"మీ ఇంటికి మరుగుదొడ్డి లేకుంటే రేషన్ కార్డ్, పెన్షన్ కార్డ్ తొలగించాల్సి ఉంటుంది".. ఇది మెదక్ జిల్లా కలెక్టర్ భారతి గారు మొండిగా వ్యవహరిస్తున్న గ్రామస్థులపై వ్యవహరించిన తీరు. ఈ మాటలు విన్నాక భారతి గారు ఇంత కటువుగా వ్యవహరిస్తున్నారు అని అనుకునేరు ఇక ఎంత చెప్పినా వినకపోయే సరికి ఆఖరి అస్త్రంగా దీనిని ప్రయోగించారు. అంతే కదా ఎవరికి ఎలా చెబితే అలా అర్ధమవుతుంది. ఒక్క నవంబర్ లోనే రోజుకు సుమారు వెయ్యి చొప్పున 27,000 వేలకు పైగా మరుగుదొడ్లను నిర్మించి కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డును అందుకున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు వారు సాగించిన ఉద్యమం ఏ స్థాయిలో ఉందో అని..
మెదక్ జిల్లాను మెతుకు సీమ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలామంది వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తుంటారు. ఇక్కడి గ్రామాలలో దాదాపు 57,000కు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరగాల్సి ఉంది. వీటిని నిర్మిస్తే మెదక్ జిల్లాలో 100% ప్రతి ఇంటికి ఒక వాష్ రూమ్ ఉందని డిక్లేర్ చేయవచ్చు. నిజమైన అధికారులు పనిని ఇతరులకు అప్పగించరు తామే రంగంలోకి దిగి పూర్తిచేసేలా కృషి చేస్తారు. అలా కలెక్టర్ భారతి గారు అధికారులతో కలిసి మెదక్ గ్రామాలను సందర్శించి గ్రామస్తులకు పరిస్థితిని వివరించారు. బహిరంగంగా చేయడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అనే కాకుండా క్రమశిక్షణ, పరిశుభ్రత మన జీవితాలను అంతర్లీనంగా ఎలా ప్రభావితం చేస్తాయి అనే వాటిపై గ్రామస్తులకు అవగాహన అందించారు. మొదట్లో చాలామంది రకరకాలుగా వ్యతిరేకించినా కాని తర్వాత నిర్మాణానికి అంగీకరించారు.
కేవలం వాష్ రూమ్ కట్టిస్తే తమ లక్ష్యం నెరవేరుతుంది అని అంతటితో ఆగిపోలేదు భారతి గారు. హైదరాబాద్ ఐఐటి విద్యార్ధులతో గ్రామాలలో ఇతర అవసరమైన సౌకర్యాల గురించి ప్రత్యేకంగా సర్వేచేయించారు. ఇందుకు అనుగూనంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, వర్మీ కంపోస్ట్, డంప్ యార్డ్ లాంటి అవసరాలను అందించడానికి కృషి చేస్తున్నారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అని అన్నట్టుగా కాకుండా గ్రామస్థులను అందులో భాగం చేసి మొక్కలు నాటడం దగ్గరి నుండి అన్ని రకార సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే వాటిపై పరిపూర్ణ అవగాహనను అందిస్తున్నారు.