ఒకసారి సుభాష్ చంద్రబోస్ జర్మనీ నియంత అయిన హిట్లర్ ను కలవడానికి వెళ్ళారు.. కొంతసేపటికి అచ్చం హిట్లర్ రూపంలో ఉన్న ఒక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వచ్చి "ఏమిటి విషయం, ఎందుకు వచ్చావు" అని అడిగాడట.. అప్పుడు సుభాష్ చంద్రబోస్ వెంటనే "నాకు సమయం వేస్ట్ చేయడం నచ్చదు, ముందు నీ బాస్ ను రమ్మను!" అని అన్నాడట. ఇదంతా తెలుసుకున్న హిట్లర్ వచ్చి సుభాష్ భుజం మీద చరిచి "ఎలా ఉన్నావు సుభాష్" అని అడిగాడట. 'బాగానే ఉన్నా', అని భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన విలువైన విషయాలను చర్చించుకున్నారు. ఆ తర్వాత బోస్ వెళ్ళేటప్పుడు హిట్లర్ ఇలా అడిగాడు "ముందు నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదు అని ఎలా తెలుసుకున్నావు"..? దానికి బోస్ "సుభాష్ చంద్రబోస్ భుజాన్ని తట్టే ధైర్యం, శక్తి ఒక అసలైన హిట్లర్ కు తప్ప ఎవ్వరికి లేదు" అని అతని కళ్ళల్లోకి చూస్తూ బదులిచ్చాడట.

ఒక గొప్ప రచయిత చెప్పినట్టు "ఒక మనిషికి ఉంటే కోపం, అదే కోపం ఒక గుంపుకుంటే ఉద్యమం".. అన్నట్టు భారత స్వతంత్ర ఉద్యమానికి కోట్ల మంది తరుపున సుభాష్ చంద్రబోస్ ఒక గన్నుల పోరాడారు. నా దేశ ప్రజలను బానిసలను చేసి కాలి కింద పడేసి తొక్కాలని చూస్తే ఆ కాలిని నరికి వాడికి బుద్ది చెబుతా అని ముందుకు కదిలారు. నా దేశానికి స్వాతంత్రం ఇస్తాను, ఇవ్వను అని చెప్పడానికి ఈ బ్రిటీష్ వారు ఎవరు..? నా దేశాన్ని పాలించడానికి నువ్వు ఎవడివి..? అని హింసాయుత పోరాటాన్ని నడిపి బ్రిటీష్ వారి గుండెలను దడ దడ లాడించి, దేశంలో ఉడుకు రక్తంతో ఉన్న యువతను దేశ సైనికులుగా మలిచి ముందుకు నడిపిన యోధుడు సుభాష్ చంద్రబోస్. ఆవేశంలో ఉన్నవాడికి ఆలోచన తక్కువ అని అంటారు. కాని సుభాష్ చంద్రబోస్ వ్యక్తిత్వం అలా కాదు. తన ఆలోచనలో ఒక ఆవేశం ఉంటుంది.. తన ఆవేశంలో ఒక ఆలోచన ఉంటుంది.. ఈ రెండిటిని రెండు ఆయుధాలుగా చేసుకుని ముందుకు నడిచారు. శాంతియుతంగా పోరాటం చేయడంలో పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు. కాని హింసాయుతంగా పోరాటం చేయలంటే ఎంతో శక్తి అవసరం. ఆ శక్తి సైనిక రూపంలో ఉండాలి, ఆ శక్తి ఆయుధ రూపంలో ఉండాలి, ఆ శక్తి దేశభక్తి రూపంలో ఉండాలి.. ఈ శక్తులన్నీటిని సమర్ధవంతంగా సంఘటితం చేసి సమరమా, శరణమా అనేంత స్థాయికి స్వాతంత్ర పోరాటాన్ని తీసుకువచ్చారు.


నాటి భారతదేశం బ్రిటీష్ వారి పాలనలో ఉండడం వల్ల భారతీయులకు బ్రిటీష్ వారిని యుద్ధ రూపంలో ఎదుర్కునేంతటి స్థాయికి ఎదగలేదు. కాని సుభాష్ చంద్రబోస్ మాత్రం అప్పటికి సైనిక, ఆయుధ శక్తి అధికంగా ఉన్న దేశాలైన రష్యా, జర్మనీ, జపాన్ వంటి దేశాలలో పర్యటించి భారతదేశంపై బ్రిటీష్ వారి అకృత్యాలను వివరించి వారి సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, దేశ యువతతో బ్రిటీష్ వారిపై యుద్ధానికి భారత సైన్యాన్ని ఏర్పాటుచేసిన శక్తివంతమైన నాయకుడు బోస్. బోస్ చిన్నతనం నుండి చదువులో ఉన్నత స్థాయిలో ఉండేవారు. దేశంలోని ఉన్నత కాలేజీలతో పాటు, ఘనత వహించిన క్రేం బ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా విద్యను అభ్యసించారు.. కాని తన తదుపరి లక్ష్యం ఉద్యోగం, సంపాదన అని స్వార్ధంగా కాకుండా దేశ స్వాతంత్రం, దేశ ప్రజల అభ్యున్నతే ముఖ్యం అంటూ దేశ స్వతంత్ర పోరాటంలో ఎప్పటికి తలవంచని ఒక ఉక్కు పిడికిలిగా కదిలారు.


స్వతంత్రం కోసమే స్థాపించబడ్డ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కూడా తను బాధ్యతలు నిర్వహించారు. ముందు మహత్మ గాంధీ గారి ఆలోచనలతో ఏకిభవించినా కాని తర్వాత హింసాయుత మార్గంలోనే స్వతంత్రం సిద్దిస్తుందని ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని, ఆ తర్వాత కొన్ని దేశాల సహకారంతో బ్రిటీష్ వారిని తరిమికొట్టేందుకు "ఆజాద్ హింద్ పౌజ్" ను స్థాపించి భారత దేశం అంటే కేవలం శాంతియుత పోరాటం మాత్రమే కాదు హింసాయుత యుద్ధం కూడా సమర్ధవంతంగా చేయగలరని నిరూపించారు. నిజానికి సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో కనుమరుగు కాకపోయేదుంటే సుభాష్ చంద్రబోస్ ఆద్వర్యంలో 1947 కన్నా ముందే దేశానికి స్వాతంత్రం వచ్చేదని ఒక చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఎవరి దారులు వేరైనా గాని అంతిమ లక్ష్యం భారత స్వేచ్చనే.. గాంధీ గారు ఒక మార్గాన్ని ఎంచుకుంటే బోస్ గారు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. "మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను" అని నినదించి ఆయన నడిచిన దారి, ఆయన సైనిక కవాతు శబ్ధంతో బ్రిటీష్ రాజ్యాన్ని వణికించారు.!



Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.