సుకుమార్ - మన తరం బాలచందర్!!

Updated on
సుకుమార్ - మన తరం బాలచందర్!!
(Special Column by Siddhu Manchikanti) డబ్భై ఆరు సంవత్సరాల క్రితం తంజావూరు జిల్లా లోని నల్లమాగుండి గ్రామం లో ఎనిమిది సంవత్సరాల కుర్రాడికి నాటకాలు అంటే పిచ్చి. ఊరి అరుగు మధ్యలో రోజూ క్రమం తప్పకుండా అతను నాటకం చూడడం అంతకంటే క్రమం తప్పకుండా ఆయన తండ్రి అతన్ని ఇంటికి తీసుకుపోయి నాటకం చూస్తున్నందుకు గాను చితకోట్టడం పరిపాటి. అయితే అప్పట్లో పరిచయం అయిన నాటకం ఆ కుర్రాడికి చాలా సంవత్సరాల తరవాత తొమ్మిది జాతీయ బహుబతులూ, 13 ఫిలిం ఫేర్ లూ, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, కలైమామణి లాంటి పలు ఉన్నత అవార్డులని తన కాళ్ళ దగ్గరకి తెచ్చిపెట్టింది. ఆ మహావ్యక్తి పేరు బాలచందర్ .ఆయన్ని ఆఖరి నిమిషం వరకూ నడిపించిన 'ఊతం' పేరు 'నాటకం'. సాధారణ సినిమాలకీ - నాటకాలకీ చాలా తేడా ఉంటుంది, నేటి తరానికి అది అర్ధం కాకపోవచ్చు. నాటకం ఎప్పుడూ వాస్తవికత నుంచి పుడుతుంది, నిజం చేతిలో పెరుగుతుంది , నగ్నసత్యాన్ని చాటుతూ తన రుచిని మరిపిస్తుంది. ప్రతీ ఒక్క పాత్రనీ కాచి వడబోసిన తత్వవేత్త బాలచందర్. నాటకాల నుంచి సినిమాల వైపు అనేకానేకులు వచ్చారు, సినిమా సముద్రంలో కొట్టుకుపోయిన జనాలు తప్ప నాటకాన్ని తెరమీదకి తేగలిగిన వారు ఒక్కరంటే ఒక్కరు మచ్చుకకు కూడా సినిమా రంగంలో కనపడరు, కానీ బాలచందర్ మాత్రం ఒక జీవితకాలం పాటు వెండితెర మీద నాటకాన్ని ఆవిష్కరించి నాటకం లోని తీపినీ, నొప్పినీ థియేటర్ లలో పరిచయం చేసారు. అది అందమైన నొప్పి తీయనైన బాధ, తన చుట్టూ చూస్తున్న సమాజాన్ని - తనను రోజూ చుట్టుముడుతున్న సమాజాన్నీ రెండింటినీ ప్రేక్షకుడు బేరీజు వేసుకోవడానికి బాలచందర్ సినిమాలు అద్భుత వారధులుగా నిలిచాయి. Incumbency ని క్లుప్తంగా కుదించిన నేలబారు రచయిత ఆయినా, మట్టిబోమ్మలైన మన కథల్ని మనకే తెరమీద చూపించి ఇదిరా మీరు అని ప్రభోదించిన యహోవా ఆయన. ఆయన స్థాయిని ప్రశ్నించే ఉద్దేశ్యం లేనే లేదు కానీ ఆ పోలికలలకి దగ్గరగా ఉన్న వారిని ఖచ్చితంగా గుర్తుంచడం కోసమే ఈ కాలమ్ . శ్రీ శ్రీ ని అడ్డం పెట్టుకుని మధ్యతరగతి కక్కుర్తి ని ఎండగట్టినా(ఆకలి రాజ్యం) , రోడ్డున పోయే 'ఆసక్తికర' ఆడదాని జీవితం లో తొంగి చూడాలి అన్నా (ఇది కథ కాదు) , ప్రేమకి చావు లేదని దాని తీరు తెన్నులని మార్చడం ప్రపంచానికి చేతకాదు అని చాటి చెప్పినా (మరో చరిత్ర) అది బాలచందర్ కే చెందింది. వీటిల్లో బోల్డ్ గా రాసుకున్న కథలు బాలచందర్ తీసుకున్నారు దానికి కావాల్సింది డబ్బు కాదు దమ్ము. తాను చెప్పదలచుకున్న 'నిజాన్ని' చెప్పడానికి అనేక ఒత్తిడుల మధ్యలో దర్శకుడు ఎంత బాగా చెప్పాడు అనేదాంట్లో అతని ప్రతిభ దాగి ఉంటుంది. బాలచందర్ కి అలాంటి 'పచ్చి నిజాలు' చెప్పడం నల్లేరు మీద నడకే .. అలాంటి 'పచ్చి నిజాల' కోవలో తెలుగు సినిమాలో సుకుమార్ ని ఆయనతో పోలిస్తే తప్పులేదు అనిపిస్తుంది. బోల్డ్ గా ఎలాంటి విషయాన్నైనా చెప్పగల సత్తా ఈ దర్శకుడి సొంతం. నువ్వు ఎవరినైనా ప్రేమించు నేను నిన్నే ప్రేమిస్తాను అంటూ ఆర్యా నుంచి మొదలైన