ప్రతీ మనిషి జీవితం లో తనని ఎంతో కొంత ప్రభావితం చేసే స్నేహితులు ఉండే ఉంటారు,అలాగే నా జీవితంలో కూడా నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరున్నారు. ఒకడు మిత్రా ఇంకొకడు శత్రు. ఇద్దరూ సార్ధక నామధేయులే,ఒకడు నా జీవితాన్ని దాదాపుగా నాశనం చేసేసిన వాడు,ఇంకొకడు ప్రాణాపాయం నుండి నన్ను కాపాడి,నాకు పునర్జన్మ ఇచ్చి ఈరోజు నేనిలా మాట్లాడేలా నన్ను మార్చిన వాడు . మేమంతా కలిసే పెరిగాం .ఈ ఇద్దరు లేకపోతే నేను లేను,విడదీయలేని సంబంధం మాది,కానీ నా అనుకున్న వాడు,నమ్మకంగా నాతోనే ఉంటూ నాకు అతిపెద్ద విరోధి అవుతాడని అసలు ఊహించలేదు.
మిత్రా ఒక Ideal Person.ఒక మనిషి ఎలా ఉండాలి అనే దానికి అసలైన ఉదాహరణ. డిసిప్లిన్డ్ లైఫ్,సమాజం మీద ఒక సానుకూల దృక్పధం. ప్రపంచం మీద అవగాహన,ఒక్క మాట లో చెప్పాలంటే Noble Character,వాడు నాతో ఉండడం నా అదృష్టం .ఇక శత్రు వీడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది,ఉన్మాదానికి ఒక రూపం ఉంటె అది శత్రు ,శని + శకుని = శత్రు.వాడు ఇలాంటి వాడు అని తెలుసుకోడానికే నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది . మిత్రా కి నేనంటే ఎందుకో విపరీతమైన అభిమానం ఉండడం వల్ల నేను శత్రు తో కలిసున్నా కూడా నన్ను ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండేవాడు. ఇంజనీరింగ్ చదివేప్పుడు మిత్రానే దగ్గరుండి ఏవేవో పుస్తకాలు కొనిచ్చేవాడు, చదవమని ఎంతగానో చెప్పేవాడు, కానీ శత్రు తో నాకున్న సావాసం వల్ల వాడు చెప్పేవేవి నాకు ఎక్కేవికాదు, చాదస్తుడు అంటూ పట్టించుకునేవాడినే కాదు, పరీక్షలకి నెలల ముందు నుండే చదవమంటూ మెటీరియల్స్ అన్నీ ఇచ్చేవాడు మిత్రా , ఎగ్జామ్స్ ముందు చూసుకోవొచ్చు ,స్లిప్స్ పెట్టేయొచ్చు అంటూ సులువైన దారులు చూపించేవాడు శత్రు ,శత్రు నాకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసాడు,ఇక్కడే స్వర్గం చూపించాడు,వీకెండ్స్ లో హుక్కా ,బీరు తో మొదలై అరగంటకో సిగరెట్ ,రోజూ మందు సిట్టింగ్ దాకా వెళ్లి చివరికి డ్రగ్స్ కి బానిస అయ్యేలా చేసాడు. డ్రగ్స్ కోసం డబ్బులు కావాలి డబ్బులకోసం బైక్ రేస్ లు …. మనసుకి మత్తు,కళ్ళకి ముసుగు తో ప్రపంచమే మర్చిపోయా రోజుకోసారైనా డోస్ పడాల్సిందే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడిని ,ఏదైనా చేసేవాడ్ని
ఓసారి ఊరిబయట ఫ్రెండ్ ఫార్మ్హౌస్ లో పార్టీ అంటూ తీసుకెళ్లాడు శత్రు, డ్రగ్స్ కోసం అని నేనూ వెళ్ళాను.మత్తుగా ,గమ్మత్తుగా ఆ రాత్రంతా గడిపేసాం, అర్ధ రాత్రి 2 గంటలకి బయలుదేరాం ,ఇంతలో శత్రు స్నేహితుడొకడొచ్చి ,ఒక రేస్ ఎద్దాం , దమ్ముందా ?? అంటూ రెచ్చగొట్టాడు,అసలే కిక్కులో ఉన్నా,పైగా నా ఇగో ని గెలికాడు ,రా చూసుకుందాం అంటూ బండి స్టార్ట్ చేశా మొదటగా ఎవరు టోల్ ప్లాజా చేరితే వాళ్లే విజేత ,శత్రు నా వెనక ఉంటూ నన్ను ఇంకా రెచ్చగొట్టాడు,విశాలమైన రోడ్డు,నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ మంటూ 140 కి మీ స్పీడ్ తో బండిని డ్రైవ్ చేస్తున్నా,దాదాపుగా లాస్ట్ పాయింట్ కి చేరుతున్నా ,కనెక్టింగ్ రోడ్ మీద నుండి ఒక లారీ సడెన్ గా రోడ్ మీద కి వచ్చింది,దానిని తప్పించబోయి బైక్ ని ఎడమ చేతి వైపు పోనిచ్చా కంట్రోల్ తప్పింది,అప్పుడే శత్రు దూకేసినట్టున్నాడు ,బండి పూర్తిగా నా కంట్రోల్ తప్పింది 140 స్పీడ్ తో ఒక్క సారిగా రోడ్డు పై పడ్డా , నాలుగు పల్టీలు కొట్టి 10 అడుగుల దూరంలో పడ్డాను,హెల్మెట్ ఉండడం వాళ్ళ తలకి గాయం అవలేదు,వెన్నెముక దగ్గర 2 ఫ్రాక్చర్లు,కుడి చేయి,కుడి కాలికి ఫ్రాక్చర్లు ,చాల చోట్ల గాయాలు,ఒళ్ళంతా రక్తం,నా బైక్ తునాతునకలు అయ్యింది ఆ బండి ని చూస్తే అసలు నేను బ్రతకడం అసాధ్యం అనిపించేతంగా ఉండింది . ,నేను చనిపోయాననే అనుకున్నాను,దాదాపు 15 రోజులు స్పృహలో లేను. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నాను అని అర్ధం అయ్యింది ,మెల్లిగా కళ్ళు తెరచి చూస్తే ఎదురుగా మిత్రా , " నీకెన్ని సార్లు చెప్పాన్రా వాడి సావాసం వొద్దు అని,ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరిగిందో ,అదృష్టం బాగుంది ప్రాణం పోలేదు,నువ్ లేకపోతే నేను ఎలా ఉండాలిరా " అంటూ ఏడ్చేశాడు, నాక్కుడా ఏడుపొచ్చేసింది.
