అప్పటివరకు పోల్చుకోవడానికి ఒక ఉదాహరణ ఉండదు కాబట్టి మొదటి గొంతు, మొదటి కదలిక, మొదటి తిరుగుబాటు, మొదటి యుద్ధం, మొదటి ప్రాణత్యాగం అత్యంత కష్టమైనది.. గుండెల నిండా ధైర్యం, నరనరాన దేశభక్తి రక్తంతో కలిసి రగిలితె తప్ప అది సాధ్యపడదు. ఎవడు అన్నాడు భారతీయుడు అంటే బానిస అని.. ఎవడు అన్నాడు నా తల్లి భరతమాతకు నిఖర్సయిన వీరుడు పుట్టలేదని.. ఎవడు అన్నాడురా నా దేశ మహిళల మానాన్ని దోచుకుంటుంటే మోకాళ్ళ మీద కూర్చుని బ్రతిమలాడుతాడని.! అని గర్జిస్తూ బ్రిటీష్ వారి గుండెలపై పిడుగులు పడ్డ భయాన్ని ఒక తెలుగువాడు మొదటిసారి రుచి చూపించారు. ఒక సాధారణ అమాయక పల్లెలో పుట్టి పెరిగినోడు ఏం చేస్తాడని అనుకున్న వాళ్ళకి ఎవరు సాహసించలేని, చూపించలేని ధైర్యాన్ని చూపించి భారతీయ స్వతంత్ర పోరాటంలో ఒక మూర్తిభవించిన సమరయోధునిగా ఎదిగి చిరస్థాయిగా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు.
మనందరికి ఒక అవగాహన ఉంది 1857 నాడు సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర పోరాటం ప్రారంభమైయ్యిందని కాని అంతకు దశాబ్ధం ముందే ఉయ్యాలవాడ గారు బ్రిటీష్ వారిపై దండెత్తి భారతీయుని బలం వీరోచితంగా తెలియజేశారు. మనదేశం కేవలం కర్మభూమి, వేదభూమి మాత్రమే కాదు ఎందరో బీద, అమాయక ప్రజల కోసం ప్రాణత్యాగం చేసే బిడ్డలని కని ధన్య భూమిగా విలసిల్లుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కర్నూలు జిల్లాలో జన్మించారు. పూర్వం రాయలసీమ ప్రాంతంలో 'పాలెగాళ్ళ వ్యవస్థ' ఉండేది. ఉయ్యాలవాడ గారు అదే ప్రాంతంలో పాలెగాళ్ళ వ్యవస్థలో స్థానిక నాయకులుగా ఉండేవారు.
ఒకనాడు తన ప్రాంతంలో వసూలు చేసిన పన్నును అధికారులకు(బ్రిటీష్) అందజేసి తనకు వచ్చే డబ్బును కూడా తీసుకురమ్మని తన కింద పనిచేస్తున్న మరో ఉద్యోగిని ఆదేశించారు. కాని అక్కడ పనిచేస్తున్న తహశిల్దారు మాత్రం చులకనగా మాట్లాడి బ్రటీష్ వారి ముందు ఉద్యోగులు ఉండరు బానిసలే ఉండాలి అని అర్ధం వచ్చేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని కించపరిచేలా దుషించాడు. స్వతహాగ ఆత్మాభిమానం మెండుగా ఉండే ఉయ్యాలవాడ గారికి ఆ మాటలు తనని ఒక ఆయుధంగా తయారుచేశాయి.. నిప్పుల కొలిమి లాంటి మాటలలో ఉయ్యాలవాడ అనే గొడ్డలిని ముంచి, సమ్మెట చీత్కార దెబ్బలతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని "ఓ గండ్ర గొడ్డలి"గా తయారుచేసింది ఆ సంఘటన. ఎప్పుడు దాడి చేస్తానో, ఎలా దాడి చేస్తానే, ఏం దోచుకోబోతున్నానో ముందుగానే బ్రిటీష్ వారికి చెప్పి దమ్ముంటే నన్ను ఆపండ్రా.!! అని తెలియజేసి ఇక అడుగు ఆగేదే లేదు అంటూ 1846 సంవత్సరంలో తన అనుచరులైన 500మంది బోయసైన్యంతో వివిధ బ్రిటీష్ ఖజనాలపై దండెత్తి ఆ దోచుకున్న డబ్బును ఆత్మీయంగా భారతీయులకు పంచిపెట్టారు.
