హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తమ జీవితకాలంలో అతి పవిత్రమైన కొన్ని ప్రత్యేక దేవాలయాలను దర్శించాలని కోరుకుంటారు అందులో ఒకటి ఈ శ్రీశైల క్షేత్రం. పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఇక్కడ పరమశివుడు మల్లికార్జున స్వామిగా పూజలందుకుంటున్నారు.
కర్నూలు జిల్లా నుండి సుమారు 180కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది మామూలు దేవాలయం కాదు శ్రీరాముడు, పాండవులు, మహర్షులు పరమశివుని అనుగ్రహం కోసం పూజలు చేసిన మహిమాన్విత కోవెల ఇది. శ్రీశైలం శివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అంతేకాకుండా భ్రమరాంబ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. శివుని జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠాన్ని ఒకేసారి భక్తులు దర్శించుకునే అపురూపమైన దేవాలయం ఇది. తిరుపతి నుండి తిరుమలకు చేరుకునే మార్గం పచ్చని చెట్లతో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ శ్రీశైలానికి చేరుకునే మార్గం కూడా అంతే సుందరంగా ఉంటుంది. కేవలం దైవ దర్శనానికి మాత్రమే అని కాకుండా వ్యక్తిగత ఇబ్బందులు, టెన్షన్ల నుండి రిలీఫ్ పొందేందుకు కూడా ఈ యాత్ర ఇక్కడి వాతావరణం మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ గుడికి చేరుకున్న భక్తులు దర్శనానికి ముందు ఇక్కడి పాతాళగంగలో స్నానాలు చేస్తారు. పేరుకు తగ్గట్టే పాతాళగంగ 1000అడుగుల లోతులో ఉంటుంది. ఇక్కడ పవిత్ర పశ్చాతాప మనస్సుతో స్నానం చేస్తే వారి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గర్భగుడిలో ఉన్న ప్రతిమను దర్శించినప్పుడు మనం ఎలాంటి అనుభూతి చెందుతామో ఇక్కడి గోడలపై చెక్కిన శిల్పాలను చూసి అదే భక్తి పారవశ్యానికి లోనవుతాం.
ఇక్కడి భ్రమరాంబ అమ్మవారు, శివుడు స్వయంభూ గా వెలిశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు లోకంలో అల్లకల్లోలం సృష్టించడానికి తనలో విశిష్ట శక్తులు కావాలని బ్రహ్మదేవుని కోసం తపస్సు ప్రారంభిస్తాడు. బ్రహ్మా దేవుడు ప్రత్యక్షమై అరుణాసురుడు కోరినట్టే చనిపోయేటప్పుడు ఆ రాక్షసుని శరీరం నుండి ఎన్ని రక్తపు చుక్కలు పడతాయో అంతమంది అరుణాసురులు మళ్ళి పుట్టేలా వరం ఇస్తాడు. ఆ తర్వాత తాను అనుకున్నట్టే మనుషులను హింసించడం మొదలుపెట్టాడు.. భయంతో ఋషులు, దేవతలు అమ్మవారిని వేడుకుంటే సరేనని అమ్మవారు అరుణాసురుడిపై యుద్ధం మొదలు పెడుతుంది. అమ్మవారి ఆయుధంతో ఆ రాక్షసుడిని పొడిస్తే రక్తపు చుక్కలు భూమిమీద పడి చాలామంది అరుణాసురులు రావడం మొదలుపెట్టారు. ఇలా కాదని అమ్మవారు తుమ్మెద అవతారం ఎత్తి రాక్షసుని శరీరంలోకి వెళ్ళి రక్తాన్నంతా తాగి సంహారించిందని ఆ తర్వాత ఇక్కడే అమ్మవారు భ్రమరాంబగా వెలిసిందని పూజారుల కథనం. అలాగే ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది.. శివుని వాహనం నందికి సోదరుడైన పర్వతుడు మహా శివుడిని తపస్సు ద్వారా దర్శనం చేసుకుంటాడు. పర్వతుడి కోరిక ప్రకారమే పరమేశ్వరుడు తన పార్వతి దేవి సమేతంగా పర్వతుని తల మీద కొలువై ఉంటానని వరం ఇచ్చాడు. అలా శివపార్వతులు ఉన్న పర్వతమే శ్రీ పర్వతంగా తర్వాతి కాలంలో శ్రీశైలంగా మారిందని నమ్మకం.
శ్రీశైల పరిసరాలలోనే మనోహర గుండము, నాగ ప్రతిమలు, అద్దాల మండపము, శ్రీశైలం డ్యామ్, రుద్రాక్ష మఠం, నంది మఠం, విశ్వామిత్ర మఠం, శిఖరేశ్వరం, సాక్షి గణపతి, శంకరుని పాద ముద్రలు, పంచధార, పాల ధార ఇంకా ఇక్కడి అడవిలోని ప్రకృతి అందాలు మొదలైనవన్నీ చుడదగినవి. ఇక్కడి నుండి కేవలం తెలుగు రాష్ట్రాల నుండేకాక యావత్ భారతదేశం నుండి కూడా భక్తులు లక్షల సంఖ్యలో దర్శనానికి వస్తారు.