Contributed By Doli Veera Durga
తేదీ: 24/08/1500 బి.సి, స్థలం: మానవ ప్రపంచం.
To The మనుష్య జాతి, భూ గ్రహం. Subject: (నేను గత వందల సంవత్సరాలుగా మిమ్మల్ని కోరుకుంటున్న గుర్తింపు సాధనకై విన్నపము).
ఆదివారం అని పిలవబడే నన్ను అందరూ కేవలం క్యాలెండర్లో, ఒక డేట్ లా, వారంలో ఒక రోజులా చూస్తారే తప్ప, నా మనోభావాలను గుర్తించి, వాటికి విలువ ఇచ్చి గౌరవించరు. అయినా సరే నా బాధను దిగమింగి, అందరి జీవితాలలో ఆనందపు వెలుగులు నింపడానికి వస్తూనే ఉంటాను.
మిగతా పండుగలన్నీ సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి, కానీ నేను మాత్రం ప్రతీ, వారానికి ఒకసారి, నెలకి నాలుగు సార్లు, సంవత్సరానికి 50 సార్లు వచ్చే “వారం వారీ పండుగ”ను. మిగతా అన్ని వారాలలో రోజువారీ జీవితాన్ని గడిపే ఉద్యోగులు, వ్యాపారస్తులు, వృద్దులు, గృహిణులు, పిల్లలు అంతా నా రోజు మాత్రం తమ బరువు బాధ్యతల నుండి తాత్కాలిక విరామం పొంది, సంతోషంగా గడపడం ద్వారా తమ తమ బాధల నుండి ఉపశమనం పొందుతారు. నా గురించి నేను చెప్పు కోవడం అతిశయం అనిపించినా, మీరు నన్ను గుర్తించాలనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్నాను:
అమ్మని ప్రేమించని వాడు, ఆదివారాన్ని అభిమానించని వాడూ, ఎవడు, వాడెవడు..?! నేను వారానికొక రోజు, కానీ మెదిలెను మదిలో ప్రతిరోజు ! నేనొస్తే.. కోళ్లకు, మేకలకు గుండెదడ, పారిస్తారు కుర్రకారు, బీరుల వరద! కూరగాయలకు ఆకుకూరలకు పని ఉండదు ఈ రోజు, చుక్కా, ముక్కా, కావాలంటారు నా రోజు ! ఖాళీ ఉండవు పార్కులు, సినిమాహాలులు ఖాళీ అవుతాయి మగవారి జేబులు, జీతాలు ! చుట్టాలు చుట్టుపక్కలవాళ్లు వచ్చేది, బంధాలు బంధుత్వాలు పెంచేది ఈరోజే, నా రోజే ! అయినవాళ్లతో ఆత్మీయంగా, అనుకున్న వారితో సంతోషంగా, గడపడానికి తోడ్పడే అమృతవర్షిని ఆదివారం ! పని భూతంతో పెను యుద్ధం జరిపి ,సెలవనే విజయ పతాకాన్ని ఎగరేసే, వీర సైనికుడు ఆదివారం ! కులమేదైనా మతమేదైనా అందరికీ పండగే ప్రాంతం మారినా, భాష వేరైనా అందరికీ సెలవే ! ప్రేయసికోసం ప్రేమికుడు పడే, విరహ వేదనకు వీడ్కోలు ఆదివారం, ఎదురు చూసే ఆనందాన్నీ ఆహ్లాదాన్ని మోసుకొచ్చేదీ ఆదివారం ! దేశ భాషలందు తెలుగు లెస్స, ఏడు వారములందు ఆదివారం హైలెస్సా..! చుక్కల్లో చంద్రుడు, వారాల్లో ఆదివారం రెండూ ఒక్కటే, ఒక్కొక్కటే !
ఆదివారం/Sunday/रविवार - na మనసులోని కోరికలు :
1. పండ్లలో మామిడిపండు, కూరగాయలలో వంకాయ లాగా, వారాలలో నన్ను రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేయాలి.
2. ఫాదర్స్ డే, మే డే, యూత్ డే లాగా నాకు కూడా “బిగ్ సండే” అని పేరు పెట్టి సంవత్సరంలో ఒక తేదీని నిర్ణయించి, అంతర్జాతీయంగా నా ఖ్యాతిని పెంపొందించాలి.
3. వారంలో నాకు ఒక రోజు చోటు చాలదు, సండే1, సండే2 అని ఏడు రోజులలో రెండు రోజులు నాకు స్థానం పొడిగించాలి.
4. ఆదివారం అనే ప్రత్యేక మతాన్ని స్థాపించి, i. ఎన్ని బాధలున్నా హాయిగా నవ్వాలి, లాంటి కొన్ని కట్టుబాట్లను, ii. అన్ని ఒత్తిడులను బుర్ర నుండి పారద్రోలాలి లాంటి కొన్ని ఆచార వ్యవహారాలను, సృష్టించి నియమ నిష్ఠలతో పాటించాలి.
మానవ జాతి, నా ఈ చిన్న చిన్న కోరికలను మన్నిస్తుందనే ఆశ తో సెలవు..
Thanking you. ఇట్లు మీ విదేయురాలు, ఆదివారం(Sunday). from: Sunday H.no: ఆదివారం మనస్సు, state: ఆదివారం కన్నీరు. pincode: ఆదివారానికి గుర్తింపు.