సూర్యారావు గారు ఇప్పటికి తన సొంత డబ్బుతో 7,000 మంది పిల్లలను చదివించారు.. ఇంకా చదివిస్తున్నారు. ఇదంతా అతని సంతోషం కోసం చేయడం లేదు ఒక ఉపాధ్యాయునిగా ఇది తన కనీస బాధ్యత అని చేస్తున్నారు. అవును బ్రిటీష్ వారి రాక వల్ల "విద్య" బిజినెస్ స్థాయికి దిగజారిపోయింది. అలాంటి ఈ గంజాయి వనంలో తులసి మొక్కలాంటి వారు సూర్యారావు గారు.
ఈ మాస్టారు వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉంటుందంటే స్టూడెంట్స్ కోసం పాఠశాల వరకే కాకుండా వారి ఇంటి వరకూ వెళ్ళి తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితులను తెలుసుకుని సహాయం చేస్తుంటారు. అలా ఇప్పటి వరకు వారికున్న 60 ఎకరాల భూమినీ ధారపోశారు. ఎప్పుడో చిన్నతనంలో మంచి విద్యా బుద్దులు నేర్పిన గురువులనే దేవుడిగా గౌరవించుకుంటే మరి ఇలాంటివారిని ఎలా గౌరవించుకోగలం.. అసలు అది సాధ్యమేనా..
ఏలూరు సీ.ఆర్. రెడ్డి కాలేజీ నుండే తన సేవా ప్రస్థానం మొదలయ్యింది. ఆర్ధికంగా ఒక కుటుంబం వెనుకబడి ఉంటే, కనీసం ఎగ్జామ్ ఫీజీలు, కొనలేని పరిస్థితి ఉంటే ఆ ఒత్తిడి విద్యార్ధి మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. "మీ ఫీజులు నేను కడతాను, మీ ఇతర అవసరాలను నేను తీరుస్తాను, మీరు ప్రశాంతంగా చదువుకోండి" అని పేద, మధ్య తరగతి విద్యార్ధులకు భరోసా ఇచ్చేవారు. ఇంత ప్రేమతో తన సర్వస్వాన్ని విద్యార్ధులకు ధారపోస్తే అది నిరూపయోగం అవుతుందా.. ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, టీచర్లుగా ఇలా ఎంతోమంది విద్యార్ధులను తన అభయ హస్తంతో మలిచారు.
ఇంతవరకు తమ పిల్లల చదువుకోసమే అప్పులు చేసినవారిని చూశాం కాని సూర్యారావు గారు మాత్రం తన దగ్గర చదువుకుంటున్న పిల్లల కోసం అప్పులు చేశారు. ఇంటిని తాకట్టు పెట్టారు. నెల్లూరు సీఆర్‌రెడ్డి హస్టల్ నిర్వహణ కష్టమవ్వడంతో నాడు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు విద్యార్ధులు. ఈ పరిస్థితి సుర్యారావు గారిని ఎంతో కలిచివేసింది. హాస్టల్ బాధ్యతను తానే తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో జాయిన్ అయ్యారు ఆ సంఖ్య 40 నుంచి 1200 మందికి చేరింది. చాలామంది విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా ఇంట్లోనే వసతి కల్పించారు. ఇంట్లోనే చిన్నపాటి పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల చదువు పూర్తైన వెంటనే ఉద్యోగాలు వచ్చేవి.
ప్రస్తుతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎమ్.ఎల్.సి గా కొనసాగుతున్న సూర్యారావు గారు పదవి కాంక్ష వల్ల ఈ పదవిని అలంకరించలేదు, ఎమ్.ఎల్.సి పదవి వల్ల ప్రతి నెల రెండు లక్షల జీతం వస్తుంది. ఆ.ఎస్.ఆర్ అనే ఫౌండేషన్ ను స్థాపించి విద్యార్ధులకు దాతలకు ఓ వేదికను ఏర్పాటుచేశారు. ఈ జీతంతో మరింత మందికి సహాయం చేసే అవకాశం లభిస్తుందని తప్ప మరో ఉద్దేశం వారిలో ఏమాత్రమూ లేదు.