దాదాపు ఒక ఆరునెలలు మంచానికే పరిమితం అయ్యా,మిత్రా నాకోసం ఎంతో చేసాడు,నాకోసం చాలా పుస్తకాలు ఆన్లైన్లో కొని ఇచ్చేవాడు,నాకు మెల్లిగా నడవడం నేర్పించాడు,నాలో ధైర్యాన్ని నాటాడు,ఒక పునర్జన్మ ఇచ్చాడు,ఈరోజు నేను శారీరకంగా మానసికంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే మిత్రానే కారణం,ఎప్పుడో నాకు ఇష్టం లేకున్నా కూడా మిత్రా నాకు నేర్పించిన సాఫ్ట్వేర్ కోర్స్ ఈరోజు నాకో ఉద్యోగాన్ని మంచి జీతాన్ని అంతకు మించి ఒక జీవితాన్ని ఇచ్చాయి ఇలాంటివాడు నాతో ఉండడం ఏ జన్మ పుణ్యమో మొదటి రోజు ఆఫీసుకి బయలుదేరుతున్నా .రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని నా రూమ్ నుండి బయటకి వస్తుంటే ఎవరో నన్ను దాటి వెళ్ళినట్టు అనిపించింది,ఒక అడుగు వెనక్కి వేసి చూసా, ఎదురుగా వాడే... ..శత్రు .... వాడు .... ..శత్రు .... అహ .....కాదు కాదు…. వాడు…. మిత్రా ..... లేదు….. ఆ నవ్వు…. ఆ నవ్వు…. శత్రుదే… నాకు తెలుసు వాడు శత్రునే ...కానీ ఆ కళ్ళు ,……ఆ వెలుగు మిత్రానే ……..వాడు మిత్రా ...........అయ్యో ….వాడు శత్రు ...... కాదు కాదు …కానే కాదు …….వాడు మిత్రా ......... ఒక్క నిమిషం వాడు శత్రు నా మిత్రా నా తేల్చేస్తా ........ దేవుడా ........... వాడు శత్రు కాదు మిత్రా కాదు,అది…. అదీ…… అదీ…. అద్దంలో నా ప్రతిబింబం ....అంటే …..అంటే….. శత్రు ,మిత్రా అనే వాళ్ళు లేనేలేరు,ఆ రెండు నేనే .... నేనే ….శత్రు ని…. నేనే ….మిత్రాని………
నాకు అసలు విషయం అర్ధం అవ్వడానికి చాలా సమయమే పట్టింది. నాలో ఉన్న నెగటివ్ ఆలోచనలకి ప్రతిరూపం శత్రు,నేనెప్పుడు చెడుగా ఆలోచించినా నా అంతరాత్మ శత్రులా కనపడేది,నాలో ఉన్న పాజిటివ్ ఆలోచలనకి,మంచి భావాలకి రూపం మిత్రా,నా ఆలోచనలు మంచి విషయాలపై మళ్ళినపుడు నా అంతరాత్మ మిత్రాలా కనపడేది,నాలో ఉన్న పరస్పర భిన్న ఆలోచనలకి జరిగే సంఘర్షణ నన్ను మిత్రా వైపు కానీ ,శత్రు వైపుకి కానీ నన్ను మల్లించేవి,ఈ ఇద్దరి మిశ్రమమే నేను, నేను ఏ ఆలోచనలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే అప్పుడు ఆ ఆలోచనల ప్రతిరూపం గా మిత్రా,శత్రు ప్రత్యక్షం అయ్యేవారన్నమాట ...
నాలాగే నీలో… నీలో…. మనందరిలోనూ మిత్రా, శత్రు అనే ఇద్దరు ఉంటారు .ఒకడు మనల్ని పైకి ఎదగమని ప్రోత్సహిస్తాడు,ఇంకొకడు నీ వల్ల కాదని నిరుత్సహపరుస్తాడు.ఒకడు ఆశాజీవీ. ఒకడు నిరాశాజీవి .ఒకడు మనలోని హీరో ఇంకొకడు మనలోని విల్లన్ . మీతో మిత్రా ఉంటె వాడినెప్పటికీ వొదులుకోకండి,జీవితాంతం మీతోనే ఉండనివ్వండి, మిమ్మల్ని గెలిపిస్తాడు మీతో శత్రు ఉంటె వెంటనే వాడ్ని వొదిలించుకోండి లేదంటే జీవితం అంతమే
Every one has a Monster and Angel inside,its upto you whom you wanna feed,whom you wanna be ….Either to Live like Hero in your Life or Die as a Villain