున్న నా మనసుని లాగి ప్రశాంతమైన ప్రదేశం లోకి విసిరేసిందో శక్తి. అదే భగవద్గీత.
చిలిపి కృష్ణుడు, చీరల దొంగ, అల్లరి కన్నయ్య, మాయల కృష్ణుడు, వెన్నె దొంగ, పాండవ పక్షపాతి అంటూ ఎన్నో పేర్లతో పిలవబడే కృష్ణ భగవానుడువాస్తవానికి దేవుడో, చక్రవర్తో, జ్ఞానో, మానవుడో ఇంకోటో మరోటో నాకు తెలీదు, నా దృష్టిలో మట్టుకు ఆయనో గురువు, జీవిత మార్గాన్ని సుగమం చేసిన విశ్వ గురువు. "ఎలా బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే విషయాల పై సుస్పష్టమైన భోధన చేసిన గురు దేవుడు శ్రీకృష్ణుడు."
కన్నయ్య మనకు ఇచ్చిన అమూల్యమైన కానుకే మనిషి ప్రతీ సమస్యకు ఓ సమాధానం చూపించగల భగవద్గీత. కేవలం బతుకు గురించే కాదు, మృత్యువు గురించి, మనిషి స్వభావం గురించి, ఆలోచనా విధానం గురించి, ఆవేశాల అనర్ధాల గురించి, కామం చేయించే ఘోరాలు గురించి ఇంకా చాలా వాటి గురించి. ముఖ్యంగా మన గురించి మన బుద్దికి తెలీని, మన కళ్ళు మనకు చూపించని, మన మనసు మనని తెలుసుకోనివ్వని ఎన్నో నిగూడః సత్యాలను తెలియపరుస్తుంది భగవద్గీత. జన్మాష్టమి మరియు గురువుల దినోత్సవం సందర్భంగా కృష్ణ భగవానుడు బోధించిన గీత లోని కొన్ని ప్రవచనాలు...
జన్మాష్టమి మరియు గురువుల దినోత్సవ శుభాకాంక్షలు!











