Meet Srujan, Who Invented Rice Seeding Machine In Just Seven Months For His Mother

Updated on
Meet Srujan, Who Invented Rice Seeding Machine In Just Seven Months For His Mother

చింతకింది మల్లేశం గారు తన అమ్మ గారి కష్టాన్ని చూడలేక ఏడు సంవత్సరాలు కష్టపడి ఆసు యంత్రాన్ని తయారుచేశారు. మల్లేశం గారు అంతగా చదువుకోలేదు, టెక్నాలజీ పరమైన జ్ఞానం కూడా అంతంత మాత్రమే ఉన్నా కాని యంత్రాన్ని కనుగొని తన అమ్మలాంటి ఎందరో తల్లులకు ఆసు యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. నేను(సృజన్) మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాను, టెక్నాలజీ పట్ల అవగాహన ఉంది, మల్లేశం గారు తన తల్లి కోసం ఏడు సంవత్సరాలు కష్టపడితే నేను కనీసం ఏడు నెలలు కూడా కష్టపడలేనా.? అని అనుకుని సరిగ్గా ఏడు నెలలలోనే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న సృజన్ వరి నాట్లు వేసే మెషిన్ ను తయారుచేశాడు.

40 వేలకే: వరి నాట్లు వేయడం విపరీతమైన శ్రమతో కూడుకున్నది. ఒక్కొక్క వరి నాటును ఎకరాల పొలంలో వేయడానికి గంటల తరబడి వంగాల్సి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో వ్యవసాయ కూలీల వేతనం కూడా పెరిగింది, ఒక్క ఎకరం వరి నాట్లు వేయాలంటే దాదాపు రూ.3,000 ఖర్చు వస్తుంది, ఇంతే ధర మెషిన్ ద్వారా వేసిన వస్తుంది. అలాంటప్పుడు బయట మార్కెట్లో దొరికే వరి నాట్లు వేసే మెషిన్ వల్ల ఉపయోగం ఏమిటి.? టెక్నాలజీ మనిషికి భారం తగ్గించాలి. మార్కెట్లో లభ్యమయ్యే వరి నాట్లు వేసే మెషిన్ ధర దాదాపు 8 లక్షల వరకూ ఉంటుంది. లక్షరూపాయల లోన్ కట్టడానికే రైతు ఇబ్బంది పడుతుంటే అంత డబ్బు పెట్టి మెషిన్ ని ఎలా కొనగలడు.? వీటన్నిటిని గమనించిన సృజన్ కేవలం రూ.40,000 లోనే దానికన్నా ఎక్కువ మేలైన మెషిన్ రూపొందించాడు.

ఏడు నెలల శ్రమ, ఇంటిపైనే షెడ్డు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన సృజన్ వరి నాట్లు వేసే మెషిన్ తయారుచేస్తానంటే మొదట ఆ గ్రామానికి చెందిన రైతులు అభినందించారు, అనుమానపడ్డారు, ఇంకెప్పుడు రెడీ అవుతోంది అని రకరకాల ప్రశ్నలు వేశారు. మీరు మల్లేశం సినిమా చూసి ఉంటారు కదా.? అచ్చం అలాగే జరిగిందనుకోండి. తనకు వచ్చే స్కాలర్ షిప్, నాన్న సహాయం చేసిన డబ్బుతో నెమ్మదిగా పని మొదలుపెట్టాడు. ఈ మెషిన్ కోసం ఉపయోగించిన పనిముట్లు పాత ఎక్సెల్ ఇంజిన్, చైన్లు, రాడ్లు, ఇనుపచువ్వలు, ప్లాటినం మొదలైనవి ఎక్కువశాతం సెకండ్ హాండ్ లో కొన్నవే. వీటన్నిటిని తీసుకుని వచ్చి ఇంటిపైనే ఒక షెడ్డు వేసి ప్రతిరోజు గంటల తరబడి కృషిచేస్తే అద్భుతమైన మెషిన్ రెడీ అయ్యింది. మార్కెట్లో దొరికే రెగ్యులర్ మెషిన్ లో కన్నా ఇందులోనే ఎక్కువ వరసలు, తక్కువ నిడివి ఉండేలా జాగ్రత్త పడ్డారు.

మల్లేశం గారి ప్రభావం: పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం గారి ప్రభావం సృజన్ పై ఎక్కువగానే పడింది. మల్లేశం గారి టెడ్ టాక్ చూడడం వల్ల తన ఆశకు ఒక కార్యాచరణ ప్రారంభమయ్యింది. మల్లేశం గారు అంతగా చదువుకోకపోయినా కేవలం అమ్మ కోసమే అంత చేయగలిగారు. సృజన్ కు ఎప్పుడు కాన్ఫిడెన్స్ కోల్పోయినా, ఎప్పుడు బయటి ప్రపంచం నుండి క్రిటిసిజం ఎదురైనా "మల్లేశం" సినిమా చూడడమో, మల్లేశం గారి టెడ్ టాక్ చూడడమో చేస్తూ మొటివేషన్ పొందేవాడు. ఖచ్చితంగా ఇదే విషయాన్ని ఏదో ఒకరోజు మల్లేశం గారిని కలిసి చెప్తానని సృజన్ నమ్మకం. ఈ యంత్రాన్ని రూపొందించిన తర్వాత ట్విట్టర్ లో కేటీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసాడు. కేటీఆర్ గారు కూడా దీనికి స్పందించి ప్రభుత్వ పరంగా సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు కూడా.

భవిష్యత్తులోనూ సృజన్ కు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమో, లేదంటే అమెరికా వెళ్లాలనో ఆశ లేదు ఆశయం లేదు. రైతుల కోసం తక్కువ ఖర్చులో మెషీన్స్ ను తయారుచెయ్యాలి, వారి కష్టాన్ని చాలా వరకు తగ్గించాలనే సృజన్ లక్ష్యం. తన లాగే ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులు ఈ ఫీల్డ్ లోకి రావాలని కోరుకుంటున్నాడు.

సృజన్ ను Instagram లో కలుసుకోవచ్చు: https://instagram.com/srujan_patel_chilla?igshid=wrk2poamtlt9