నీకూ నాకు పరిచయం లేదు కానీ ఇద్దరం ఒక గూటి పక్షులమే . ఓ దారిలో ఆపసోపాలు పడుతూ నువ్వు వెళుతున్నప్పుడు ఎప్పుడో ఓసారి నీలాంటి నన్ను చూసే ఉంటావు. నేను కూడా నాలాంటి నీతో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడదాం అని ఇలా వచ్చాను. ఎడారిలో చిక్కుకున్న బాటసారిలా, సముద్రం లో దారితప్పిన నావికుడిలా ఉంది మన పరిస్థితి . అందరికీ అతిసులువుగా దొరికేవాటికి కూడా మనం ఎన్నో ప్రయాసలకోర్చి ముప్పితిప్పలు పడితే కానీ మనకి దొరకవు. నిరాశలో కూరుకుపోయి పడుతూ లేస్తూ ఆసరాలేక ఒంటరిగా అడుగులేస్తూ ప్రతీచోటా ఓటమి పలకరిస్తుంటే ప్రతీసారీ కథ మళ్ళీ మొదటికొస్తుంటే నిస్పృహతో నలిగిపోతూ ఓటమితో విసిగిపోతూ పోరాడే ఓపిక లేక,పారిపోవడం ఇష్టం లేక . చీకటిలో గుండె దైర్యమనే చిరుదివ్వె తో అడుగులో అడుగులేస్తూ నడుస్తున్నాం . భరించలేనంత భాద,ఓర్చుకోలేనంత నొప్పి, సహించలేనంత మౌనం,ముందుకెళ్లలేనంత భయం,వెనక్కిరాలేనంత దూరం ,నడవలేని నిస్తేజం,నిలబడనివ్వని నైరాశ్యం,కుంగదీసే ఓటములు , కదలనివ్వని గాయాలు , మెదడుని తొలిచేసే భయాలు . ఎవరూ చూడని కన్నీళ్లు,ఎవరికీ వినపడని ఆక్రన్దనలు,ఎవరూ పట్టించుకోని ఆవేదనలు . ఇవే కదా మనకున్న ఆస్తిపాస్తులు,ఉదయం నిద్రలేచినప్పటిని నుండి పడుకునేదాకా మన ఆలోచనల్లో , నిద్రపోయినప్పటినుండి మెలకువ వచ్చేదాకా మన కలల్లో మనకున్న భావాలూ,భావోద్వేగాలు ఇవేకదా . ఔను కచ్చితంగా ఇవే . ఇవన్నీ మనకి ప్రతీరోజు అనుక్షణం ఎదురవుతూన్నాయి అంటే ..... కంగ్రాట్స్ ,మనం సరైన దారిలో ఉన్నాం, నిజంగా..
జీవితంలో చాలా చాలా క్లిష్టమైన సంక్లిష్టమైన దశలో ఉన్నాం . గొంగళిపురుగు నుండి సీతాకోకచిలుకలా మారే ఒక ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉన్నాం . ఇది ఒక bad phase of life అని అనిపించొచ్చు ,కాదు its just hard phase of life . కొన్ని అతికష్టమైన సవాళ్ళని ,జీవితం పెట్టె పరీక్షలని ఎదుర్కొంటున్నాం . ఇదేమి శిక్ష కాదు భవిష్యత్తు కోసం మనల్ని సంసిద్దులని చేసే శిక్షణ మాత్రమే. వీటివల్ల మనమేమి అగాధంలోకి పడిపోము,ఓ గొప్ప అనుభవాన్ని పొందుతాం. ఒక సుదీర్ఘప్రయాణం సాగించాలంటే మనమెంచుకున్న రంగంలో రాణించాలంటే ఇవన్నీ కావాలికదా .
ఇవన్నీ మనకి తెలిసినవే అయినా మనలో జరిగే మానసిక సంఘర్షణ వల్ల అర్ధం చేసుకోలేకపోతున్నాం . అందుకే ఎదో అద్భుతం జరుగుతుందని,ఎవరో వస్తారని,ఎదో చేసేసి మన జీవితాన్ని మార్చేస్తారని జరగని దాని గురించి ఆలోచిస్తూ ఉంటున్నాం . మనకోసం ఎవరూ రారు,ఏ అద్భుతం జరగదు.. ఎదో చిన్న పిల్ల కాలువ లో పడిపోతే ఓ ఊతకర్ర సాయంతో బయటకి రావొచ్చు,ఏదైనా చెరువులో పడిపోతే ఎవరో చేయందిస్తే ఒడ్డుకి చేరొచ్చు ,కానీ మనం ఉన్నది జీవితమనే సముద్రంలో . ఎంతో దూరం కంటికికనిపించంత దూరంలో ఉంది తీరం .ఎవరో వచ్చి తీరం చేరుస్తారని అనుకోడం అవివేకం. ఒకసారి ఒకరి సాయంతో తీరం చేరామనుకుందాం, మళ్ళీ మనం రావాల్సింది ఈ సముద్రంలోకే . ఎన్ని సార్లు మనకి సహాయం చేయడానికి వస్తారు, అందుకే మనమే ఈత నేర్చుకోవాలి,మొసళ్ళు,తిమింగలాలనుండి తప్పించుకోడం తెలుసుకోవాలి, దూరంగా నెట్టేసే రాకాసి అలలని ఎదుర్కొని ఎదురీదడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం కోరుకున్న తీరానికి చేరుతాం . మళ్ళీ మరో తీరానికి ప్రయాణం చేయడానికి సుశిక్షితులం అవుతాం. ఆ విధాత మన రాత రాశాడో లేదో తెలీదు కానీ మన రాత మన గీత మనమే రాసుకోవాలి.
