ఈ ప్రపంచమే ఒక వార్ జోన్, దేవుడు మనల్ని ఇందులో పడేశాడు అని పూరిజగన్నాథ్ గారు చెప్పినా, దాన్నే చార్లెస్ డార్విన్ "Survival Of The Fittest" అని చెప్పినా ఒకటి మాత్రం నిజం "We Are Here To Achieve Something".
ఈ జీవిత యుద్ధంలో మనకు ఎదురు దెబ్బలు తగలడం సహజం. "నీ పని నువ్వు ధైర్యంగా చేయ్యి మిగితాది నేను చూసుకుంటా" అని కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు మనకు కావాల్సిన దాని కోసం కష్టపడడం మాత్రం కేవలం మన చేతుల్లోనే ఉంది. కాని గెలుపు ఓటములు మన చేతిలో ఉండవు. పోరాటంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలకే ఎంతో శక్తి ఉండే యువత ఒక్కోసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు.. అలాంటివారికి స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధవుల కథల కన్నా మన మధ్యనే ఉంటూ అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారి కథలు మరింత స్పూర్తినిస్తాయి.. అలాంటివారి కథలే ఈ స్టోరిస్ ఆఫ్ కామన్ మ్యాన్. ఇలాంటివారి కథలు చదవడం వల్ల వారి నుండి ఎంతో నేర్చుకోవచ్చు మరి వారికి ఎలాంటి లాభమూ ఉండదా.? అంటే ఖచ్చితంగా ఉంటుంది. అవును కొంతమందిని చూస్తుంటాం ఫేస్ బుక్ లో కాని, వాట్సప్ లో కాని మెసేజెస్ పెడుతూ దీనిని షేర్ చేయండి చేస్తే మార్క్ మామ డబ్బులు పంపిస్తాడు అని దిక్కుమాలిన మెసేజెస్ పంపిస్తుంటారు. కాని వీరి సైట్ లోని ఆర్టికల్స్ చదివి షేర్ చేస్తే మాత్రం వెబ్ సైట్ కు వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ పోరాట యోధులకే చెందుతుంది.
స్వరూప్ ఎంటెక్ పూర్తిచేశాడు ప్రస్తుతం సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఉద్యోగం వచ్చిన తర్వాతే సమజానికి సేవచేయాలా.? అనుకుంటే ఇప్పుడే ఏదోరకంగా చేయవచ్చు కదా అని చెప్పి సుమారు సంవత్సరం క్రితం "స్టోరిస్ ఆఫ్ కామన్ మ్యాన్" సైట్ స్టార్ట్ చేశారు. ఒకరి అభిరుచులు, ఆశయాలు మరొకరికి నచ్చితే వారిద్దరు త్వరగా మిత్రులవుతారు.. చేతులు ఎక్కువైన కొద్ది చేతలు పెరిగిపోతాయి అన్నట్టుగా స్వరూప్ కు విహారి వర్మ, నాగర్జున, అమృత వర్షిని, విజయ్, కృష్ణ గోపిక, శ్వేత, రాజ్ దీప్, కార్తిక లాంటి మిత్రులు తోడయ్యారు కేవలం మన తెలుగు రాష్ట్రలలోనే కాక భారతదేశమంతట ఉన్న సామాన్య పోరట యోధల కథలను వివరిస్తూ వారికి ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు. వాటిలో కొన్ని కథలు..
