మిగితా దేశాలలో ఎక్కువగా టూరిస్ట్ ప్రాంతాలలో హిస్టరీకి సంబంధించినవి ఉంటే మనదేశంలో మాత్రం భగవంతునికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. భారతదేశాన్ని కర్మ భూమిగా, వేద భూమిగా కీర్తిస్తారు. అలాంటి మనదేశంలోని కాశి నుండి కన్యాకుమారి వరకు ఉన్న అతి గొప్ప పుణ్య క్షేత్రాలన్ని ఒకే చోట నమునాగా దర్శనమిచ్చే ప్రదేశం సురేంద్రపురి. హైదరాబాద్ నుండి 60కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహా దేవాలయానికి సుమారు 2కిలోమీటర్ల దూరంలో ఈ సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం ఉంది. ఈ సురేంద్రపురిని నిర్మించడానికి దాదాపు 10సంవత్సరాలకు పైగా శ్రమించారు.
సాధారణంగా ప్రతి క్షేత్రానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నా గాని దేశంలోని ఆలయాలను దర్శించడానికి తీర్ధయాత్రలు చేసుకోవాలంటే చాలా సమయం, డబ్బు ఖర్చవుతుంది. అన్ని గొప్ప ప్రదేశాలు ఇంతకుముందే చూసినా, ఒకవేళ చూడకపోయినా గాని సురేంద్రపురి కళాధామంలోని శిల్పాలను చూస్తే అదే భక్తి భావన మనలో కలుగుతుంది. ఇక్కడున్న నామునా దేవాలయాలు కాశి, హరిద్వార్, అమర్ నాథ్, కేధర్ నాథ్, అమృత్ సర్ స్వర్ణ దేవాలయం, కలకత్తా కాళి, తులజ భవాని, శబరిమల అయ్యప్ప, శిరిడి సాయి, కర్నాటక శృంగేరి శారదాంబ జగద్గురు ఆది శంకరాచార్యులు, శ్రీ మంజునాథ, తమిళనాడు అండాల్ స్వామి, విశాఖపట్నం కనకమహాలక్ష్మి, తిరుపతి శ్రీనివాసుడు, సింహాచల వరాహ నరసింహా స్వామి, శ్రీకాలహస్తీశ్వరుడు, మేడారం సమ్మక్క సారలమ్మ, ఇంకా క్షీరసాగర మధనం, పద్మవ్యూహం, వైకుంఠం, మహాభారత యుద్ధం, శ్రీ కృష్ణుని గీతా సందేశ శిల్పాలు ఇంకా మరెన్నో పురాణ శిల్ప నామునాలు సురేంద్రపురి కళాధామం సొంతం.