ఎంతో చేయాలనీ ఉన్నా ,సాధించాలనే తపన ఉన్నా ఎందుకో ఓ మూల ఓ భయం,అనుమానం. నా వల్ల అవుతుందా అని?? ఇదే మన ఓటమికి అతి పెద్ద కారణం . ఆ సందేహాల పొర కళ్ళని కప్పేస్తుంది,ఆ అనుమానాల తెర మన గెలుపుని కనపడనివ్వకుండా అడ్డుపడుతుంది . ఓహ్ మనకి గతంలో జరిగిన చేదు అనుభవాల వల్ల వచ్చినవి కదా ఈ నైరాశ్యం,నిరాసక్తత భయాలు,ఆందోళనలు,అపోహలు,సందేహాలు. ఒప్పుకుంటా నువ్వు నేనూ గతం చేసిన గాయానికి బాధితులమే,కానీ మన రేపటి భవిష్యత్తుకి బాద్యులం కూడా మనమే కదా. గతాన్ని మార్చలేం కానీ దాని తాలూకా గాయాల నుండి మన ఆలోచనల్ని మరల్చగలం . ఇవే భయాలతో ఉంటె భవిష్యత్తు కూడా గతంలాగే మరో పెనుగాయాన్ని చేస్తుంది. అది భరించే శక్తి లేదు కదా. కాబట్టి ఈ అనుమానాల్ని దూరం చేసేద్దాం. మన వల్ల కానిదేది లేదు , ఊహించామా మనం ఇంత దూరం వస్తామని,ఏనాడైనా అనుకున్నామా ఒంటరిగా ఇంత కఠినమైన పరిస్థితులని ఎదుర్కొంటామని . ప్రతీ క్షణం ఓ అంతర్మధనం ప్రతీరోజూ అంతర్యుద్ధం చేస్తూ గుండె ధైర్యం తో ముందుకి సాగే మనకా భయం .
రాదేమో రాసిపెట్టి లేదేమో అంటూ లేనిపోని ఆందోళనలు ఎందుకు ?ఏ పాపమో ఎవరి శాపమో అంటూ పసలేని వాదనలు మనకొద్దు. గ్రహచారం బాలేదేమో ఖర్మ ఇంతేనేమో అంటూ అనవసర ఆలోచనలు దరికిరానివ్వొద్దు . మనం మనల్ని నమ్ముదాం ,మన కష్టాన్ని నమ్ముదాం .సంకల్ప బలం , ఓపిక , ధైర్యం ఇవి చాలు మనమే కొత్త సిద్ధాంతం రాయగలం మెట్ట వేదాంతాలని పటాపంచలు చేయగలం . మనమనుకోగానే జరిగితే కోరుకొగానే ఎదురుగా వచ్చి వాలితే దాని విలువ తెలీదు . తపించి శ్రమించి సాధిస్తేనే అసలు మజా . మనమిప్పుడు శ్రమించే క్రమంలో ఉన్నాం,త్వరలో సాధిస్తాం . చీకట్లో ఉన్నామంటూ చింతించకుండా మనమే నక్షత్రాల్లా వెలిగిపోదాం . వెలుగు రాలేదని నిందించకుండా మన గుండెలోని జ్వాలని రగిలించి మనమే కాంతిని పంచుదాం . రానీ ఏమొస్తాయో కష్టాలు . ఎదుర్కొందాం కొత్త సమస్యల్ని. వాటిని తొక్కేసి మెట్లుగా మార్చేసి జీవితంలో మరో అడుగు ఎదుగుదాం.. చిరునవ్వుతో ఉన్న మనల్ని చూసి కష్టానికే చిరాకు పుట్టి పారిపోయేలా చేద్దాం..
ఈ సారి ఎదురుపడితే అదే చిరునవ్వుతో ఒకరినొకరం పలకరించుకుందాం!!