మంచి జీతం కోసం ఉద్యోగం రాజీనామా చేసినవారిని చూస్తుంటాం.. వ్యవసాయం కోసం, లేదంటే మరే ఇతర స్టార్ట్ అప్ మొదలుపెట్టడానికి రాజీనామా చేసినవారిని చూసుంటాం.. కాని శ్రీనివాస్, హరిత ల రాజీనామా మాత్రం కాస్త డిఫ్రెంట్ ఎందుకంటే వారు రాజీనామా చేసింది వారి కోసం కాదు సమాజం కోసం. అవును రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఎక్కడ ఆఫీస్ కు లేట్ అవుతుందని కనీసం 108 కు కూడా కాల్ చెయ్యకుండా తమ పాపాన్ని దిక్కుమాలిన రీజన్ తో కప్పిపుచ్చుకునే ఈ సమాజంలో, కేవలం సేవ చెయ్యడం కోసమే దాదాపు లక్ష రూపాయల జీతాన్ని వొదులుకున్న శ్రీనివాస్ హరితల వ్యక్తిత్వాలను విశదీకరించే ఆర్టికల్ ఇది.


నాన్న నెల్లూరు జిల్లాలో ఓ పోస్ట్ మాస్టర్, అమ్మ హోమ్ మేకర్. దేశంలో 80శాతం మధ్యతరగతి కుటుంబాలలో వారిది ఒకటి. నాన్నది చిన్న ఉద్యోగమే ఐనా తన చుట్టూ ఉన్నవారి సమస్యలలో తను భాగం పంచుకునేవారు. తల్లిదండ్రులు ఏది చేసినా పిల్లలు దానికి ఆకర్షితులవుతారు శ్రీనివాస్ నాన్న అడుగుజాడల్లో నడవడం ఏమాత్రం ఆశ్ఛర్యం లేదు. ఐతే ఆ మార్గంలో నడవడానికి శ్రీనివాస్ కు కాస్త సమయం పట్టింది. నాన్న మరణం తర్వాత బంధువుల సహాయంతో, ఉద్యోగం చేస్తూ తన చదువుని పూర్తిచేసుకుని హైదరాబాద్ "క్యాపిటల్ ఐక్యూ" లో మంచి ఉద్యోగం వచ్చింది. అక్కడే హరిత కూడా పరిచయం అయ్యింది.


చేతిలో డబ్బులేనప్పుడే సహాయాలు చేసిన శ్రీనివాస్ మంచి శాలరీ వచ్చాక ఇక నెమ్మదిగా ఎలా ఉండగలడు. 2008 లో తనను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దిన అమ్మ పేరు మీద "అమ్మ సోషల్ వెల్ఫేర్" తో తన లాంటి మనస్తత్వం కలిగిన వారికి ఒక వేదికను ఏర్పాటుచేశాడు. ఒక కొలీగ్ గా హరిత కూడా అందులో భాగమయ్యారు. ఇద్దరి ఆలోచనలు కలిస్తే స్నేహం చిగురిస్తుంది, ఇద్దరి మనసులు కలిస్తే అది ప్రేమగా రూపాంతరం చెందుతుంది. హరిత శ్రీనివాస్ ల ప్రేమ అప్పటినుండి కొనసాగుతుంది వారిద్దరి మధ్యనే కాదు సమాజం పట్ల కూడా.


ఎక్కువమంది అభాగ్యులను కలవలేకపోతున్నాం అనే ఉద్దేశ్యంతో వారిద్దరూ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు వారి శాలరీ లక్ష రూపాయాలు. సమాజం పట్ల ప్రేమ ఇవ్వేమి పట్టించుకోదు అని మరోసారి ఋజువుచెయ్యడానికి ఇదొక ఉదాహరణ. ఈ సేవ ప్రారంభమయ్యి ఇవ్వాళ్టికి 10 సంవత్సరాలవుతుంది. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, వైద్య శిబిరాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పునరావాస ఏర్పాట్లు ఇలా పది సంవత్సరాలుగా లక్షలాదిమందిని వీరు కలుసుకోగలిగారు. మన దేశ జనాభా ప్రపంచ దేశాలతో పోలిస్తే రెండో స్థానంలో ఉంది. ఇంతటి మానవ సంపదతో సాటి మనిషి కష్టాలను కొంతైనా తగ్గించి వారి ఉన్నతికి దోహదపడవచ్చు. కనీసం నెలకు రూ.100 విరాళంతో, నెలకు కేవలం ఒక్క గంట సేవతో సమాజంలో పెను మార్పులు తీసుకురావచ్చని వీరి సిద్ధాంతం. సమాజం పట్ల మీ బాధత్యను "అమ్మ"తో కలిసి పంచుకోవడానికి మీరు కూడా భాగస్థులు కావచ్చు..

పూర్తి వివరాల కొరకు: 99488 85111