తను అందరిలా నడవలేదు ..... కానీ తన వేగాన్ని అందుకోవడం ఎవరి తరమూ కాదు. తన పని తాను చేసుకోవడం కూడా కొన్ని సార్లు కష్టమే ....... కానీ రోజుకు 20 గంటలు ఎదో ఒక రూపం లో పనిలోనే నిమగ్నమై ఉంటుంది. బ్రహ్మ రాసిన తలరాతని తన చెమటతో చెరిపేసింది.
మానసికంగా ధృడంగా ఆత్మస్తైర్యం తో ,ఆత్మవిశ్వాసం తో అడుగు ముందుకు వేస్తే శారీరక వైకల్యం అడ్డే కాదని నిరూపించారు బాలలత గారు.
పోలియో వల్ల చిన్నప్పటి నుంచే నడవలేని పరిస్థితి . కానీ సాదించాలని తపన , తానేమిటో నిరూపించాలనే కసి , పట్టుదల ఇవి ఉంటె చాలు , ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సులభంగా విజయతీరాలు చేరుకోవొచ్చు అని రుజువుచేసారు బాలలత గారు
బాలలత గారు ఉస్మానియా లో ఎల్ఎల్ఎం పూర్తి చేసారు . దేశంలోనే అత్యంత క్లిష్టమైన సివిల్ సర్వీసెస్ ని తన లక్ష్యంగా ఎంచుకున్నారు . కఠోర శ్రమతో 2004లో జాతీయస్థాయిలో 399 వ ర్యాంకు సాధించారు . భారత రక్షణ శాఖలో ఉద్యోగం పొందారు . ఉద్యోగ భద్రత ,మంచి వేతనం ,హోదా . జీవితం లో ప్రతీ ఒక్కరు కోరుకునేవి ఇవే,కానీ బాలలత గారు వీటితో సంతృప్తి చెందలేదు . తనకున్న జ్ఞానాన్ని ఇతరులకి పంచుతూ సివిల్స్ పరీక్షకి సన్నద్ధం అయ్యే విద్యార్థులకి మార్గదర్శకురాలిగా మారారు . ఎంతో మంది విద్యారులకి శిక్షణ అందిస్తున్నారు . ఒక వైపు విధి నిర్వహణకి ఎలాంటి విఘాతం కలగకుండా పనిచేస్తూనే, మరో వైపు గృహిణిగా తల్లిగా ఇంట్లో తన బాధ్యతలని నిర్వహిస్తూ … ప్రతీ రోజు ఉదయం 5గంటల నుండి పది గంటలవరకు విద్యార్థులకి పాటలు భోదిస్తూ ,మధ్యలో ఉద్యోగం , మళ్ళీ సాయంత్రం దాదాపు పది,పన్నెండు గంటలవరకు కూడా పాఠాలు భోదించడం, విద్యార్థులకి సూచనలు ఇవ్వడం ,ఇలా దాదాపు పది సంవత్సరాల నుండి ఎంతో మంది ర్యాంకర్లను తయారు చేసారు బాలలత గారు .

తాజాగా వెలువడిన సివిల్స్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రోణంకి గోపాలకృష్ణ ,బాలలత గారి శిష్యుడే .
ఇంత సాధించినా బాలలత గారు ఏనాడూ సంతృప్తి చెందలేదు,ఈనాటి తరంతో కూడా పోటీపడాలి అని 2016లో మరోసారి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 167వ ర్యాంకు సాధించారు . తనకి వచ్చిన ర్యాంకుతో దేశంలోనే అత్యున్నత ఉద్యోగం అయిన ఐఏఎస్ వచ్చే అవకాశం ఉన్నపటికీ , తనని చూసి నలుగురూ స్ఫూర్తి పొందాలనే ఇది సాదించానే తప్ప ఉద్యోగం కోసం కాదని,తన వల్ల ఒక నలుగురు అయినా ప్రేరణ పొంది సమున్నత లక్ష్యాలను చేరుకుంటే అదే తన విజయం అని చెబుతారు బాలలతగారు.

ఆశయసాధన కొరకు అడుగులేస్తున్న ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశం చేస్తున్న బాలలత గారు అందరికీ స్ఫూర్తిప్రదాతే . చిన్న చిన్న ఇబ్బందులకే కుంగిపోతూ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నవారికి , లక్ష్యసాధనలో ఎదురయ్యే అవరోధాలని అధిగమించలేక ఆగిపోతున్న వారికీ బాలలత గారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం .