మిగిలిన పిల్లలందరూ ఇంజినీర్లుగా క్యాప్ పెట్టుకోవాలని, డాక్టర్లుగా ఆప్రాన్ వేసుకోవాలి అని కలలుకంటుంటే సుమతి గారు మాత్రం పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని కలలు కన్నారు. చిన్నతనం నుండి బలమైన కాంక్ష ఉండడంతో ఈ ప్రకృతి సుమతి గారికి అనుకూలంగా ప్రపంచాన్ని మార్చింది. ముందు కానిస్టేబుల్ గా, తర్వాత హెడ్ కానిస్టేబుల్ గా, ఏఎస్ ఐ గా, ప్రస్తుతం తిరుపతిలో మొదటి షీ టీమ్ కన్వీనర్ గా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.
ఓసారి తిరుపతి రైల్వే స్టేషన్ లో సుమారు 30సంవత్సరాల వయసున్న మహిళ తన ఇద్దరి పిల్లలతో సహా చంపుకోవడానికి రైలు పట్టాల మీద తల పెట్టింది. "నేను ఛస్తే నా శవాన్ని కుక్కలు కూడా ముట్టవు" అనుకున్న తనని సుమతి గారు ఇంకా టీం చేరదీసింది. మరే ఇతర చోట్ల కాకుండా తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి అన్ని వివరాలు కనుక్కుని భర్తను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తన ప్రాణాన్ని మాత్రమే కాదు జీవితాన్ని కూడా నిలబెట్టిన గొప్ప మానవతావాది సుమతి గారు.
ఇవి తన వ్యక్తిత్వానికి ఒక్క ఉదాహరణ మాత్రమే. షీ టీం కన్వీనర్ గా రెండు సంవత్సరాల కెరీర్ లో ఇప్పటికి 30 బాల్య వివాహాలు ఆపి, 70 వరకు ఈవ్ టీజింగ్ కేసుల ద్వారా మహిళలకు రక్షణ కల్పించారు. పోలీస్ ఆఫీసర్ గా కేవలం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటే మనం ఈరోజు ఇలా మాట్లాడుకునే వాళ్ళమే కాదు. సుమతి గారి జీవిత లక్ష్యం పోలీస్ అవ్వడం కాదు మహిళల జీవితాలను మార్చడం ఈ ప్రయాణంలోనే "పోలీస్" అనే ఉద్యోగం మరో ఆయుధంలా తనకు అందింది. స్కూల్స్, కాలేజీలకు వెళ్ళి వేదింపులను ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు మారాలంటే చదువు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అన్ని రకాల విషయాలపై ఓ సోదరిలా వారిలో స్పూర్తిని నింపుతుంటారు.
చదువుకున్న మహిళలు కానివ్వండి, గ్రామాలలో ఉంటున్న మహిళలు కానివ్వండి ఇప్పటికి మహిళల మీద ఓ చిన్నచూపు ఉంది. గర్భంలో పిండదశలో ఉన్నప్పటి నుండి శ్మశానంలో కట్టె కాలేంత వరకు ఆ వివక్ష కనిపిస్తూనే ఉంటుంది. మాటల్లో సభల్లో హీరోయిక్ గా స్పీచ్ లు ఇచ్చి ఇంటికొచ్చే సరికి అమ్మను, సోదరిని, భార్యను చిన్నచూపు చూసే ప్రబుద్దులు ఉన్న ఈ కాలంలో నిజాయితీగా పోరాడితే తప్ప సమస్యను రూపుమాపలెం.