ఈ సంఘటనతో బ్రిటీష్ ప్రభుత్వ తలను ఒక పాలెగాడు ఆయుధం లేకుండానే తెగనరికిట్టుగా నాటి పాలకులు, ప్రజలు భావించారు. ఎలాగైనా వీడిని పట్టుకోని పాతాళంలోకి అణగదొక్కాలని ప్రభుత్వం యుద్దాలలో వాడే ఆయుధాలతో, 10,000 బ్రిటీష్ సైన్యాన్ని రంగంలోకి దించింది. స్వతంత్రం రాక ముందే వంద సంవత్సరాల క్రితమే ఉయ్యాలవాడ గారి ఆచూకి తెలిపినవారికి 1,000 రూపాయల బహుమానం అని ప్రకటించింది. రణరంగంలోకి వచ్చిన సైన్యానికి ధీటుగా బదులు చెప్పినా గాని బ్రిటీష్ వారు చేసిన నీతిమాలిన కుట్రపనులతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని సైన్యం ఆధీనంలోకి తీసుకున్నది. ప్రభుత్వంపై తిరుగుబాటు, అధికారులను హత్యచేసినందుకు గాను కోర్టు ఉరిశిక్ష విధించింది. 1847 ఫిబ్రవరి 22న దాదాపు భారత స్వతంత్రానికి వంద సంవత్సరాల ముందు వేలమంది ప్రజల సమక్షంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఉరితీసింది. "ఈ చావుతో మరో ఉయ్యాలవాడ ఈ సీమలో భయంతో ఉదయించకూడదు అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి తలను కోయిలకుంట్ల కోట ఉరికొయ్యకు 1847 నుండి 1877 వరకు 30 సంవత్సరాల వరకు వేలాడదీశారు".
ఉయ్యాలవాడ గారు వీర మరణం పొంది దాదాపు 170 సంవత్సరాలు కావస్తుంది ఐనా ఇప్పటికి ఈ దేశంలో ఆయన ధైర్యంగా ప్రదర్శించిన దేశభక్తి గాలిలో కలిసిపోయి ఆ గాలి మనల్ని తాకుతూ మనలోనూ స్పూర్తిని రగిలిస్తుంది.. ఆయన శరీరం ఈ మట్టిలో కలిసి ఈ దేశంలో దేశభక్తిని మోస్తుంది.. ఈ నేలపై ఆయన చిందించిన రక్తం నీరులా మారి మనలో దేశభక్తి దాహం తీరుస్తుంది, ఆయన ఆవేశం ఈ దేశ ఉద్యమ కాగడాలలో కలిసి మనకు దారి చూపిస్తుంది. ఆయన బ్రిటీష్ వారిపై తిరగబడితే మనం నేటి అవినీతిపై, అసమర్ధతపై, ప్రజా సమస్యలపై తిరగబడాలి. ఉయ్యాలవాడ లాంటి వీరులకు కృతజ్ఞతలు చెప్పి అక్కడితో వారి పోరాటాన్ని ఆపకూడదు. అప్పుడు బ్రిటీష్ వారు మన విరోధులు ఐతే ఇప్పుడు దేశ సమస్యలే మన బద్ధ శత్రువులు. వారి పోరాట జ్వాలను మనం అందుకుని కొనసాగించాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కథను ఉద్వేగంతో చెప్పుకోవడం మాత్రమే కాదు వారు అందించిన స్పూర్తిని సరిగ్గా అందుకుని ఎందరో చేసిన ప్రాణ త్యాగాలు వృధా కాకుండా చేయాల్సిన బాధ్యత కేవలం భారతీయుల మీద మాత్రమే ఉంది.