మనకు ఆపద వస్తే మన కుటుంబం, స్నేహితులు అండగా ఉంటారు! మరి మొక్కలకు, ఈ ప్రకృతికే ఆపద వస్తే..? ఈ నేచర్ మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి.. ఇది మన బాధ్యత కాదు, ఇదే మన బ్రతుకు!! శ్రీరామ్ మరియు వారి టీం కూడా ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. వారు మొక్కలను నాటుతారు, వారు అపరిశుభ్రమైన ప్రదేశాలను పరిశుభ్రంగా మార్చుతారు, వారు ప్లాస్టిక్ అవేర్ నెస్ పై కార్యక్రమాలు చేస్తారు అన్నిటికీ మించి మనలో మనం చెయ్యవలసిన కర్తవ్యాలను చేతల ద్వారా గుర్తుకుతెస్తారు.

ఆ ఒక్క సంఘటన: శ్రీరామ్ గారు కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కొన్ని సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ చెయ్యడం కోసం హైదరాబాద్ కు వచ్చారు, అబ్బాయి అక్కడ ఒక్కడే ఉండి ఇబ్బంది పడడం చూడలేక శ్రీరామ్ గారి అమ్మ నాన్నలు కూడా ఇక్కడికే వచ్చి స్థిరపడ్డారు. ఒకరోజు కాలేజ్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా సంవత్సరాల తరబడి భూమిలో పాతుకుపోయిన చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికేస్తున్నారు. ఇదేంటని అడగగా "రోడ్డు వెడల్పు చెయ్యడం కోసం" అని బదులిచ్చారు. వారికి స్ట్రాంగ్ గా సమాధానం చెప్పడానికి ఆరోజు శ్రీరామ్ గారికి కష్టంగా తోచింది. ఆ తర్వాత ఒక NGO లో జాయిన్ అయ్యి కొంత కాలం పనిచేశారు. తనకంటూ ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు, లక్ష్యాలకు అనుగూణంగా Earthlings ను 2016 లో ప్రారంభించారు.

ఎర్త్ లింగ్స్ చేసే కార్యక్రమాలు: సమాజం కోసం, నేచర్ బాగు కోసం తపించే కొందరి వ్యక్తుల సమూహమే ఎర్త్ లింగ్స్. మన సిటీ కాలనీలలో చాలా ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉంటాయి. వాటిని ముందుగా ఎంచుకుని చెత్త, ఇతర నిరుపయోగంగా ఉన్నవాటిని తీసివేసి గోడలపై పెయింటింగ్ వేస్తారు, వాటిపై కూడా నేచర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ లాంటి కోట్స్ తో మనలో స్ఫూర్తిని రగిలిస్తారు. వివిధ ప్రదేశాలను ఎంచుకుని మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తారు, అలాగే మొక్కలను కూడా ఉచితంగా అందిస్తారు. చలికాలంలో పేదవారికి బ్లాంకిట్స్ ఇస్తారు. ప్రతి ఆదివారం మన సిటీలో మారథాన్ జరుగుతూ ఉంటాయి, అక్కడ పేపర్ కప్స్ కానీ, భోజనం కోసం ఉపయోగించిన పేపర్ ప్లేట్స్, లేదంటే ఫుడ్ కూడా అక్కడ పడి ఉంటుంది. వాటిని జాగ్రత్తగా కలెక్ట్ చేసి భోజనాన్ని పందుల శిబిరానికి, ప్లాస్టిస్ వెస్ట్ ని రీ సైకిల్ యూనిట్ లకు పంపిస్తారు. సమ్మర్ లో సీడ్ బాల్స్ తయారుచేయడం, గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలకు ఉచితంగా రూ.200 ఖరీదు చేసే స్టీల్ బాటిల్స్ లను దాతల సహాయంతో అందించడం మొదలైన సమాజానికి, ప్రకృతికి అండగా ఉండే కార్యక్రమాలు చేస్తుంటారు.




ఇందులోనూ HR, Finance Department ఉంటుంది: ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ తో కోర్ టీం ఉంటుంది. ఈ కోర్ టీం లో HR Department, logistics department, PR department, finance department ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. HR విభాగం కొత్త మెంబర్స్ ని జాయిన్ చేసుకోవడం కోసం, అలాగే ఉన్న వాలంటీర్లు యాక్టివ్ గా ఉన్నారా లేదా అని పర్యవేక్షిస్తుంది, లాజిస్ట్రిక్స్ టీం ఒక ఈవెంట్ కావాల్సిన అంటే గోడలపై పెయింటింగ్ వేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అవసరం అయ్యే అన్ని వస్తువులను ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది.. ఇలా ప్రతి ఒక్క విభాగం కూడా వారికి అప్పజెప్పిన పనులను నిర్వర్తిస్తుంటారు. ఈ కోర్ టీం కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది.

పబ్లిక్ సపోర్ట్: దాదాపు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలకు పబ్లిక్ నుండి వచ్చే ఆదరణ, సపోర్ట్ వెలకట్టలేనిది. ఒకసారి ఇలాగే డర్టీగా ఉన్న ప్లేస్ ని క్లీన్ చేశారు. శ్రీరామ్ గారి నెంబర్ కనుక్కుని ఒక వ్యక్తి కాల్ చేసి "చాలా థాంక్స్ అండి ఎన్నో రోజులుగా ఈ దారి నుండే వెళ్ళే వాళ్ళము, ఇక్కడికి రాగానే బ్యాడ్ స్మెల్ తో ఇబ్బంది పడే వాళ్ళము, కానీ ఒక్క రోజులోనే ఈ ప్రదేశాన్ని మార్చి మునుపటి ఒపీనియన్ ని తొలగించారు అలాగే మా బాధ్యతలను గుర్తుచేశారు". ఇలాంటిదే మరొకటి.. ఈ మధ్యనే మన గవర్నమెంట్ స్కూల్స్ లో వాటర్ బెల్ ని తప్పనిసరి చేశారు. ఐతే పిల్లలు ఎక్కువ శాతం ఒక్కసారి వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగిస్తున్నారు. ఆ పేద పిల్లల కోసం బాటిల్స్ కొనివ్వాలనే ఉద్దేశ్యంతో ఫండ్స్ కోసం మిత్రులను అడిగారు(వాట్సాప్ స్టేటస్). కేవలం పది రోజుల్లోనే 1,100 మంది పిల్లలకు అవసరం అయ్యే స్టీల్ వాటర్ బాటిల్స్ కు అవసరం అయ్యే డబ్బు సమకూరింది. చిన్న లాజిక్ అండి మనం ఎదుటివారికి ఏది ఇస్తే అదే మరల మనకు తిరిగి వస్తుంది. కోపం చూపిస్తే కోపం, మోసం చేయాలనుకుంటే మోసం!! అలాగే ప్రేమను పంచితే ప్రేమ, మంచిని పంచితే మంచి..


You can reach: Instagram Link: https://www.instagram.com/EarthlingsNGO/ Facebook Link: https://m.facebook.com/earthlingsngo/