అతని రచన కుమారీ దగ్గర వరకూ వచ్చేసింది. " నేను మనిషిని మృగ స్వభావం కలవాడుగా అనుకుంటా, శతాబ్దాల శతాబ్దాల నుంచీ వేటాడడానికీ .. వేటాడింది ఎవరికీ అందకుండా అనుభవించడానికీ ఆ స్వభావాన్ని(మృగ) ఉపయోగించాడు మనిషి .. మృగ స్వభావం లాంటిదే సెక్స్ చెయ్యాలనే తపన కూడా .. అది ఊరకనే చేసేది కాదు కనక ఎదిగిన యుగం లో బుర్ర ఉపయోగించే మనిషి గా రూపాంతరం చెందిన తరవాత 'ప్రేమ' అనే వస్తువుని సృష్టించాడు అతను" అని ప్రేమ గురించి చెప్తాడు సుకుమార్. ఇంతకంటే ప్రేమ గురించి పచ్చిగా , మొఖానికి కొట్టినట్టు డిఫైన్ చెయ్యడం సాధ్యమయ్యే పనేనా ?? ఇక్కడే ఆయన బోల్డ్ తనం కనిపిస్తోంది , పెదాల మాటున ఉన్న ప్రేమని మాటల్లో చెప్పడం కంటే ప్రేమని ప్రతీ పనిలో వ్యక్త పరిచి ప్రేమించిన వారిని ప్రాణంగా చూసుకోవలనేది సుకుమార్ పాలసీ కావచ్చు. ఎందుకంటే ఆయన సృష్టించిన పాత్రలు అన్నీ ఈ లాజిక్ మీదనే నడుస్తూ ఉంటాయి. ఆయన ప్రతీ సినిమాలో పాత్రల్ని మధురిమ మైన రీతిలో తరచి చూసి వాటి 'లోతు' ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి చాలా విషయాలు బయటపడతాయి. ఆయన డిఫరెంట్ సినిమాలు తీస్తాడా , రొటీన్ సినిమాలు తీస్తాడా అనేది కాదు ఇక్కడ సమస్య. వినూత్నంగా ఉండే సినిమాలు చాలా మందే తీస్తారు కానీ , సుకుమార్ ఎంచుకున్న కథాంశాలని ఎంచుకోగలిగిన దర్శకులు, రచయితలూ మచ్చుకకు కూడా మనకి కనిపించరు. దానికి సాక్ష్యం అతని తాజా చిత్రం కుమారీ 21 ఎఫ్ లోని ఆఖరి ఇరవై నిమిషాలు. ఒక లెటర్ తో హీరో మనసులోని వేదన తో పాటు మన బుర్ర లో మారుమూల ఇరుక్కుపోయిన శృతి తప్పిన తరంగాల్నీ .. ఒక్క తన్ను తన్నేసాడు సుకుమార్. నిజం చెబితే తట్టుకోలేని మనకి చెంప చళ్ళు మనిపించాడు దానికి అతను తీసుకున్న సమయం కేవలం మూడు నిమిషాలు (ఆ లెటర్ సీన్) .. మాట్లాడుకోవడానికి కూడా భయపడే విషయాల్ని తెరమీద ఆవిష్కరించడంలో బాలచందర్ కీ సుకుమార్ కీ పోలిక ఖచ్చితంగా పడుతుంది. చాన్నాళ్ళ తరవాత అంత చక్కగా నిజాన్ని చెప్పగల ఒక దర్శకుడిని తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. బాలచందర్ తో సుకుమార్ ని పోల్చి ఆయన స్థాయిని దించడమో ఈయన స్థాయిని పెంచడమో కాదు ఇక్కడి విశేషం .. బాలచందర్ అనే మహా దర్శక తత్వవేత్త చనిపోయిన సరిగ్గా సంవత్సరానికి ఆయన లాంటి కళాత్మకమైన, సామాన్య, పల్చటి కథాంశాలని ఎన్నుకుని వాటిని తెరమీద తనకి ఉన్న పరిమితిని దాటి విసృతి పెంచుకుని ప్రతీ ఫ్రేం లోనూ నిలబెడుతూ తనదైన సంతకం చేసే వ్యక్తి దొరికాడు అని పొంగిపోవడం మాత్రమే . ఎట్ లీస్ట్ సుకుమార్ రాసే గట్సీ , బోల్డ్ రచనలు బాలచందర్ ని గుర్తు చేస్తాయి అనడం అతిశయోక్తి కాదేమో అందుకే అంత ఆసక్తికరంగా టైటిల్ కూడా పెట్టాల్సి వచ్చింది .. ఒక జీవితం పాటు, కళ్ళముందు జరిగే పచ్చి నిజాలని ప్రతి సృష్టించిన బాలచందర్ కి ఒడుపు కథ, నాటకం చిన్ననాటి నుంచీ కలిసి వచ్చిన పెట్టుబడి , వ్యూహం కథనం .. అచ్చం కాకపోయినా సుకుమార్ కీ అంతే .. అయితే వారిద్దరి ధోరణిలు వేరు , భాషలు వేరు , ప్రేక్షకులు దాదాపుగా ఒకటే .. ఎటొచ్చీ ఇద్దరూ ఆక్రమించుకున్న ఆకాశం ఒకేలా ఉంటుంది.