Contributed by Priyanka
నాడు:- నా వెనుక నుంచి నన్ను వెంటాడే కళ్ళతో నీ చూపులు, నాతో మాట్లాడాలని నువ్వు ఉవ్విళ్ళూరే క్షణాలను చూసి నవ్వుకున్నా ఆనాడు, శబ్దం లేకుండా మన మనసుల మధ్య అలుకున్నాయి ఏవో తెలియని ఊసులు, మాటలు మొదలయినాక మన మధ్య చిగురించిన స్నేహం, నన్ను గెలవటానికో లేదా నా మనస్సును గెలుచుకోవటానికో నువ్వు పడిన ఇక్కట్లు చూసి ఉబ్బితబ్బిబైంది నా మనసు. నీతో కలిసి వుండటం నా అదృష్టం అని మురిసిపోయిన నా అంతరాత్మ ఆనాడు!!
నిన్న:- మన మధ్య వున్న తెలియని బంధం ప్రేమగా రూపాంతరం చెందింది. నేను కలలు కన్న నిజమైన ప్రేమ నీ దగ్గరే దొరుకుతుంది అని నా మనసు చెప్పింది , నువ్వు చూపిన ప్రేమకు నా మనసు మురిసి పోయింది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఒక జ్ఞాపకమే, నువ్వు పంచిన ప్రతి అనుభూతి ఒక మధురానుభూతిగా మిగిలి పోతుంది అని సంతోషించాను, కానీ అది గడిచిన క్షణాల్లో మిగిలిపోయిన జ్ఞాపకాలని తెలిసింది కుంగిపోయాను.
నేడు:- కాలం మన మీద బాధ్యత అనే భారాన్ని మోపింది. నీకు బాధ్యత లేదు అని నాకు తెలిసింది. కాలంతో పోటీ పడుతూ కరిగిపోతుంది మన మధ్య ఉన్న ప్రేమ అనే బంధం. ఒకప్పుడు నీ ఇష్టాలను ఒప్పుకున్న నా మనసు, ఇప్పుడు అవే నీ బలహీనతల్ని చెబుతుంది.
నాకు నచ్చిన నీ గుణం, ఇప్పుడు మింగుడుపడడం లేదు! నీ నవ్వు కూడా నాకు చుట్టమైపోయింది, అప్పుడప్పుడు కనిపిస్తుంది!
నీతో మాటలు మొదలవడానికి మునుపు, నాలో ఒక మినీ యుద్ధం మొదలవుతుంది!! తప్పు ఎక్కడో ఉందని తెలుస్తుంది, కానీ తప్పు అని ఎలా తెలుస్తుంది!! ఇదే నీ ప్రస్తుతం అని నా మనసు చెబుతోంది, నువ్వు మారకపోతావా?? అని మన భవిష్యత్తు ఎదురుచూస్తుంది!!