కొన్ని కుక్కల దాడిలో గాయాలపాలైన కోతి.. సంక్రాంతి గాలిపటాల మంజ రెక్కలకు చుట్టుకోవడం వల్ల గాయాల పాలైన ఓ రామచిలుక.. వేగంగా వెళ్తున్న బస్సు ఢీకొనడం వల్ల తీవ్ర ప్రమాదానికి లోనయైన ఓ లేగదూడ.. వీటి తర్వాతి వాక్యం "ప్రమాదానికి గురైన వెంటనే సుమ గారు సంఘటన స్థలానికి చేరుకుని వైద్యం చెయ్యడం వల్ల జంతువు బ్రతికగలిగింది".

ఆ మధ్య సుమారు నలభై అడుగుల లోతు బావిలో ప్రమాదవశాత్తు ఓ నక్క పడిపోయింది. బయటకు వచ్చే మార్గానికై తపించి, ప్రయత్నించి అందులోనే ఉండిపోయింది. ప్రజలు తాగడానికి ఏర్పాటుచేసుకున్న బావి అది. అడవి జంతువు కావడంతో ఎలా ప్రవర్తిస్తుందోనన్న భయంతో ఎవ్వరూ దానిని బయటకు తియ్యడానికి సాహసించలేదు. ఇది తెలిసిన సుమ గారు 42 అడుగుల లోతు బావిలోకి దిగి అప్పటికే చనిపోయిన నక్కను బయటకు తీశారు. ఇలాంటి వీరోచితమైన సాహసాలు సుమగారి ప్రస్థానంలో ఎన్నో ఎన్నెన్నో..

ఈ భూమి మీద మనిషితో పాటు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతి ఒక్క జీవికీ ఉందని మహ్మద్ సుమ గారి అభిప్రాయం. తన అభిప్రాయాన్ని చెప్పడం వరకే ఆగిపోలేదు. 1962 నెంబర్ కు లేదంటే తన పర్సనల్ నెంబర్ 99899 99786కు కాల్ చేసినా వెంటనే వచ్చి ఆపదలో ఉన్న జంతువులను రక్షిస్తారు.

ఓ చిన్ని పాఠం: మహబూబాబాద్ జిల్లాకు చెందిన సుమ గారికి చిన్నతనం నుండి ప్రతి ప్రాణి పట్ల ప్రేమ, అనురాగాలను కలిగి ఉండేవారు. ఓ రోజు క్లాస్ లో టీచర్ పాఠం చెబుతూ "ఒక్క ప్రాణి అంతరించినా జీవ వైవిధ్య గొలుసుకట్టు తెగిపోయి చివరకు మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది" అనే వాక్యం ఎప్పుడైతే విన్నారో మనసులో నుండి ఆలోచనలు చేతల రూపంలోకి పరిణమిల్లాయి.


ప్రతి జీవిపై: మనుషులం పేర్లు పెట్టాము జంతువులకు. ఒక జంతువు ఎక్కువ తక్కువ అని, లేదంటే వాటి వ్యక్తిత్వ సభావాల ద్వారా అవి మనతో ప్రవర్తించే తీరును బట్టి చాలామంది ప్రతి స్పందన అలాగే ఉంటుంది. సుమ గారు కాస్త భిన్నం ఎంతంటే ఒక నెమలి పట్ల ఎలా ప్రవర్తిస్తారో గాయాలపాలైన గుడ్లగూబ పట్ల అలాగే ప్రవర్తిస్తారు. నల్లని కాకిని ఎలా చూస్తారో పచ్చని రామ చిలుకను అదే విధంగా పలుకరిస్తారు. వేసవి విజృంభించుతుంది. ప్రకృతి వనరులను మిగిలినవాటికి అందకుండా దోచుకునే మనకే నీటి ఇబ్బందులు ఎక్కువ ఇంకా పక్షులు ఇతర జీవుల పరిస్థితి వర్ణనాతీతం. దీనిని ముందుగానే పసిగట్టి సుమ గారు ప్రత్యేకంగా మూడు వేల మట్టి చిప్పలను(చిప్పలో నీళ్లు చల్లగా ఉంటాయని) కొని విరివిగా ఉచితంగా అందరికి పంపిణీ చేసి ప్రతిరోజు చిప్ప నీటితో నిండుగా ఉండాలని వాగ్ధానం కూడా చేయించుకున్నారు.

పన్నెండేళ్ల నుండి: సుమ గారు మూగ జీవాల రక్షణ కోసం "నేను సైతం" పేరుతో ఓ ఎన్.జి.ఓ ను ప్రారంభించారు. మహబూబాబాద్ పరిధిలో ఎక్కడ ఏ జంతువులకు ఆపద కలిగినా మానవత్వం నిండిన మనుషులు తనకు కాల్ చేస్తే వెంటనే అక్కడికి చేరుకుంటారు. పన్నెండేళ్ల ఈ ప్రయాణంలో అమ్మ నాన్నలు, స్నేహితుల సహకారం మరువలేనిది. ఇంటి వెనుక ఆవరణలో ప్రత్యేకంగా గాయపడిన ముగజీవాల సేవ కోసం ఓ షెడ్ ఏర్పాటుచేసుకున్నారు. అమ్మ నాన్న కూడా వాటికి ఆహారం, మంచినీళ్లు అందించి తదితర బాధ్యతలను నిర్వర్తిస్తారు.