1. 40 సంవత్సరాలకు దక్కిన ఫలితం: షాజన్ గారు చిన్నతనం నుండి "కలివీణ" అనే Music Instrument వాయుస్తు ఓ దేవాలయం దగ్గర అమ్ముతున్నారు. 40 సంవత్సరాలకు పైగా ఇదే జీవితం. రోజుకు ఒక్కటి లేదా రెండు అమ్మడమే ఒక అద్భుతంగా ఉండేది. ఇది కాదని వేరే ఒక వృత్తి చేసుకోవచ్చుగా అని అడిగితే తండ్రి నుండి వచ్చిన వారసత్వం నేను వేరే పని చేయలేను అని చెప్పేవారు. షాజన్ గారి గురించి స్టోరిస్ ఆఫ్ కామన్ మ్యాన్ లో పోస్ట్ చేశారు. కేవలం ఒకే ఒక్క పోస్ట్ తో అతని జీవితం మారిపోయింది. అవును.. షాజన్ గారి పరిస్థితిని చూసి చలించిపోయి, వృత్తి పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని గుర్తించి దాతలు స్పందించారు. ఇంతకు ముందు ఎండలో నిలబడి అమ్మితే ప్రస్తుతం దాతలు నిర్మించిన షాపులో దర్జాగా కూర్చుని అమ్ముతున్నారు.
2. రిక్షా నుండి ఆటో వరకు: రామన్ జగత్ గారిది మరో మనసుని కలిచివేసే కథ. చిన్నతనంలోనే అమ్మ నాన్నలు మరణించడంతో చదువు'కొనే' స్థోమత లేక బ్రతుకు బండి కోసం రిక్షాను నడపడం మొదలుపెట్టారు. పెళ్ళి జరిగింది, పిల్లలు కూడా కలిగారు.. కాని పెద్దకొడుకుకి చిన్నతనంలోనే పెరాలసిస్ వచ్చేసింది. భార్య ఇంట్లో పనులు చేస్తు, తను రిక్షా నడుపుతూ వచ్చే ఆదాయం అంతా కలిపితే కేవలం 5,000కు మించి దాటదు. కుటుంబాన్ని పోషించడం ఎలా ఇంకా కొడుకుకు ట్రీట్మెంట్ అందించడం ఎలా..? ఇలాంటి విపత్కర పరిస్థితులలోనే స్టోరిస్ ఆఫ్ కామన్ మ్యాన్ స్పందించింది. తన కథను వివరిస్తు సైట్ లో పోస్ట్ చేశారు. మనం ఉన్నది మానవత్వం నిండిన మనుషుల మధ్యలో కనుక దాతలు స్పందించారు. ప్రతి నెల ఆ బాబుకు తక్కువ ధరకే మందులు అందించడంతో పాటు త్వరలోనే ఆటో అందివ్వడానికి అందరూ సహకరిస్తున్నారు.
3. నాట్యం కోసం మహిళగా మారిపోయారు: ఇంతవరకు ప్రేమించిన వ్యక్తి కోసం తాజ్ మహల్ కట్టినవారిని చూశాం, సముద్రం మీద రామసేతును నిర్మించిన వారిని చూశాం.. అమర్ జిత్ కూడా అంతే స్థాయిలో నాట్యాన్ని ప్రేమించాడు ఎంతలా అంటే నాట్యం కోసం తన జెండర్ నే మార్చుకోవడానికి సిద్దపడ్డారు. నాట్యంలో సంపన్నుడైన కాని డబ్బు విషయంలో మాత్రం అతి బీదవాడు. నాట్యం పట్ల అతని అనిర్వచనీయమైన ప్రేమను గుర్తించి స్టోరీస్ ఆఫ్ కామన్ వారు సైట్ లో పోస్ట్ చేయడం మాత్రమే కాక అతని ఆపరేషన్ కు అవసరమయ్యే తగిన ఏర్పట్లు కూడా చేశారు. ప్రస్తుతం దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇవ్వడం మాత్రమే కాక గౌరవ డాక్టరేట్, "నాట్య శిరోమణి" అవార్డును కూడా అందుకున్నారు.
ఇలా స్టోరీస్ ఆఫ్ కామన్ మ్యాన్ ద్వారా మారిన జీవితాలెన్నో ఉన్నాయి.. మనం సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం ఆ తపనలోనే పాత మార్గాల కన్నా అనేక కొత్త మార్గాలు వస్తాయి. ఈ యువత ఒక కూటమిగా ఏర్పడి తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ, సోషల్ మీడియా పవర్ తో ఎంతోమంది జీవితాలను మారుస్తున్నారు నిజంగా ఇది ఓ విప్లవాత్మక సేవా మార్గం..